close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 AM

1. 30 రోజుల్లో చేరితేనే కొలువు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం నుంచి నియామక పత్రాలు అందజేయనున్నారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని మొదటి నియామక పత్రాన్ని అందజేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రం అందుకున్న 30 రోజుల్లో విధుల్లో చేరాలి. లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. దేశవ్యాప్తంగా హెల్ప్‌లైన్‌ నంబరు 112 అమలు

దేశవ్యాప్తంగా అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబరు 112 అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం దిల్లీలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు చెప్పారు. 112 నంబరు ద్వారా పోలీసు, ఫైర్‌, హెల్త్‌, మహిళా భద్రత తదితర పలు రకాల అత్యవసర సేవలను ప్రజలు పొందవచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బిహార్‌, యూపీ విలవిల

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిహార్‌, ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఆదివారం ఒక్కరోజే ఉత్తర్‌ప్రదేశ్‌లో 14 మంది, బిహార్‌లో 18 ప్రాణాలు మరణించారు. గత నాలుగురోజుల్లో యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో మొత్తం 137 మంది మృతి చెందారు. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 5 నుంచి ఆర్టీసీ సమ్మె!

ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. అక్టోబరు 5వ తేదీ ఉదయం మొదటి షిఫ్టు నుంచి సమ్మెకు దిగుతున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం  బస్‌భవన్‌ ఎదుట ఐకాస నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చలతో ఫలితం లేనందువల్లనే తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఇక్కడా భారీగానే నామినేషన్లు?

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు. ప్రధానపార్టీలతో పాటు అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ సంఘాలు ఉప ఎన్నికను వేదికగా మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా నామినేషన్లు దాఖలయ్యేందుకు అవకాశాలున్నాయని నేతలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నెహ్రూది మహా తప్పిదం

జమ్మూ-కశ్మీర్‌ అంశంపై 1948లో నాటి ప్రధాన మంత్రి నెహ్రూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)ను ఆశ్రయించడం మహా తప్పిదమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ‘‘నాడు భారత్‌.. ఐరాస చార్టర్‌లోని 35వ ఆర్టికల్‌ కింద సమితిని ఆశ్రయించింది. అది వివాదాస్పద ప్రాంతానికి సంబంధించిన నిబంధన. అలా కాకుండా 51వ అర్టికల్‌ కింద ఆశ్రయించి ఉంటే అది భారత భూభాగంపై పాక్‌ దురాక్రమణకు సంబంధించిన అంశమై ఉండేది’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బోటు వెలికితీసేందుకు బయల్దేరిన బృందం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. బాలాజీ మెరైన్‌ సంస్థ యజమాని ధర్మాడి సత్యం బృందం రోప్‌, లంగర్లతో బయలుదేరారు. దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీగా సామగ్రిని ప్రమాద ప్రాంతానికి ప్రత్యేక బోటులో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోటు వెలికితీసే సమయంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి 144సెక్షన్‌ విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అక్టోబర్‌ 3 నుంచి ‘వందేభారత్‌’ పరుగులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌/ట్రైన్‌ 18 ఎక్స్‌ ప్రెస్‌ ట్రయల్ రన్‌ దిల్లీ-కర్తా మార్గంలో విజయవంతం అయినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ రైలు సర్వీసు దిల్లీ-వారణాసి మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా న్యూ దిల్లీ-శ్రీ వైష్ణో దేవి కత్రా మధ్య అక్టోబర్‌ 3 నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రూ.30,000 కోట్ల మధ్యంతర డివిడెండు కోరనున్న ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు లక్ష్యాన్ని (జీడీపీలో 3.3 శాతం) చేరుకోవడానికి ఆర్‌బీఐ నుంచి రూ.30,000 కోట్ల మధ్యంతర డివిడెండును ప్రభుత్వం కోరే అవకాశం ఉందని సమాచారం. అటు డివిడెండుతో పాటు ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం, జాతీయ చిన్న పొదుపు మొత్తాలను (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) వినియోగించుకోవడం వంటి చర్యలు చేపట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భారత్‌దే శాఫ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌

భారత్‌ అండర్‌-18 జట్టు శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 2-1 గోల్స్‌తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. రెండో నిమిషంలో విక్రమ్‌ ప్రతాప్‌ చేసిన గోల్‌తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే యాసిన్‌ (40వ ని) కొట్టిన గోల్‌తో బంగ్లా స్కోరు సమం చేసింది. ఇంజురీ సమయంలో 30 గజాల దూరంలో నుంచి రవి బహుదూర్‌ మెరుపు గోల్‌ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.