close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. రూ.300 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

తిరుపతి రైల్వేస్టేషన్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన .. తిరుపతి స్టేషన్‌లో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ యూనిట్లను ప్రారంభించారు. చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ... రూ.300కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కర్రల సమరంలో 50మందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా విజయ దశమి రోజున జరిగే కర్రల సమరం (బన్నీ ఉత్సవం)లో 50మందికి పైగా గాయాలపాలవగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే తమ ఇలవేల్పును దక్కించుకునేందుకు అయిదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఆచారాన్ని ప్రజలు ఈ సారి కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వాయుకాలుష్యానికి ఆస్ర్పిన్‌తో చెక్‌

వాయుకాలుష్యం వల్ల కలిగే దుష్ర్పభావాలకు ఆస్ర్పిన్‌ మాత్రతో అడ్డుకట్ట వేయచ్చని ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడయింది. దీని ప్రకారం ఆస్ర్పిన్‌ వంటి స్టెరాయిడ్‌ రహిత నొప్పినిరోధక ఔషధాలు, కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల పనితీరుపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయట. బోస్టన్‌లో 73 ఏళ్ళ సరాసరి వయసు గల 2,280 మంది ఊపిరితిత్తుల పనితీరుపై 28 రోజులు పరీక్షలు జరిపారు. దీనిలో పాల్గొన్నవారి ఆరోగ్యస్థితి, పొగతాగే అలవాటు, నొప్పినిరోధక ఔషధాల వాడకం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌ చేతికి తొలి రఫేల్‌ యుద్ధ విమానం

భారత వైమానికదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్‌ రూపొందించిన రఫేల్‌ యుద్ధవిమానం భారత్‌ చేతికి అందింది. ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్‌లో డసోల్ట్‌ ఏవియేషన్‌  కర్మాగారంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  రఫేల్‌ యుద్ధవిమానాన్ని అధికారికంగా స్వీకరించారు. రఫేల్‌ను అందుకున్న అనంతరం విమానానికి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయుధపూజ నిర్వహించారు. భారత్‌కు మొత్తం 36 విమానాలు అందనుండగా ఇది తొలి విమానం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. ఈ మేరకు పురస్కార కమిటీ మంగళవారం ప్రకటించింది. 2019గాను జేమ్స్‌ పీబెల్స్‌, మైకెల్‌ మేయర్‌, డైడియర్‌ క్యూలోజ్‌లకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. భౌతిక విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలిఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందున వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శని గ్రహం.. చందమామల రారాజు ..

కొత్తగా కనుగొన్న ఇరవై చందమామలతో గురుగ్రహాన్ని దాటేసిన శని, సౌరకుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలతో చందమామల రారాజుగా అవతరించాడు. అమెరికాలోని కార్నెగీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన స్కాట్‌ ఎస్‌ షెపర్డ్‌ నేతృత్వంలోని శాస్ర్తవేత్తల బృందం ఆవిష్కరణతో శనిగ్రహానికున్న మొత్తం ఉపగ్రహాల సంఖ్య 82గా తేలింది. ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఒకే పెద్ద చందమామగా ఉండేవట. ఒక విస్ఫోటనం వల్ల ఇవి ఆ పెద్ద చందమామ నుండి విడివడి, స్వతంత్ర్య పరిభ్రమణం ఆరంభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇమ్రాన్‌ను వీడని ‘సైనిక నీడ’ 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చైనా పర్యటన ప్రారంభమైంది. చైనా సాంస్కృతిక శాఖ మంత్రి ఇమ్రాన్‌కు స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకొంది. పర్యటనకు ముందు వరకు ఇమ్రాన్‌ సహా కొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ, చివరి 24గంటల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని సహా అనేక మంది మంత్రులు ముఖ్యంగా ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాని బృందంలో చేర్చారు. పైగా ఇమ్రాన్‌ అక్కడికి చేరుకోవడానికి ముందే బజ్వా చైనాకు వెళ్లి అక్కడి సైనికాధికారులతో చర్చలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఛారిటీ కోసం ఫుట్‌బాల్‌ ఆడిన ధోని

టీమిండియా వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సోమవారం బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌, టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌తో కలిసి ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. రితి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛారిటి మ్యాచ్‌ కోసం పలువురు క్రికెటర్లతో పాటు మరో బాలివుడ్‌ నటుడు సమిర్‌ కొచ్చార్‌, కొరియోగ్రాఫర్‌ కేసర్‌ గొన్‌సాల్వ్స్‌ పాల్గొన్నారు. రితి స్పోర్డ్స్‌ సంస్థ తమ ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆటగాళ్లతో ధోనీ కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అంతకుముందు ధోనీ ఆదివారం అర్జున్‌కపూర్‌తో కలిసి సరదాగా ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో సందడి చేసిన నాగ్‌

అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌. దసరా సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. వారాంతంలో కేవలం టీవీ నుంచే ఇంటి సభ్యులతో మాట్లాడే నాగార్జున నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడంతో ఇంటి సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో బంగార్రాజు పాత్ర గెటప్‌లో వచ్చి ఇంటి సభ్యులను ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఆటపట్టిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంటి సభ్యులకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దంతేరాస్‌కు బంగారం అమ్మకాలు అంతంతే..!

పండగలు, పెళ్లిళ్లు ఇలా శుభకార్యం ఏదైనా ఠక్కున గుర్తొచ్చేది బంగారమే. అక్షయ తృతీయ, దంతేరాస్‌ వచ్చాయంటే ఇక పుత్తడి విక్రయాలు జోరందుకుంటాయి. కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది దంతేరాస్‌ (దీపావళి)కు మాత్రం మునుపటి మెరుపులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ సారి దంతేరాస్‌కు కనీసం 50 శాతం వరకు అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని బులియన్‌ వర్తకులు పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.