close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. నిధుల వ్యయంలో జాగ్రత్త అవసరం: జగన్‌

రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండాలని.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రతిపాదనలతో పూర్తి నివేదిక అందివ్వాలని సూచించారు. నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలని.. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలని సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు

ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసమేతంగా హాజరైన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. చినజీయర్‌ స్వామితో తనకు ఏర్పడిన పరిచయం సహా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందన్నారు. ఫిబ్రవరిలో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని చినజీయర్‌ స్వామి చెప్పారని తెలిపారు. యాదాద్రిలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘మహా’లో వచ్చేది భాజపా ప్రభుత్వమే: జీవీఎల్‌

ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం డిమాండ్‌ చేస్తూనే ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ భాజపాపై శివసేన పరోక్షంగా బెదిరింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు స్పందించారు. మహారాష్ట్రలో ఏర్పడేది భాజపా నేతృత్వంలోని ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరలించిందని జీవీఎల్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వారి ఆత్మహత్యలు బాధించాయి: పవన్‌

భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్నీ సంఘటితం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే భాజపా, వామపక్షాలు స్పందించాయన్నారు. విపత్కర పరిస్థితులపై పోరుకు మిగతా పార్టీలూ ముందుకు రావాలని కోరారు. కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయనీ.. నెలల తరబడి ఉపాధిలేక కష్టాలపాలై వారు ప్రాణాలు తీసుకుంటున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆమ్రపాలి ఇక కేంద్ర సర్వీసులకు..

తెలంగాణ క్యాడర్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి ఇకపై కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. దిల్లీలోని కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను కేంద్రం డిప్యుటేషన్‌పై  నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా సేవలందించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గానూ పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండి

ఏపీ రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ఆ సూచనలను ఈమెయిల్‌, లేఖల ద్వారా పంపాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. expertcommittee2019@gmail.comకు ఈమెయిల్‌ లేదా విజయవాడ పటమటలో ఉన్న కార్యాలయానికి నవంబర్‌ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది. రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సెప్టెంబర్‌ 13న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎయిమ్స్‌కు చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. సోమవారం ఉదయం తొలుత ఇక్కడి ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించిన అనంతరం.. సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించారని సమాచారం. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్న ప్రకటనలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒకేచోట 2000 గడియారాలు

రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న అంగారస్క్‌ నగరంలోని ఓ మ్యూజియం రకరకాల గడియారాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ గడియారాలను ఒక్క చోట చేర్చిన ఈ ప్రదర్శన పురాతన వస్తు ప్రియులను అలరిస్తోంది. దాదాపు 2000 గడియారాలను కలిగి ఉన్న ఈ మ్యూజియం ఈ ఏడాదితో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు వచ్చి గడియారాలను ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు కానీ ఒకప్పుడు గడియారానికి ఉండే క్రేజే వేరు. ఒకప్పుడు గడియారాన్ని కూడా ఇంటి అలంకరణలో భాగం చేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌ ఒలింపిక్స్‌ ఆశలకు గండి

ఒలింపిక్స్‌లో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌ హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయిర్‌ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో 1-6 తేడాతో  ఘోరపరాభవాన్ని చవిచూసింది.  దీంతో వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనుకున్న పాక్‌ హాకీ జట్టు ఆశలకు గండి పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం

జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి క్రూరంగా తన ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే.. నర్మెట్ట మండలం భీక్యా తండాకు చెందిన బానోత్‌ రమ ఇంట్లోనే తన ఇద్దరి పిల్లలు భానుశ్రీ (4), వరుణ్‌ (3)ల గొంతు కోసింది. ఇంట్లో మంచంపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆ తర్వాత ఆమె కూడా గొంతు కోసుకుంది. కొన ఊపిరితో ఉన్న రమను స్థానికులు జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.