close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ఆర్టీసీ సంక్షోభంపై సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌‌, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలతో చర్చల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రేపు కోర్టుకు నివేదించాల్సిన అంశాపై కూడా చర్చించారు. ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు మధ్య  శనివారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2, హరియాణా సీఎంగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం

హరియాణా ముఖ్యమంత్రిగా భాజపా నేత మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు. జేజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. తెదేపాకు ఎమ్మెల్యే వంశీ రాజీనామా

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.‘‘నన్ను, నా అనుచరులను వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా’’ అని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ప్రపంచం మెచ్చే పర్యాటక దేశంగా భారత్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియో ద్వారా ఆయన భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజుల్లో దీపావళి కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించుకుంటున్నారని అన్నారు. రాబోయే కాలంలో ప్రపంచం మెచ్చిన పర్యాటకంగా భారత్‌ తయారవ్వబోతోందని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం:గవర్నర్‌

రాజ్‌భవన్‌లో సింగిల్‌ యూజ్‌(ఒకసారి వాడి పారేసే) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించినట్లు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. నేడు దీపావళి సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తన సొంత ఇల్లులాంటిదన్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రజలు, రాజ్‌భవన్‌ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మేస్త్రీ కుటుంబానికి పవన్‌ అండ

గుంటూరు జిల్లాకు చెందిన తాపీమేస్త్రి నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకున్న నాగ బ్రహ్మాజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మేస్త్రి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఏపీలోని భవన నిర్మాణ రంగ కార్మికుల దుస్థితికి అద్దంపడుతోందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

7. అవును.. బాగ్దాదీ హతం..!

ఐసిస్‌ అగ్రనాయకుడు అబు బకర్‌ ఆల్‌ బాగ్దాదీని అమెరికా దళాలు హతమార్చినట్లు టర్కీకి చెందిన అధికారిక వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. టర్కీకి చెందిన అనడొలు ఏజెన్సీ (ఏఆర్‌) ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది. దీంతో ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. మరోపక్క ఎస్‌డీఎఫ్‌ నేత మజ్లోమ్‌ అబ్దీ కూడా ఇదే రకమైన అర్థాన్ని వచ్చేట్లు ట్వీట్‌ చేశారు. ‘చారిత్రక ఆపరేషన్‌ విజయవంతమైంది. ఇది అమెరికా, ఎస్‌డీఎఫ్‌(కుర్దు) దళాల సమాచార సమన్వయంతోనే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బోరుబావిలో బాలుడు.. రజనీ స్పందన

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలోని ఓ బోరుబావిలో రెండేళ్ల బాలుడి చిక్కుకున్న విషయం తెలిసిందే. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాలుడు క్షేమంగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. బోరుబావిలో చిక్కుకున్న రెండేళ్ల చిన్నారి సుజిత్‌ క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను’ అని రజనీ పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కోర్టు తీర్పు అమలు చేయాలి: కోదండరామ్‌

అందరూ దీపావళి పండుగ జరుపుకొంటున్న వేళ ఆర్టీసీ కార్మికులు మాత్రం అంధకారంలో ఉన్నారని తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆర్టీసీ కార్మికుల  సమ్మెకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోదండరామ్‌ మాట్లాడుతూ... కార్మిక సంఘాల నాయకులతో నిన్నటి చర్చల్లో యుద్ధ ఖైదీల్లాగా అవమానించారని ఆరోపించారు. కోర్టు తీర్పును సంపూర్ణంగా అమలు చేసి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సినిమా నిర్మాణ రంగంలోకి మనోజ్‌

‘దొంగా దొంగది’, ‘పోటుగాడు’, ‘కరెంట్‌ తీగ’ వంటి పలు చిత్రాల్లో నటించి కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారు టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ముఖ్య విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆదివారం ప్రకటించారు.  ఎం.ఎం.ఆర్ట్స్‌ పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించినట్లు దీపావళి పండుగ సందర్భంగా ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.