close

తాజా వార్తలు

రావా.. కనవా.. తినవా!

ఓ వీధిలో రాజ భవనం మరో వీధిలో ఇంద్ర భవనం ఆ పక్క సందులో మహా ప్రాసాదం.. వందల్లో.. కాదు కాదు వేలల్లో.. అన్నీ మండువా లోగిళ్లే! ఒక్కో భవనం పాతిక ఇళ్ల పెట్టు.. అంత భారీగా ఉంటాయవి.ఇంతకీ ఎక్కడ? అంటారా.. తమిళనాడులోని చెట్టినాడ్‌కు వెళ్తే చాలు.. కన్నుల విందు ఖాయం. భోజన ప్రియులకైతే రుచుల విందు అదనం.

చెట్టినాడ్‌ సిమెంట్‌ గురించి తెలుసు. టీవీ ప్రకటనల్లో చూశాం. చెట్టినాడ్‌ మసాలా గురించి తెలుసు. కోడి కూరలో అమ్మ వేస్తుండగా చూసుంటాం. అద్దాల టైల్స్‌ తయారవుతాయక్కడ. అందాల చీరలు రూపుదిద్దుకుంటాయక్కడ. ఇలా చెబుతూ పోతే ఎన్నో విశేషాలకు చిరునామా చెట్టినాడ్‌. అందుకు తగ్గట్టే చెట్టినాడ్‌ అంటే ఒక్క ఊరు కాదు. దాదాపు 78 ఊళ్ల సమాహారం. ఏ ఊరుకు వెళ్లినా భారీ మేడలు స్వాగతం పలుకుతాయి.

చెట్టినాడ్‌ ఒకప్పుడు తమిళనాడులో సంపన్న ప్రాంతం. శివగంగ జిల్లాలో దాదాపు 1,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకప్పుడు 98 గ్రామాలు ఉండేవి. కాలక్రమంలో 78 మిగిలాయి. కరైక్కుడి ఇక్కడ ప్రధాన పట్టణం. దీనికి చుట్టుపక్కల ఈ ఊళ్లన్నీ ఉంటాయి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నాట్టుకోట్టై చెట్టియార్లు ఎక్కువగా ఉండేవాళ్లు. వడ్డీ వ్యాపారం ప్రధాన వృత్తి. ఉప్పు నుంచి రత్నాల వరకు రకరకాల వస్తువులు ఎగుమతి చేస్తుండేవారు. భారీ సంపదతో తులతూగేవారు. అలా వచ్చిన ఆదాయంతో అందమైన ఆవాసాలు కట్టించుకున్నారు. శతాధిక సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ ఇళ్లు చెక్కు చెదరలేదు.

అడుగడుగునా అద్భుతం..

చెట్టినాడ్‌ ప్రాంతంలో మండువా లోగిళ్ల సంఖ్య ఏకంగా పదకొండు వేల పైమాటే. దాదాపు అన్నీ నివాస యోగ్యంగానే ఉన్నాయి. ఒక్కో భవనం దాదాపు 30వేల నుంచి 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వీధంతా ఇల్లే! భారీ వేడుక నిర్వహణకు సరిపోయేంత లోగిలి.. వెయ్యిమందికి ఆశ్రయమిచ్చే ప్రాంగణాలు, పదుల సంఖ్యలో గదులు ఆశ్చర్యపరుస్తాయి. బర్మా టేకు, ఇటలీ మార్బుల్‌, స్పెయిన్‌ నుంచి సీలింగ్‌, బెల్జియం అద్దాలు.. ఇలా అడుగడుగునా అబ్బురపరిచే కళ దర్శనమిస్తుంది. వాకిట్లో ఇసుర్రాళ్లు, వరండాలో అరుగులు, మధ్య ఇంట్లో తూగుటుయ్యాల, గోడకు పాత గడియారం, పడగ్గదిలో పట్టెమంచం, వంటింట్లో గంగాళాలు, పెరట్లో పొత్రం.. ఓ పాత కాలం సినిమా కోసం కొత్తగా వేసిన సెట్‌లా ఉంటుంది. ఒక ఇంటికీ మరో ఇంటికీ సంబంధం ఉండదు. ఒక ఇంటిని మించి మరో ఇల్లు. అందుకే చెట్టినాడ్‌ వచ్చే పర్యాటకులు ఒక్కో ఇల్లూ చూస్తూ రోజులు గడిపేస్తుంటారు.

కథలు కథలుగా..

