close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యే ఛాన్సేలేదు:పెద్దిరెడ్డి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలు పకడ్బందీగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పరీక్షల విషయంలో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే  కొంతమంది ఆరోపణలు చేస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సచివాలయ పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని.. ప్రశ్నపత్రాలు బయటకు రావడానికి అవకాశమే లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అసెంబ్లీలో ఆలేరు ఎమ్మెల్యే భావోద్వేగం

అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భావోద్వేగానికి గురయ్యారు. డయాలసిస్‌ రోగులకు పింఛను సౌకర్యం కల్పించాలంటూ తన తండ్రి పడిన వేదనను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ తన తండ్రికి 14 ఏళ్లు డయాలసిస్‌ చేయించాల్సి వచ్చిందని.. అప్పుడు తమ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడిందని చెప్పారు. ఎయిడ్స్‌, ఫైలేరియా బాధితులకు ఆసరా ఫించన్లు ఇచ్చినట్లుగానే డయాలసిస్‌ బాధితులకు కూడా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనసేనకు ఊరట.. థాంక్స్‌ చెప్పిన పవన్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ ఇండియాకు ధన్యవాదాలు చెప్పారు. జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను పునరుద్ధరించినట్లు పవన్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘రాజ్యాంగ బద్ధమైన ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ను నిలబెట్టినందుకు ట్విటర్‌ ఇండియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ ఫాలోవర్స్‌ ట్విటర్‌ ఖాతాలను కొనసాగించినందుకు, వేగంగా స్పందించినందుకు మీకు థాంక్స్‌’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో ఛానళ్ల నిలిపివేతపై హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఓ వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు స్పందించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్రాయ్‌, మాస్టర్‌ ఛానల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీ డిజిటల్‌ నెటవర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు పలువురుకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అభివృద్ధికి తెరాస చేసిందేమీ లేదు:భట్టి

దళిత, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వారిని మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వంపై భట్టి విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కోసం తెరాస చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన పనులనే వారు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు కొంత మేర కృష్ణా పరివాహక ప్రాంతంలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి వారికి భూమిని కేటాయించామని భట్టి గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘అయోధ్య’ కోసం మరో గంట కూర్చుంటాం

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణను నిర్ణీత గడువులోపు పూర్తిచేసేందుకు మరో గంట ఎక్కువ పనిచేస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని వెల్లడించింది. ‘సెప్టెంబరు 23 నుంచి మరో గంటసేపు కూర్చుంటాం. రోజువారీ వాదనల సమయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పెంచుతున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయం: మోదీ

మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు కార్పొరేట్‌ పన్నులు తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని చారిత్రక నిర్ణయంగా కొనియాడారు. ‘కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించాలన్న నిర్ణయం చారిత్రకమైంది. మేక్‌ ఇన్‌ ఇండియాకు ఇది మరింత ఊతమిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ప్రైవేటు సెక్టారులో పోటీని పెంచుతుంది. మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మార్కెట్లకు ‘పన్నోత్సాహం’

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే దిశగా కార్పొరేట్‌ రంగంలో పన్ను సంస్కరణలు తీసుకొచ్చిన వేళ.. ఈ శుక్రవారం దలాల్‌స్ట్రీట్‌ బాక్సాఫీస్‌ బద్దలుకొట్టింది. మార్కెట్లు లాభాల కలెక్షన్‌ రాబడుతూ మదుపర్లను ఉర్రూతలూగించింది.  ప్రభుత్వ పన్ను ఊరడింపులతో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా సూచీలు లాభాల రేస్‌లో దూసుకెళ్లాయి. రోజంతా భారీ లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్‌  ఆఖరుకు 1924 పాయింట్ల లాభంతో 38,015 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 569 పాయింట్లు లాభపడి 11,274 వద్ద ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘జయలలిత’ కోసం కంగన.. మారిందిలా..!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెబ్‌ సిరీస్‌లు‌, చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్లు ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. పాత్ర కోసం తమిళం నేర్చుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల కంగన తెలిపారు. తాజాగా కంగనా రనౌత్‌ ఫ్రోస్థటిక్‌ మేకప్‌ కోసం దర్శకుడు విజయ్‌, నిర్మాత బ్రిందా ప్రసాద్‌లతో కలిసి కాలిఫోర్నియా వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ 10 మంది క్రికెటర్లను నిషేధించాలి

తమ జాతీయ జట్లతో పాకిస్థాన్‌లో పర్యటించొద్దని భావిస్తున్న క్రికెటర్లను పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడకుండా నిషేధం విధించాలని పాక్‌ ఆటగాళ్లు సయీద్‌ అజ్మల్‌, ఫైజల్‌ ఇక్బాల్‌ అన్నారు. తమ దేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు ఇష్టపడని 10 మంది శ్రీలంక క్రికెటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీల ఒత్తిడి ఉంటుందని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.