close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం

భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టుపై టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టు ఆలౌట్‌ కాగా, ఫాలో ఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు మరో 189 పరుగులు మాత్రమే చేసింది. మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్‌

తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంత మంది డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమించిన విషయం తెలిసిందే. వీరిలో డ్రైవర్లకు రూ.1500, కండక్టర్లకు రూ. 1000 రోజువారీ వేతనంగా ఆర్టీసీ ఇస్తోంది. మరికొంత మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘ఆర్టీసీ జేఏసీ మమ్మల్ని సంప్రదించలేదు’

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం బాధాకరమని టీఎన్జీవో నేత రవీందర్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మద్దతు ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సమ్మెకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగుల జేఏసీని సంప్రదించలేదని రవీందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను యాజమాన్యం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. దిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం

దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకొంది. శుక్రవారం 208, శనివారం 222గా ఉన్న ఎయిర్‌  క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) ఆదివారం నాటికి 256కి ఎగబాకింది. రెండో వారం ముగిసే సరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(సఫర్‌) అంచనా వేసింది. దిల్లీ శివార్లలోని ఆనంద్‌ విహార్‌, వాజీపూర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే ఏక్యూఐ 300కి చేరిందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సత్తుపల్లి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో గేటు ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అఖిల పక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. దీంతో పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కార్మికులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భారత్‌కు షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్‌

ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు ఆరు శాతానికి పడిపోనుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. తొలి త్రైమాసికాల్లో వృద్ధి రేటు భారీగా కుచించుకుపోయిన వేళ ప్రపంచ బ్యాంక్‌ అంచనాలు కలవరపెడుతున్నాయి. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 6.9శాతంగా ఉన్న రేటులో 0.9శాతం మేర కోతపడనుందని స్పష్టం చేసింది. అయితే 2021లో 6.9శాతానికి, 2022లో 7.2శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అది మీ సొంత వ్యవహారం కాదు:దేవినేని

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీ జలాల పర్యవేక్షణకు అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైనా .. ఈ కమిటీని పరిగణనలోకి తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ సుముఖంగా లేరని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నదీ జలాలపై రాష్ట్రాల మధ్య  తలెత్తే అభ్యంతరాలను అపెక్స్‌ కమిటీ పరిష్కరిస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేశారని.. అయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం తమ సొంత వ్యవహారంలా ప్రకటనలు చేయడం దారుణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

సమ్మె పరిణామాలతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రవి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. నిప్పంటించుకునే సమయంలో వెంటనే సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పోలీసులు ఆయన్ను అడ్డుకుని కాపాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. మన చేతిలో రఫేల్‌ ఉండి ఉంటే...

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం హరియాణాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రక్షణ పరమైన ఒప్పందాలన్నీ భాజపా హయాంలోనే జరిగాయని అన్నారు. దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం ధైర్యంగా అడుగులేస్తోందన్నారు. మన దగ్గర రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నట్లయితే బాలాకోట్‌లో వాయుదాడులు జరిగేవే కాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మంజురాణి ఓటమి

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్‌ మంజురాణి ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో రష్యా బాక్సర్‌ ఎకతెరిన పాల్సివ చేతిలో మంజు 4-1తేడాతో ఓటమి చెందింది. దీంతో ఆమె వెండి పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత బాక్సర్‌.. థాయ్‌లాండ్‌కు చెందిన చతామత్‌ రక్‌సాత్‌ను 4-1తో ఓడించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.