close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. బాపూ రాసిన ప్రార్థన గీతం

మహాత్మాగాంధీకి భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా బ్రిటిష్‌వారిలోనూ అభిమానులున్నారు. ఎఫ్‌. మేరీ బార్‌ అనే బ్రిటిష్‌ అభిమాని కోసం బాపూజీ ఒక ప్రార్థనా గీతం రాశారు. 1943 సెప్టెంబరు ప్రాంతంలో రాసిన దాన్ని.. ఆ తర్వాత హైదరాబాద్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ గోడపై చెక్కించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థనా గీతాన్ని గుజరాతీ, హిందీ భాషల్లోకి అనువదించారు. అనంతరం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో ఒక శిలాఫలకంపై ఇంగ్లిషుతో పాటు గుజరాతీ, హిందీ భాషల్లోనూ చెక్కించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గట్టి చర్యలతో ఆర్టీసీని గట్టెక్కిద్దాం

ఆర్టీసీ కార్మికుల సమస్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై తీవ్రంగా చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం వారి డిమాండ్లను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో వెంటనే ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులను మంత్రిమండలి కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆంధ్రప్రదేశ్‌లో పుర పోరుపై సన్నాహాలు

పురపాలక, నగరపాలక సంస్థలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించేందుకు పరిశీలిస్తున్నామని.. లేనట్లయితే సంక్రాంతి తరువాత నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వార్డుల పునర్విభజన, 2011 లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ అన్ని పట్టణాల్లోనూ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను విలీనం చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాలు, తాజాగా వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మంత్రులకే హెడ్‌ మాస్టర్‌లాంటోణ్ని

రాజ్యాంగపదవిలో ఉన్న తాను దాని గౌరవాన్ని కాపాడుతానని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలి ఛైర్మన్‌ పదవికున్న పరిధి ఏమిటో తనకు తెలుసని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను మంత్రులకు హెడ్‌మాస్టర్‌లాంటి వాడినని, తనకు మంత్రి పదవి పెద్దది కాదని అన్నారు. తనపై ఇటీవల కొందరు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. వాళ్లు మండలి ఛైర్మన్‌, గవర్నర్‌ అధికారాలేంటో తెలుసుకుని మాట్లాడితే మంచిదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు రేపు

ప్రతి నెలా ఒకటో తేదీకల్లా జీతాలు పొందే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఈసారి  రెండు రోజులు ఆలస్యంగా అందుకోనున్నారు. ఆర్టీసీ నిధులతోపాటు, ప్రభుత్వం నుంచి సర్దుబాటు అయ్యే మొత్తం కలిపి జీతాలు చెల్లిస్తారు. ఈ నెల ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోయింది. ఆర్టీసీ ఉద్యోగులందరికీ కలిపి ప్రతి నెలా రూ.285కోట్ల మేర గ్రాస్‌ జీతాలు, అందులో చేతికందే మొత్తం కింద రూ.150కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి ప్రభుత్వ నిధుల విడుదల జాప్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కశ్మీర్‌ యాపిల్‌ రైతులకు ఉగ్రవాదుల బెదిరింపులు

జమ్మూ-కశ్మీర్‌లో కొందరు ఉగ్రవాదులు యాపిల్‌ రైతులను బెదిరిస్తుండటంతో వారు ప్రభుత్వానికి (నాఫెడ్‌కు) నేరుగా యాపిల్‌ పండ్లను అమ్మేందుకు సుముఖత చూపడం లేదు. 370వ అధికరణం రద్దు తరవాత రైతులను ఆదుకునేందుకు నాఫెడ్‌ ద్వారా నేరుగా 12లక్షల మెట్రిక్‌ టన్నుల యాపిళ్లను కొనాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బయట రాష్ట్రాల మార్కెట్లకు, ప్రభుత్వానికి అమ్మవద్దని, చెట్ల నుంచి కూడా కోయవద్దని కొందరు గుర్తు తెలియని ఉగ్రవాదులు గోడ పత్రికలు(పోస్టర్లు) వేసి రైతులను బెదిరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకోవద్దు

‘కేవలం మీవి ప్రాంతీయ పార్టీలు. మాది జాతీయ పార్టీ. ప్రపంచంలోనే శక్తిమంతమైన మోదీ నాయకత్వం కింద పని చేస్తున్నామనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరా..నన్ను ఆ పార్టీకి అద్దె మైకు..ఈ పార్టీకి అద్దె మైకు అని విమర్శించేది? బ్లాక్‌ మెయిల్‌ చేసి సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తే వదిలే ప్రసక్తేలేదు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. గుంటూరులో మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై  ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వినియోగదారుల ఫిర్యాదులకు యాప్‌

వినియోగదారులు తమ సమస్యలు సులభంగా నమోదు చేయడంతో పాటు, 15-60 రోజుల్లో పరిష్కారం పొందేందుకు అనువైన ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం మంగళవారం ఆవిష్కరించింది. సులభంగా పరిష్కరించే అంశాలను 15 రోజుల్లో, క్లిష్టమైన అంశాలను 60 రోజుల్లో పరిష్కరించేందుకు వీలుగా ‘కన్జూమర్‌ యాప్‌’ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంగ్లం, హిందీ భాషల్లో వినియోగానికి వీలున్న ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశవాన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిన్న బుమ్రా.. నేడు హార్దిక్‌

టీమిండియాను గాయాల సమస్య వేధిస్తోంది. కీలక ఆటగాళ్లు ఒకొక్కరుగా గాయాలతో ఆటకు దూరమవుతున్నారు. ఆటగాళ్లపై పని భారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ.. తగినంత విశ్రాంతి ఇస్తున్నా సరే.. గాయాల సమస్య వీడట్లేదు. ఇప్పటికే ప్రధాన ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను నొప్పితో అయిదారు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సైతం అదే గాయంతో ఆటకు అందుబాటులో లేకుండా పోయాడు. అతను ఏకంగా అయిదు నెలల పాటు మైదానంలో కనిపించడని సమాచారం. హార్దిక్‌ పాండ్యను దీర్ఘకాలికంగా వేధిస్తున్న వెన్ను నొప్పి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోర్టు మెట్లెక్కిన అఖిల్‌.. పూజ

అఖిల్‌ కథానాయకుడిగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కోర్టు నేపథ్యంగా సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అఖిల్‌, పూజా హెగ్డే, గిరిబాబు, కాశీ విశ్వనాథ్‌ తదితరులపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘‘కుటుంబ అనుబంధాల నేపథ్యంగా సాగే ప్రేమ కథ ఇది. అఖిల్‌, పూజల జోడీ అలరిస్తుంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంద’’ని చిత్రవర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.