close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం తితిదే అంకురార్పణ చేయనుంది. సోమవారం ధ్వజారోహణం తర్వాత వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ముందు రోజు సాయంత్రం స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయ పరిసరాలను పర్యవేక్షిస్తారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణలో భాగంగా అర్చకులు ఆలయ నైరుతి దిశలో నిర్ణీత ప్రదేశంలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. భళా భారత్‌

గత అయిదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా భారత్‌పై గౌరవం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హ్యూస్టన్‌లో భారతీయులు నిర్వహించిన సభను చూసి ప్రపంచ నేతలంతా ఆశ్చర్యపోయారని తెలిపారు. అమెరికాలో వారం రోజుల పాటు విజయవంతంగా పర్యటించి శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో స్వదేశానికి చేరుకున్న ఆయనకు దిల్లీలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు దాదాపు 50వేల మంది ప్రజలు, భాజపా శ్రేణులు తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. స్థానిక పోరుకు సన్నద్ధం

పురపాలక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబరు మార్చి మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు ఎన్నికల్నీ ఒకేసారి నిర్వహించాలా? లేక వేర్వేరుగా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. వెయ్యి పడకల ఎయిమ్స్‌!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ను వెయ్యి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే హామీ ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచీ రోగుల తాకిడి పెరుగుతున్నందున ఎయిమ్స్‌ స్థాయిని వెయ్యి పడకలకు పెంచాలని తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పోలీసులకు వారాంతపు సెలవు

తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవు ఇచ్చేందుకు సిద్ధమైంది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటగా పశ్చిమ మండల పరిధిలో హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి అధికారి వరకు ఈ వారాంతపు సెలవును వర్తింపజేయాలంటూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు సూచించారు. ఈ బాధ్యతలను డివిజన్‌ ఏసీపీలు పర్యవేక్షించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. 10న ‘అనంత’లో కంటివెలుగు ప్రారంభం

వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని అక్టోబరు 10న అనంతపురంలో సీఎం జగన్‌ ప్రారంభిస్తారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తొలిదశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా  5.6 కోట్ల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించి, కంటిఅద్దాలనూ పంపిణీ చేస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. హుజూర్‌నగర్‌ బరిలో తెదేపా

హుజూర్‌నగర్‌ శాసనసభ ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిని పోటీకి  నిలపాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శనివారం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంతో పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు చర్చించాక పార్టీ నిర్ణయం తీసుకుంది. సమావేశ వివరాలను పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. తెలంగాణలో పార్టీకి పునర్‌వైభవం రావాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు సూచించారని తెలిపారు. ఆదివారం అభ్యర్థి పేరు ప్రకటించి చంద్రబాబు బీఫాంను అందజేస్తారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘శివసైనికుడిని సీఎం చేస్తా..’

శివసైనికుడిని మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా చేస్తానని శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్‌ఠాక్రేకు మాట ఇచ్చానని ఆయన తనయుడు ఉద్దవ్‌ ఠాక్రే శనివారం పార్టీ నాయకులతో అనడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్రకు దేవేంద్ర ఫడణవీస్‌ మరోసారి సీఎం అవుతారని భాజపా ప్రకటిస్తుండగా తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్దవ్‌ ప్రయత్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ప్రభుత్వ మద్యం దుకాణాలు 3,500

అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలోని 3,500 మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి (అబ్కారీ, వాణిజ్య పన్నులు) నారాయణస్వామి తెలిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వివరించారు. నిర్వహణలో అక్రమాలకు అవకాశం లేకుండా ఒక్కో ఎస్‌ఐ, సీఐకి 10 దుకాణాల చొప్పున బాధ్యతలను అప్పగించామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కొత్త బుల్లెట్‌ కోల్‌మన్‌

100 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ ఛాంపియన్‌ వచ్చాడు. అనుకున్నట్లే ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ 100 మీ. పరుగులో అమెరికా సంచలనం క్రిస్టియన్‌ కోల్‌మన్‌ విజేతగా నిలిచాడు. గత ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన కోల్‌మన్‌.. ఈసారి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అతను 9.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానం సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.