close

తాజా వార్తలు

బడికొస్తే భోజనం పెడతారు!

ఆకలి... ఎంత చెడ్డదో చెప్పక్కర్లేదు. ఓ పూట కడుపునిండా భోంచేయడానికే నానా కష్టాలు పడేవారు ఎందరో... నాలుగుముద్దలు తినలేక ఎముకల గూడులా మారిపోయే చిన్నారులు, పేదవారు మన చుట్టూనే ఉంటారు. అలాంటివారి ఆకలి బాధలు తీర్చాలనుకున్న సృష్టి జైన్‌, స్నేహితుడితో కలిసి ఫీడింగ్‌ ఇండియా పేరుతో ఓ సంస్థనే ప్రారంభించింది. వృథా అయ్యే ప్రతి అన్నం మెతుకు పేదవారికోసమే అనే స్ఫూర్తిని రగిలిస్తూ...రోజూ ఎంతోమంది కడుపునింపే ప్రయత్నం చేస్తోంది.

యిదేళ్లక్రితం... ఓ వివాహ వేడుక్కి స్నేహితుడు అంకిత్‌తో కలిసి వెళ్లింది సృష్టి. 35 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసినా... తక్కువమంది రావడంతో సగానికి పైగా ఆహారం వృథా అయ్యింది. కొన్ని వందల మంది కడుపు నింపాల్సిన ఆ ఆహారం చెత్తకుండీ పాలవడం వాళ్లను బాధపెట్టింది. అప్పుడే ఇలాంటి కార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను అవసరమైన వారికి చేరవేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులు అధ్యయనం చేసి చివరకు ‘ఫీడింగ్‌ ఇండియా’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.

తెలుగురాష్ట్రాల్లోనూ...

సృష్టి స్వస్థలం దిల్లీ. మొదట తమ సేవలు అక్కడ ప్రారంభించినా... క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించిందీ బృందం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 95 పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, కాకినాడలో ఫీడింగ్‌ ఇండియా వాలంటీర్లు పనిచేస్తున్నారు.

సంస్థను ప్రారంభించిన కొత్తలో అంకిత్‌, సృష్టి మరికొందరు స్నేహితులు కలిసి కారులో వెళ్లి వేడుకలు, పెళ్లిళ్లు జరిగే కల్యాణ మండపాల నుంచి మిగిలిపోయిన ఆహారం సేకరించేవారు. ఆ ఆహారాన్ని మళ్లీ ప్యాక్‌చేసి రోడ్లపక్కన ఉండేవారికి, వికలాంగులకు, బస్తీల్లో తిండికి ఇబ్బందులు పడేవారికి, ఆశ్రమాలకు ఇచ్చేవారు. ఇప్పుడు సొంతంగా 27 వాహనాలను సమకూర్చుకున్నారు. వీటికి ‘మ్యాజిక్‌ వీల్స్‌’ అని పేరు పెట్టారు. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నియమాల ప్రకారం ఈ వాహనాలను రూపొందించారు. ఏసీలతో పాటు ఫుడ్‌ సేఫ్టీ కిట్‌, బరువు, పీహెచ్‌ విలువ చూసే పరికరాలు ఈ వాహనాల్లో నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్‌సంస్థల క్యాంటీన్ల నుంచీ ఆహారం సేకరిస్తున్నారు.

ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి...

