close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. నేడు లారీ యజమానుల సమ్మె

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రవాణా చట్టానికి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా సరకు రవాణా వాహనాల సేవలను నిలిపివేయాలని ఆలిండియా లారీ ట్రాన్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సరకు రవాణా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. అడిగితే చాలు అనుమతి

పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ఇక దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అనుమతుల మంజూరును సులభతరం చేసేందుకు ఏపీ అధికారులు అన్ని జిల్లాల్లో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌  (డీ-ఈవోడీబీ)’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల్లో అవసరాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ నిబంధనలను రూపొందించనున్నారు. ఈ మేరకు  పరిశ్రమలశాఖ నమూనాను రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే: రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

తాను కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రతిసారి ఈ విషయంపై అడిగి తనను ఇబ్బంది పెట్టొద్దన్నారు.  బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎంపీ రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సమయంలో రాజగోపాల్‌రెడ్డి అక్కడికి వచ్చారు. రేవంత్‌తో విభేదాలు లేవని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా తనకు సోదరుడితో సమానమని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. లక్ష్యాన్ని మించిన సాగు విస్తీర్ణం

ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌ పంటల సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత రెండోసారి ఖరీఫ్‌ సీజన్‌ సాగు విస్తీర్ణం వంద శాతాన్ని దాటింది. ఈ సీజన్‌ సాధారణ విస్తీర్ణం 43.34 లక్షల హెక్టార్లు కాగా అదనంగా మరో 59,262 హెక్టార్లు పెరగడంతో 101 శాతానికి చేరిందని వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికిచ్చిన తాజా నివేదికలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. సుజనా చౌదరిపై నిఘా కన్ను

భాజపా ఎంపీ సుజనా చౌదరికి గానీ ఆయన బంధువులకు గానీ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూములున్నాయా? అన్న కోణంలో ప్రభుత్వం రహస్యంగా విచారణ చేయిస్తోంది. దీనిపై వారం రోజులుగా రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు గుట్టుగా విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మోగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు గ్రామాల పరిధిలో అధికారుల బృందం పర్యటిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం సరికాదు

ఎస్సీ, ఎస్టీ వర్గాలపై అత్యాచారాలను నిరోధించే చట్టంలోని కొన్ని నిబంధనలు చెల్లవంటూ గత మార్చిలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును బుధవారం త్రిసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పు ఇవ్వవచ్చా అని ప్రశ్నించింది. సమానత్వం కోసం కొన్ని ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సూచన ప్రాయంగా తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వ్యవసాయ భూములకూ గుర్తింపు సంఖ్య

వ్యవసాయ భూములకు ఆధార్‌ తరహాలో ప్రత్యేకంగా గుర్తింపు సంఖ్యలను జారీ చేసే ప్రక్రియను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. వ్యవసాయ భూములను సర్వే చేసిన తరవాత ప్రతి భూమికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య (ఐడీ నెంబర్‌) కేటాయిస్తారు. ఈ గుర్తింపు సంఖ్య ద్వారా ఆ భూమి యజమాని పేరు, విస్తీర్ణం, గతంలో ఆ భూమికి సంబంధించి జరిగిన లావాదేవీలు అన్నీ తెలుసుకునేందుకు వీలుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ: అమిత్‌షా

దేశవ్యాప్తంగా జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దీని అమలుపై లోక్‌సభ ఎన్నికల వేళ భాజపా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారం ఆయనిక్కడ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అసోంలోనే కాదు.. యావద్దేశంలోనూ పౌరపట్టికనూ అమల్లోకి తెస్తాం. ఎవరైనా అమెరికా, ఇంగ్లండ్‌లకు వెళ్లి స్థిరపడదామనుకుంటే అయ్యే పనేనా? భారత్‌లో మాత్రం ఆ వెసులుబాటు ఎందుకు?’’ అని షా ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. జిహాద్‌ పేరిట కశ్మీర్‌లోకి వెళ్లొద్దు: ఇమ్రాన్‌

భారత్‌పై జిహాద్‌ చేయడానికి కశ్మీర్‌లోకి పాకిస్థానీయులెవ్వరూ వెళ్లొదని, అలా వెళ్లిన వారు కశ్మీరీలకు మొదటి శత్రువులవుతారంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హెచ్చరించారు. పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దులో తోర్‌ఖమ్‌ టర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆక్రమిత కశ్మీర్‌పై విరుచుకుపడటానికి భారత్‌ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తోందన్నారు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించి, కర్ఫ్యూను ఎత్తివేసిన తర్వాతే భారత్‌తో చర్చలు ఉంటాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం

ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. మొదట దక్షిణాఫ్రికా 149/5కే పరిమితమైంది. 150 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మరోవైపు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన వినేశ్‌ పట్టు వదలకుండా పతకం కైవసం చేసుకుంది. 53 కేజీల విభాగం కాంస్య పతక పోరులో 4-1 తేడాతో గ్రీస్‌ రెజ్లర్‌ మరియాను ఓడించింది. 2020 ఒలింపిక్స్‌ బెర్తునూ సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.