close

తాజా వార్తలు

ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉద్దేశం లేదు: కేసీఆర్‌

హైదరాబాద్‌: భవిష్యత్‌లో ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని.. సంస్థను ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని.. అది వివేకమైన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన గడువులోపు విధుల్లో చేరకుండా కార్మికులే ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ చేసుకున్నారని కేసీఆర్‌ అన్నారు. కార్మిక సంఘాల అతిప్రవర్తనే ఈ చర్యలకు ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 1200 మంది కార్మికులే ఉన్నారని పునరుద్ఘాటించారు. డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికులు గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ చర్యలపై ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అద్దె బస్సులు, కొత్త నియామకాలు, ప్రైవేటు సర్వీసులకు రూట్‌ పర్మిట్లపై ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపైనా సమీక్షించారు. నిన్న జరిగిన సమీక్షకు కొనసాగింపుగా సుమారు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

“ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్‌లో మూడు రకాలుగా విభజించి నడపాలి. 50 శాతం బస్సులు అంటే 5,200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయి. 30 శాతం బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే నడపాలి. మిగిలిన 20 శాతం బస్సులు పూర్తిగా ప్రైవేటువి. వాటికి ప్రైవేట్‌ స్టేజ్‌ క్యారేజ్‌గా అనుమతిస్తారు. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలో కూడా నడపాలి. ఆర్టీసీ ఛార్జీలు, ప్రైవేటు బస్సు ఛార్జీలు సమానంగా ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. ఛార్జీలు స్వల్పంగా పెంచాలన్నా ఆర్టీసీ కమిటీ నిర్ణయం అవసరం. ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అద్దెకు తీసుకోవాల్సింది మరో 9 శాతం మాత్రమే. అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే” అని సీఎం అన్నారు.

యూనియన్ల అతిప్రవర్తనే కారణం..

“ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనే. ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ల అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ యాజమాన్యానికి ఇవ్వడం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం. పండగలకు, విద్యార్థుల పరీక్షలకు ఎవరూ కష్ట పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సమ్మె ఉద్ధృతం చేస్తామనడం హాస్యాస్పదం. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది కేవలం 1200 మాత్రమే. మిగతావారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదు. ఎవరూ డిస్మిస్ చేయకుండా వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు. గడువులోగా విధుల్లో చేరకపోవడంతో వాళ్లు ‘సెల్ఫ్ డిస్మిస్’ అయినట్లే. తొలగిపోయిన వారు డిపోల దగ్గర గానీ, బస్ స్టేషన్ల దగ్గర గానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించా. విధుల్లో ఉన్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటారు’’ అని కేసీఆర్‌ అన్నారు.
 

భవిష్యత్‌లో యూనియనిజం ఉండదు..

“ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగులు, తదితరుల సబ్సిడీ బస్ పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయి. ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దానికి కావాల్సిన నిధులు బడ్జెట్లో కేటాయిస్తాం. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్థిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్లో ఇక ఆర్టీసీలో యూనియనిజం ఉండదు. ఆర్టీసీ భవిష్యత్‌లో లాభాలకు వచ్చి కార్మికులకు (కొత్తగా చేరేవారికి) బోనస్ ఇచ్చే పరిస్థితికి రావాలి. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.