ఈ వాలంటీర్లను హంగర్‌హీరోస్‌ అంటారు. వీళ్లు ఆహారం అవసరమైన ప్రాంతాలను గుర్తిస్తారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, వలస కూలీలకు ప్రాధాన్యం ప్రకారం రోజూ ఆహారం అందిస్తారు. పాఠశాలల్లో వందశాతం హాజరు నమోదు కాకపోవడానికీ ఆ పిల్లలకు భోజనం లేకపోవడమూ ఓ కారణం అని గుర్తించిన వీరు... తల్లిదండ్రులతో మాట్లాడటం మొదలుపెట్టారు. పిల్లల్ని బడికి పంపిస్తే తామే భోజనం పెట్టిస్తామని ఆ తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. మురికివాడల్లో ఉండే పాఠశాలలు, ఆశ్రమాల నిర్వాహకులు ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే గనుక రోజూ వేళకు ఆహారం అందించే ఏర్పాటు చేస్తుందీ సంస్థ. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, కొన్ని పాఠశాలలకు... భోజనానికి అవసరమయ్యే సరకులను దాతల నుంచి సేకరించి ఇస్తారు. ఎంత డబ్బు దానం చేస్తే ఎంతమంది పిల్లలకు అన్నం పెట్టొచ్చనే వివరాలు వెబ్‌సైట్లో ఉంటాయి. కొన్నిసార్లు దాతలు ఇచ్చే ఆహారం తక్కువ మొత్తంలో ఉంటుంది. అది అందరికీ సరిపోదు. దీన్ని గ్రహించిన నిర్వాహకులు... పేదలు, చిరువ్యాపారులు, కూలి పనులు చేసుకునే వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఫ్రిజ్‌లను ఏర్పాటు చేయించారు. ఎవరైనా వాటిల్లో ఆహారం పెట్టొచ్ఛు వాలంటీర్లు సైతం రాత్రి వేళల్లో తీసుకొచ్చిన ఆహారాన్ని ప్యాకింగ్‌ చేసి వీటిల్లో ఉంచుతారు. ఎవరైనా వీటి నుంచి ఆహార పొట్లాలను తీసుకెళ్లొచ్ఛు ఇప్పటి వరకు 30 పట్టణాల్లో 551 ఫ్రిజ్‌లను ఏర్పాటు చేశారు. ఆ సంఖ్య పెంచే పనిలో ఉన్నారు.

ఎవరూ పస్తులుండొద్దనే...

‘ఇప్పటికే దిల్లీ, ముంబయ్‌ విమానాశ్రయాలతో ఒప్పందం చేసుకున్నాం. రైల్వేశాఖనూ సంప్రదించాం. ఎక్కడ ఆహారం మిగిలిపోయినా మా సంస్థ సేకరించి అవసరమైనవారికి అందిస్తుంది. నెలకు 1500 నుంచి 2000 వరకు ఆహార పొట్లాలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. సేకరించిన ఆహారాన్ని ప్రత్యేక డబ్బాల్లో భద్రపరుస్తాం. అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాతే అవసరమైన వారికి అందిస్తాం. వాలంటీర్లే మా సంస్థ బలం. ప్రస్తుతం 22,500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఓ వ్యక్తికి భోజనం అందివ్వడానికి మాకు మూడు రూపాయలు ఖర్చవుతుంది. వచ్చే ఏడాది దీన్ని ఒక్క రూపాయికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా మాకు నిధులూ అందుతున్నాయి. ప్రతి రూపాయి పేదవారి ఆకలిబాధ తీర్చేందుకే ఖర్చుచేస్తున్నాం. దేశంలో ఎవరూ... ఆకలిబాధతో పడుకోకూడదనేదే మా లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో జొమాటో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతి ఆర్డరుకు డబ్బు చెల్లించేముందు వినియోగదారులు రూపాయి నుంచి ఎంతో కొంత మొత్తం దానం చేయొచ్ఛు త్వరలోనే ఒక యాప్‌ను రూపొందించి, దాని ద్వారా ఆహారాన్ని హంగర్‌స్పాట్లకు చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు జొమాటో సాంకేతిక సాయం అందిస్తుంది. పెద్దపెద్ద హోటళ్లు, క్యాంటీన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని, ఆర్డర్‌ ఇచ్చి రద్దు చేసుకున్న ఆహార పొట్లాలను జొమాటో ఉచితంగా హంగర్‌స్పాట్లకు చేరవేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్వీన్స్‌ కామన్‌వెల్త్‌ ట్రస్టు ఫీడింగ్‌ ఇండియాకు సాయం చేస్తోంది...’ అని చెబుతుంది సృష్టి. ఈ మిత్రద్వయం ఇప్పటికే చాలా అవార్డులూ అందుకోవడం విశేషం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.