close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. అంకురం లేనట్లే!

రాజధాని అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధి (స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌) ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఈ ప్రాజెక్టు ఒప్పందాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై బుధవారం నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలోగానీ, తదుపరి సమావేశంలోగానీ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కోసం సింగపూర్‌ సంస్థల కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థలు (ఏడీసీ) తాము పెట్టిన మూలధన పెట్టుబడిని వెనక్కు తీసుకుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పుర ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, పురపాలక కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆదేశించారు. పారదర్శకంగా, పక్కాగా ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 31న హైకోర్టులో స్పష్టత వస్తుందని.. సానుకూలంగా నిర్ణయం వస్తే నవంబరు మొదటి వారంలో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను వేగవంతం చేసుకోవాలని  సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లక్ష మందికి 109 మందే

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిష్పత్తికి తగిన విధంగా పోలీసులు లేరు. కేంద్రహోంశాఖ విడుదల చేసిన తాజానివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి కేవలం 109 మంది మాత్రమే ఉన్నారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపరంగా చూస్తే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 31వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 192గా కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు 145 మంది పోలీసుల అవసరం. ఒక్కో పోలీసు సగటున 915.69 కి.మీ. పరిధిలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 11,903.68 మంది మహిళలకు ఒక మహిళా పోలీసు ఉన్నారు. ఈ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో తొలిస్థానంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మద్దతు ధర రూ.9 వేలు ఇవ్వాలి

పసుపు పండిస్తున్న రైతుల ఆదాయం అంత పచ్చగా ఉండడం లేదు. ఎకరానికి రూ.30 వేల వరకు పసుపు రైతులకు నష్టం వస్తోందని రాష్ట్ర ఉద్యానశాఖ, కొండా లక్ష్మన్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పసుపు రైతులకు ఎంత ధర ఇవ్వాలనేది వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. దేశవ్యాప్తంగా కేంద్రం ఏటా మద్దతు ధర ప్రకటిస్తున్న 24 పంటల జాబితాలో పసుపు లేదు. ఈ జాబితాలో చేర్చి క్వింటాకు రూ.9 వేల చొప్పున మద్దతు ధర ఇవ్వాలని, నిజామాబాద్‌లో ‘పసుపు అభివృద్ధి మండలి (పసుపు బోర్డు)’ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 2,788 మందికి ‘ఉపాధ్యాయ’ ఉత్తర్వులు

ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన 2,822 మందిలో 2,788 మంది ఉత్తర్వులు అందుకున్నారు. టీఆర్‌టీ ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు ఎంపికైన వీరికి ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 7 జిల్లాల్లో 34 మంది కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 మంది, రంగారెడ్డిలో 9 మంది గైర్హాజరయ్యారు. వారికి ఇతర ఉద్యోగాలు వచ్చినందునే ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌కు రాలేదని అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐరాసను సంస్కరించాలి

ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఘర్షణలను పరిష్కరించే ‘సంస్థ’గా కాకుండా.. ఒక ‘సాధనం’గా కొన్ని దేశాలు ఈ అంతర్జాతీయ వేదికను వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ‘బ్రిడ్జ్‌వాటర్‌ అసోసియేట్స్‌’ వ్యవస్థాపకుడు రే డాలియోతో జరిగిన ఒక చర్చావేదికలో మాట్లాడారు. వివాదాల పరిష్కార వేదికగా ఆశించిన స్థాయిలో ఐరాస వృద్ధి చెందలేదన్నారు. అందువల్ల సమితి నిర్మాణాన్ని సంస్కరించడంపై దేశాలు దృష్టి సారించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వలస కూలీలపై ఉగ్రపంజా

కశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొట్టమొదటి సారిగా పేట్రేగి పోయారు. వలసకూలీలపై కాల్పులకు తెగబడ్డారు. అయిదుగురు బెంగాల్‌ కూలీలను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ నుంచి పొట్టచేతబట్టుకుని కశ్మీరుకు వచ్చిన వీరంతా దినసరి కూలీలు. తాపీ పనిచేసే వారని పోలీసులు తెలిపారు. ఐరోపా సమాఖ్య ప్రతినిధి బృందం కశ్మీర్‌ పర్యటనకు వచ్చిన రోజునే ఈ దుశ్చర్య చోటు చేసుకోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మేక్‌మైట్రిప్‌-గో ఐబిబోలపై దర్యాప్తు చేపట్టండి

ఆన్‌లైన్‌ ప్రయాణ ఏజెంట్లు మేక్‌మైట్రిప్‌-గో ఐబిబోలతో పాటు, ఆతిథ్య సేవల సంస్థ ఓయోపై దర్యాప్తు చేపట్టాలని కాంపిటిషన్‌ కమిషన్‌(సీసీఐ) ఆదేశించింది. పోటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫెడరరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఆయా సంస్థల వ్యాపార తీరును పరిశీలించిన అనంతరం.. ప్రాథమికంగా ఉల్లంఘనలు జరిగినట్లు సీసీఐ నిర్ధరణకు వచ్చింది. ‘కాంపిటిషన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 3(4) నిబంధనలను మేక్‌మైట్రిప్‌-గో ఐబిబో, ఓయోలు ఉల్లంఘించినట్లు కనిపిస్తోంద’ని తన 26 పేజీల ఆదేశంలో సీసీఐ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రపంచ టీ20 టోర్నీకి నెదర్లాండ్స్‌

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచ టీ20 టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్‌ అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. మంగళవారం మొదట బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 80 పరుగులే చేసింది. గ్లోవర్‌ (4/12), మీక్‌రెన్‌ (2/13) ధాటికి ఒక దశలో యూఏఈ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రజా (22), వహీద్‌ (19), బోటా (16) యూఏఈకి ఆ మాత్రం స్కోరైనా అందించారు. స్వల్ప లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ 15.1 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మరోసారి ‘మిర్చి’ తినిపిస్తారు!

‘మిర్చి’తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు  కొరటాల శివ. తొలి అడుగులోనే విజయం సాధించి, దర్శకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’... ఇలా వరుసగా స్టార్‌ కథానాయకులతోనే పనిచేశారు. ఇప్పుడు ఆయన మళ్లీ ప్రభాస్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్‌ ఇటీవలే కొత్త కథలు వినడం మొదలెట్టారు. అందులో భాగంగా కొరటాల శివ కూడా ప్రభాస్‌కి ఓ కథ వినిపించినట్టు తెలుస్తోంది. కొరటాలతో ఆయన మళ్లీ పనిచేయడానికి సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.