close

తాజా వార్తలు

ఉద్ధృత రూపం దాల్చుతున్న ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్‌: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. వరుసగా పదో రోజు కూడా కార్మికులు పట్టు వీడలేదు. తమ డిమాండ్ల సాధన కోసం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట బైఠాయించారు. ఆర్టీసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎవరూ భావోద్వేగాలకు గురై బలిదానాలకు పాల్పడవద్దని, పోరాడి తమ డిమాండ్లను సాధించుకుందామని ఐకాస నేతలు ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. 

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సంతాపంగా ఆర్టీసీ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఐకాస బంద్‌కు కాంగ్రెస్‌, తెదేపా, తెజస, సీపీఐ, సీపీఎం సహా విద్యార్థి సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. ఖమ్మంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన బస్సులను కార్మికులు అడ్డుకుంటున్నారు. సమస్యల పరిష్కారం జరిగే వరకు పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. 

హైదరాబాద్‌ బస్‌ భవన్‌ ముట్టడి!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్‌ డిపో ఎదుట కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వారికి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు తెలిపారు. అంతేకాకుండా సమ్మెకు తమ మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ ఒకటో డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి డిపో ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లలు సైతం ప్లకార్డులు పట్టుకొని తల్లిదండ్రుల నిరసనకు మద్దతు పలికారు.

సమ్మెను రాజకీయం చేయాల్సిన అవసరం మాకులేదు: సీతక్క
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.  ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి, కండక్టర్‌ సురేంద్రగౌడ్‌ల చిత్రపటాలకు నివాళులర్పించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ములుగు జిల్లాలోనూ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాతో డిపోల నుంచి బస్సులు కదలడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క కార్మికులకు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెను రాజకీయం చేయాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.