close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. తెలంగాణ రాష్ట్ర బంద్‌ సంపూర్ణం: ఆర్టీసీ ఐకాస

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్ర బంద్‌ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బంద్‌కు  మద్దతిచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు. అరెస్టు చేసే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేనో ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే: ఏపీ డీజీపీ

పోలీసులు, ప్రజల మధ్య సహకారం ఇంకా పెరగాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆకాంక్షించారు. ఇటీవల పోలీసులపై ఓ రాజకీయ పార్టీ చేసిన ఆరోపణలపై స్పందించబోమని తెలిపారు. తెదేపా ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల కలవలేకపోయానన్నారు. అయినా వారిచ్చిన ఫిర్యాదు.. మీడియాతో పాటు సామాజిక మీడియా ద్వారా తన వద్దకు ముందే వచ్చిందని వెల్లడించారు.  తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమేనని, తనకు తెలిసిందల్లా ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడమేనని డీజీపీ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విద్యుత్‌ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం

విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో విద్యుత్‌ సంస్థల సీఎండీలతో కార్మిక సంఘాలు దాదాపు రెండు గంటలపాటు చర్చించాయి. ఆర్టిజన్ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని 1104 యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా తెలిపారు. కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విద్యాశాఖలో సమూల మార్పులు: మంత్రి సురేశ్‌

ఐదేళ్లలో రాష్ట్రంలోని 44వేల పాఠశాలలు, కళాశాల భవనాల రూపురేఖలు మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఇంజినీర్లు ఉద్యమంలా పని చేయాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పిలుపునిచ్చారు. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యాశాఖ ఇంజినీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. చాలా చోట్ల పాఠశాల భవనాలు 18 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, నాణ్యత ప్రమాణాలు ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు పాటించలేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈటల, హరీశ్‌ కూడా ద్రోహులే: లక్ష్మణ్‌

పదవులు శాశ్వతం కాదని తెరాస నేతలు గుర్తుంచుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సూచించారు. ఉద్యమంలో పాల్గొనని వారిని ద్రోహులని తెరాస నేతలు గతంలో అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్మికుల ఉద్యమంలో పాల్గొనని మంత్రులు ఈటల, హరీశ్‌రావు కూడా  ద్రోహులేనని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలకు ప్రజలు ముఖ్యమా, పదవులా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అప్రజాస్వామిక విషయాన్ని కేంద్రానికి నివేదిస్తున్నట్టు చెప్పారు. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం రావడంలేదని  మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యోయో టైంలో దాదా అధ్యక్షుడైతే బాగుండేది

క్రికెట్‌లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు సౌరభ్‌గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాల్సిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో నియమితమవుతున్న గంగూలీకి యువీ శుభాకాంక్షలు తెలిపాడు.  ‘గొప్ప వ్యక్తి ప్రయాణం ఇంకా గొప్పగా ఉంటుంది. భారత జట్టు సారథి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదగడం ఎంతో గొప్ప విషయం. ఒక పాలకుడిగా ఆటగాళ్ల దృక్కోణాన్ని ఇతరులకు వివరించే వీలుంటుంది’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రిలయన్స్‌ బోర్డులోకి మాజీ సీవీసీ కేవీ చౌదరి

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా కేవీ చౌదరి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1978 ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)బ్యాచ్‌కు చెందిన ఆయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సంస్థ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఆయన పదవీ విరమణ చేశాక రెవెన్యూశాఖకు సలహాదారుగా నియమితులయ్యారు. నల్లధనంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సూచనలు చేశారు. ఆయన 2015 నుంచి 2019 జూన్‌ వరకు సీవీసీగా బాధ్యతలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రహానె ‘హిట్‌’ జోడీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 224/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (117; 164 బంతుల్లో 14 ఫోర్లు, 4 ) శతకంతో చెలరేగాడు. హిట్‌మ్యాన్‌కు తోడుగా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె (83*; 135 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్) కూడా అర్ధశతకంతో మెరవడంతో.. మొదటిరోజు సఫారీలపై భారత్‌ పైచేయి సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూమర్స్‌పై స్పందించిన బిగ్‌బి

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ సాధారణ చికిత్స నిమిత్తం గత కొన్నిరోజుల క్రితం ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. అయితే అమితాబ్‌ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అమితాబ్‌ సోషల్‌మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాల్వలోకి దూసుకెళ్లిన కారు వెలికితీత

సూర్యాపేట జిల్లా చాకిరాల వద్ద నిన్న రాత్రి సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన కారును ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. దాదాపు 15 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశాయి. వెలికితీసిన కారులో ఆరు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్న రాత్రి నుంచి సంఘటనా స్థలంలోనే నిరీక్షించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కారు వెలికితీత పనులు ఆలస్యం అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.