close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. ట్యాక్సీడ్రైవర్ల సమ్మె విరమణ

తెలంగాణ ట్యాక్సీడ్రైవర్ల ఐకాస సమ్మె విరమించుకుంది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వినతి మేరకు శనివారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ట్యాక్సీడ్రైవర్ల  ఐకాస ప్రతినిధులు సలావుద్దీన్‌, ఈశ్వర్‌రావు, వెంకటేశం, నాగేశ్‌, కొండల్‌రెడ్డి, ఆరిఫ్‌అలీ తదితరులు గవర్నర్‌ను శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని గవర్నర్‌ వారికి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈ నెల 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ)కు నోటీసు అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. సీఎస్‌, ఆర్టీసీ ఎండీలకు జాతీయ బీసీ కమిషన్‌ నోటీసులు

ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న దాదాపు 20 వేల మంది ఓబీసీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై జాతీయ బీసీ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 25న మధ్యాహ్నం ఒంటి గంటకు దిల్లీలోని జాతీయ బీసీ కమిషన్‌ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు నోటీసులిచ్చింది. సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ కల్వకుర్తి ఆర్టీసీ ఐకాస నాయకులు జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారికి వినతిపత్రం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రాష్ట్రానికి రూ.2,44,941 కోట్ల రుణాలు

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులెన్ని? వాటిని తీర్చి రాష్ట్రానికి రుణ విముక్తి కల్పించాలంటే ఎన్నేళ్లు పడుతుంది? అని రాష్ట్ర ఆర్థికశాఖ  తాజాగా లెక్కలు కట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్రానికి సుమారు రూ. 2.45 లక్షల కోట్ల అప్పులున్నాయని తేల్చింది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే 2039-40 వరకూ సమయం పడుతుంది. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాలు, విదేశీ ఆర్థిక సాయం కింద ఇంతవరకూ పొందినవి, నాబార్డు, ఉదయ్‌, విద్యుత్‌ సంస్థల రుణాలు తదితరాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వైద్య సంస్థల భూముల రద్దు

రాజధాని అమరావతిలో ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌), బీఆర్‌షెట్టి మెడిసిటీ ప్రాజెక్టులకు భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. భూములు కేటాయించి మూడేళ్లవుతున్నా కార్యకలాపాలు ప్రారంభించకపోవడం, నోటీసులిచ్చినా స్పందించకపోవడం, విక్రయ ఒప్పందాలనూ కుదుర్చుకోకపోవడం వల్ల కేటాయింపులను రద్దు చేసినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మళ్లీ మారిన ఎస్‌ఏ-1 పరీక్షల కాలపట్టిక

తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈనెల 23కు బదులు 25వ తేదీ నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 23వ తేదీ నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. బడులు ప్రారంభమైన మూడో రోజే పరీక్షలు మొదలైతే విద్యార్థులకు నష్టం జరుగుతుందని, మరికొద్ది రోజులు ఆలస్యంగా పరీక్షలు ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పెరుగుతున్న  కండోమ్‌ల వినియోగం

తెలుగు రాష్ట్రాల్లో కండోమ్‌ల వినియోగం పెరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రతి 10,000 మంది దంపతుల్లో ఏపీలో 1,404 మంది కండోమ్‌లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 501 మంది వినియోగిస్తున్నట్లు పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలో 309 మంది మాత్రమే వీటిని వినియోగిస్తుండగా, దేశంలోనే అత్యల్పంగా గోవాలో ప్రతి 10,000 మంది దంపతుల్లో 268 మందే వీటిని వాడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వినోదరంగ శక్తి అపారం: మోదీ

మహాత్ముడి సిద్ధాంతాలను సామాన్యుడికి చేరువ చేయడంలో వినోద రంగం గొప్ప పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. 2022లో దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్న నేపథ్యంలో భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం, ఆ తర్వాత సాగిన దేశ ప్రగతి ప్రస్థానానికి సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. శనివారం మోదీ తన నివాసంలో భారత వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. ఈజిప్టులో బయటపడ్డ 3వేల ఏళ్లనాటి శవ పేటికలు

నైలు నదికి పశ్చిమ తీరాన ఈజిప్టులో శనివారం 30 పురాతన శవ పేటికలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాల్లో అసాసిఫ్‌ అనే ప్రాంతంలో తొలిసారిగా ఇలాంటివి బయటపడ్డాయని ప్రభుత్వం ప్రకటించింది. శవపేటికలన్నీ రెండు వరసల్లో కేవలం మీటరు లోతులో దొరికాయి. ఇవన్నీ ఒకే కుటుంబానికి చెంది ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఫైనల్లో దిల్లీపై గెలిచిన బంగాల్‌

పీకేఎల్‌లో కొత్త ఛాంపియన్‌ అవతరించింది. ఆల్‌రౌండ్‌ ఆటతీరుతో సత్తాచాటిన బంగాల్‌ వారియర్స్‌ చివరి మెట్టుపై ప్రత్యర్థితో కలబడి.. నిలబడింది. కలిసికట్టుగా ఆడిన ఆ జట్టు శనివారం తుదిపోరులో 39-34 తేడాతో దబంగ్‌ దిల్లీపై విజయం సాధించింది. ఈ సీజన్‌లో అత్యధిక రైడ్‌ పాయింట్లు సాధించిన ఆటగాడిగా పవన్‌ సెరావత్‌ (346- బెంగళూరు బుల్స్‌), అత్యధిక ట్యాక్లింగ్‌ పాయింట్లు సాధించిన ఆటగాడిగా ఫజల్‌ అత్రచలి (82- యు ముంబా) నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.