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వ్యాపారాలు దెబ్బతినడంతో చాలామంది చెట్టియార్లు బర్మా, శ్రీలంక, మలేసియా, సింగపూర్‌ దేశాలకు వలస వెళ్లారు. తమ నివాసాలను చూసుకోవడానికి జీతాలిచ్చి సంరక్షకులను నియమించారు. ఈ విశాలమైన లోగిళ్లలో.. కొన్ని హోటళ్లుగా మారాయి, కొన్ని రిసార్టులుగా ఆతిథ్యమిస్తున్నాయి. కరైక్కుడి, కడియపట్టి, కొత్తమంగళం, కనాడుకథన్‌లో హోటళ్లు ఎక్కువ. గైడ్‌ వెంట ఇళ్లిళ్లూ తిరుగుతుంటే బోలెడన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆ ఇల్లు ఎప్పుడు కట్టారు? ఎవరు కట్టారు? ఇలా కథలు కథలుగా చెబుతారు. వీధిలో వెళ్తుంటే.. అదిగో ఫలానా ఇంట్లో రజనీకాంత్‌ సినిమా చిత్రీకరించారనీ, ఈ ఇంట్లో కమల్‌హాసన్‌ సినిమా షూటింగ్‌ జరిగిందని సినిమా ముచ్చట్లూ ఏకరవు పెట్టేస్తారు. ఆ ముచ్చట్లు వింటూ.. గడప గడపా తిరుగుతుంటే అలసట రాకుండా ఉంటుందా? అయినా ఏ బాధా లేదు. చెట్టినాడ్‌లో కన్నుల విందే కాదు.. ఎక్కడికి వెళ్లినా పసందైన విందు భోజనం సిద్ధంగా ఉంటుంది.

రుచుల విస్తరి..

చెట్టినాడ్‌ రుచులు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే ఘుమఘుమలు ఆత్మారాముడిని అల్లకల్లోలం చేస్తాయి. ఆబగా తినమని ఆరాటపెడతాయి. మాంసాహార ప్రియులకైతే మరీనూ! కోడి మాంసంతో రకరకాల వంటకాలు చేస్తారు. ఏ వంట చేసినా దిట్టంగా మసాలా దట్టించాల్సిందే అంటారు అక్కడి పాకయాజులు. మునక్కాడల సాంబారు, వంకాయ కుర్మా సెగలు కక్కుతూ విస్తట్లో పడుతుంటే.. విస్తరి చుట్టూ నాలుగైదు పచ్చళ్లు నోరూరిస్తుంటే.. పంటికింద కరకరలాడటానికి అందేంత దూరంలో అప్పడం ఉంటే.. నాలుగు కాదు నలభై ముద్దలు ఎక్కువగా లాగించేస్తాం. చెట్టినాడ్‌ వంటలు ఆరగించడం కోసమే ఇక్కడికి వచ్చేవాళ్లుంటారు. కళ్లారా వింతలు చూసి.. కడుపారా రుచులు ఆస్వాదించి.. తృప్తిగా తిరుగు ప్రయాణం అవుతారు.

ఎన్నో ప్రత్యేకతలు

చెట్టినాడ్‌ ప్రాంతంలో ఆలయాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాల కిందట నిర్మించిన ఈ గుళ్లు అనంత శిల్ప సంపదతో అలరిస్తాయి. ఈ పల్లెల్లో జరిగే సంతలు చూసి తీరాల్సిందే! అపురూప వస్తువులు తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్ఛు చెట్టినాడ్‌ చేనేతలు మగువల మనసు దోచేస్తాయి. ఇక్కడ టైల్స్‌ తయారీ కుటీర పరిశ్రమగా విస్తరించింది. గ్రామగ్రామాల్లో బంకమన్ను, గాజుతో టైల్స్‌ తయారు చేసే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే ప్రాంతంలో సిమెంట్‌ పరిశ్రమ ఉంది. నవంబరు నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. వేసవిలో వేడిగా ఉంటుంది.

చేరుకునేదిలా

● చెట్టినాడ్‌లోని ప్రధాన పట్టణం కరైక్కుడి.. ఆలయాల నగరం మదురై నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్‌ నుంచి మదురైకి రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో కరైక్కుడి చేరుకోవచ్ఛు హైదరాబాద్‌ నుంచి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులూ అందుబాటులో ఉన్నాయి.

విజయవాడ, విశాఖపట్నం నుంచి కరైక్కుడికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీలో చుట్టుపక్కల ఊళ్లన్నీ చుట్టేయొచ్ఛు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.