close

తాజా వార్తలు

మృతదేహాలన్నీ దొరికేవరకూ గాలింపు:కలెక్టర్‌

బాధితులకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హామీ

రాజమహేంద్రవరం: కచ్చులూరు వద్ద గోదావరిలో పడవ ప్రమాద ఘటనకు సంబంధించి నదీ గర్భంలో ఉన్న బోటును వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మృతుల గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేవీపట్నం మండలంలోనే ఆరు మృత దేహాలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. వీటిని వెలికి తీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వాటిని స్వస్థలాలకు పంపించారు. ఇప్పటికి మొత్తం 34 మృతదేహాలను వెలికితీసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. తొలుత కచ్చులూరు ప్రమాదంలో మునిగిపోయిన బోటును ఒడ్డుకు చేర్చేందుకు సంబంధిత నిపుణుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. గతంలో బలిమెల రిజర్వాయర్‌లో పోలీసులు ప్రయాణిస్తున్న మర పడవను మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో ఈ నిపుణుల బృందమే రంగంలోకి దిగింది. ఆ బోటును వీరు బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే బృందం జల వనరులశాఖ, కాకినాడ పోర్టు డైరెక్టర్లతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించింది.

ఆరు మృతదేహాల వెలికితీత
బుధవారం ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. వారిని విశాఖలో నివాసముంటున్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మహేశ్వరరెడ్డి, తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కొడిపికొండ గ్రామానికి చెందిన బస్కి రాజేంద్రప్రసాద్‌, పశ్చిమగోదావరి అప్పనవీడు గ్రామానికి చెందిన నడకుదురు శ్రీనివాస్ ‌(21), హైదరాబాద్‌ టోలీచౌకీకి చెందిన మహమ్మద్‌ తాలిబ్‌ పటేల్‌, విశాఖ జిల్లా అనకాపల్లి మండలం గోపాలపురానికి చెందిన పెద్దిరెడ్ల దాలమ్మగా వారిని గుర్తించారు. ఆరో మృతదేహం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద లభ్యమైంది. ఆ మృతదేహం వరంగల్‌ జిల్లాకు చెందిన హేమంత్‌ కుమార్‌దిగా గుర్తించారు. ఆయన తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఏఈగా పనిచేస్తున్నట్లు తెలిసింది.

సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు
బోటు ప్రమాదంలో మృతిచెందిన అందరి ఆచూకీ లభ్యమయ్యేవరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలు లభించని వారి తాలూకు బంధువులు ఎంపీ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమవారి ఆచూకీ త్వరగా కనుగొనాలని అభ్యర్థించారు.

70-80 మీటర్ల లోతులో బోటు
మునిగిపోయిన బోటును నది మధ్యలో సుమారు 70-80 మీటర్ల లోతులో ఉందని నిపుణులు గుర్తించారు. బోటులో ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే కోణంలో గాలింపు కొనసాగుతోందని.. ఒకవేళ మృతదేహాలు అందులో ఉంటే వాటిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. తమవారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదని కలెక్టర్‌ ఎదుట బాధితులు విలపించారు. ఇంకా ఆచూకీ లభించని వారి కోసం 700 మంది వివిధ బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. అన్ని మృతదేహాలు దొరికేవరకూ ఈ గాలింపు కొనసాగుతుందని కలెక్టర్‌ చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.