close

తాజా వార్తలు

భాజపా గూటికి వీరేందర్‌ గౌడ్‌

దిల్లీ: మాజీ మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ తనయుడు, తెలంగాణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు వీరేందర్‌ గౌడ్‌ కమలం గూటికి చేరారు. గురువారం మధ్యాహ్నం దిల్లీలో మురళీధర్‌రావు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఆయనతో పాటు ఏపీకి చెందిన కొందరు నేతలు కూడా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులపేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. చుక్కనీరు ఇవ్వకుండా.. ఒక్క ఎకరా కూడా అదనంగా సాగులోకి తీసుకురాకుండా ప్రజలకు మాయమాటలు చెబుతోందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా మళ్లీ కమీషన్లు దండుకోవడానికి, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కమీషన్లు దండుకునే యావతోనే కొత్త ప్రాజెక్టుల పనులు చేపడతామంటున్నారని ఆక్షేపించారు. 

హుజూర్‌నగర్‌లో అధికార పార్టీ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార పార్టీనేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కోట్లు వెదజల్లుతోందన్నారు. ఎస్పీ, కలెక్టర్‌, అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి కనుసన్నల్లోనే వారు పనిచేస్తుంటే ఎన్నిక పారదర్శకంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హుజూర్‌నగర్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈసీని కోరనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతల మురళీధర్‌రావు, లక్ష్మణ్‌, గరికపాటి, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

భాజపా గూటికి పలువురు ఏపీ నేతలు
ఏపీకి చెందిన పలువురు నేతలు భాజపా గూటికి చేరారు. భాజపా జాతీయ నేతలు మురళీధర్‌రావు, సుధాంశు త్రివేది సమక్షంలో కాషాయ జెండాను కప్పుకొన్నారు. భాజపాలో చేరిన వారిలో శనక్కాయల అరుణ, వాకాటి నారాయణ రెడ్డి, పూతల పట్టు మాజీ ఎమ్మెల్య రవి, తోట నగేశ్‌, చింతల పార్థసారథి, శ్రీనివాసరావు, హైకోర్టు మాజీ జడ్జి బాలయోగి భాజపాలో చేరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ నేత రావెల కిశోర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.