close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కార్మికుల సమ్మె, బకాయిల చెల్లింపు తదితర వ్యవహారాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నవంబర్‌ 1కి వాయిదా వేసింది. బకాయిల వివరాలను ఈనెల 31లోపు నివేదించాలని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. నవంబర్‌ 1న ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సీఎం కుర్చీని పంచుకుందామని చెప్పలేదు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన చేస్తున్న డిమాండ్‌పై భాజపా నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తొలిసారిగా స్పందించారు. భాజపా-శివసేన పొత్తుపై చర్చల సమయంలో అలాంటి హామీలేవీ ఇవ్వలేదని, అసలు 50:50 ఫార్ములానే చర్చకు రాలేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఖాళీగా ఉన్న వాలంటీర్ల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

ఏపీలో ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 70,888 వార్డు వాలంటీర్లు పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 51,718 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వివిధ కారణాలతో 19,170మంది విధుల్లో చేరకపోవడంతో ఆ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. తాజాగా ఆ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సరూర్‌నగర్‌ సభకు హైకోర్టు అనుమతి

ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం తలపెట్టిన ‘సకల జనుల సమరభేరి’కి హైకోర్టు అనుమతించింది. సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించనున్న ఈ సభకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని సూచించింది. అంతకుముందు సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.

5. విరాట్‌ కోహ్లీకి ఉగ్రముప్పు!

బంగ్లాదేశ్‌తో అరుణ్‌జైట్లీ మైదానంలో జరిగే తొలి టీ20లో టీమిండియా క్రికెటర్లకు భద్రతను పెంచాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు అందాయట. సారథి విరాట్‌ కోహ్లీ సహా భారత క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందిందని తెలిసింది. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోంమంత్రి అమిత్‌షాతో పాటు మరికొందురు భాజపా నేతల పేర్లు లేఖలో ఉన్నాయట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. విషమంగా నవాజ్‌షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య భారీగా తగ్గినట్లు వైద్యులు తెలిపారు. గతంలో నవాజ్‌కు గుండెపోటు రాగా అప్పటి నుంచి ఆయన అందుకు సంబంధించిన మందులు వాడుతున్నారు. ఆ మందుల వాడకం వల్లే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోయినట్లు తెలిపిన వైద్యులు ప్రస్తుతం ఆ మందుల వాడకం నిలుపుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పురపాలక ఎన్నికలపై నేతలు సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి తదితర అంశాలపై నేతలు చర్చించారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో గాజుల ఉత్సవం ప్రారంభమైంది. కార్తీక మాసం శుద్ధ విదియ కావడంతో ఆలయ అధికారులు దుర్గమ్మకు గాజుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవం కోసం భక్తులు సమర్పించిన కోటి గాజులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అమ్మవారిని కూడా గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బాబ్లీ గేట్లు మూసివేత

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. కేంద్ర జలసంఘం, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల సమక్షంలో గేట్ల మూసివేతను చేపట్టారు. సుప్రీం తీర్పు ప్రకారం జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరచి ఉంచారు.

10. దలాల్‌.. మెరుపుల్‌..

బుల్‌ మళ్లీ రంకేసింది. కొనుగోళ్ల ఉత్సాహంతో ఉరకలు పెట్టింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించనుందన్న సానుకూల అంచనాల నడుమ దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. నేటి మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 582 పాయింట్లు ఎగబాకి 39,832 వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 11,787 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.