close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఇసుక వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వారోత్సవాల నిర్వహణ సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు కాదు.. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు జరపాలన్నారు. ఊరికో వైకాపా ఇసుకాసురుడు తయారయ్యాడని దుయ్యబట్టారు. ఇసుకాసురుల భరతం పడితేనే పేదలకు దీపావళి అని అన్నారు. ఇసుక కొరత వల్ల ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ఇవన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలేనన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శ్రీశైలం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఆనకట్ట 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉండగా.. నీటి నిల్వ 214.36 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇసుక కొరతపై నారా లోకేశ్‌ దీక్ష

రాష్ట్రంలో ఇసుక కొరతపై పోరాటాన్ని తెదేపా ఉద్ధృతం చేసింది. గుంటూరు కలెక్టరేట్‌ ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దీక్షకు దిగారు. లోకేశ్‌కు సంఘీభావంగా తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, గల్లా జయదేవ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వైకాపా నేతలు దొచుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఆ మరణాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కసారైనా సమీక్షించారా? అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘పేదరికం గురించి పుస్తకాల్లో నేర్చుకోలేదు’

‘పేదరికం అంటే ఏంటో పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఛాయ్‌ అమ్ముతూ దాన్ని అనుభవించాను’ అని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఆయన భారత్‌కు పయనమయ్యారు. పర్యటనలో భాగంగా రియాద్‌లో జరిగిన ‘ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ 2019’ సదస్సులో పాల్గొన్న ప్రధాని.. ప్రశ్నోత్తరాల సమయంలో తన జీవితప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వలస కూలీల మృతిపై మమత దిగ్భ్రాంతి

కశ్మీర్‌లో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో వలస కూలీలు మృతిచెందడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విచారం వ్యక్తం చేశారు. కూలీల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముర్షిదాబాద్‌కు చెందిన ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాల బాధను మాటలతో తీర్చలేం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అన్ని విధాలా అండగా ఉంటాం’ అని దీదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 40 గ్రాముల బంగారాన్ని తిన్న ఎద్దు

కూరగాయల చెత్తతో కలిపి బయటపడేసిన బంగారాన్ని ఓ ఎద్దు తినేసిన ఘటన హరియాణాలోని సిర్సాలో చోటు చేసుకుంది. బాధితుడు జనక్‌రాజ్‌ కథనం ప్రకారం.. ఈ నెల 19న తన భార్య, కోడలు వారి నగలను వంటగదిలో ఓ గిన్నెలో భద్రపర్చారు. అనంతరం వారు కూరగాయలు తరిగి ఆ చెత్తను అదే గిన్నెలో వేశారు. దానిలో 40 గ్రాముల బంగారం ఉన్న విషయం మరిచిపోయి ఆ చెత్తను బయటపడేశారు. తరువాత నగల విషయం గుర్తుకు వచ్చి సీసీ కెమెరాలో పరిశీలించగా ఆ చెత్తను ఒక ఎద్దు తినేసినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రామ్‌ కొత్త సినిమా షురూ..!

రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్‌ (RED)’. ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలను అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 40వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

స్టాక్‌ మార్కెట్ల జోరు బుధవారం కూడా కొనసాగుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 40వేల మార్క్‌ను దాటడం విశేషం. గత నెల కార్పొరేట్‌ పన్నును తగ్గించిన కేంద్రం తాజాగా మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందన్న సంకేతాలతో మదుపర్లలో సెంటిమెంట్‌ను పెంచాయి. ఉదయం 11.23గంటల సమయంలో సెన్సెక్స్‌ 208 పాయింట్లు ఎగబాకి 40,039 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 11,842వద్ద ట్రేడవుతోంది. జులై తర్వాత సెన్సెక్స్‌ 40,000 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రతిష్ఠాత్మక అవార్డును తిరస్కరించిన థెన్‌బర్గ్‌

పర్యావరణ మార్పులపై అశ్రద్ధ వహించడానికి ‘మీకెంత ధైర్యం’ అంటూ ప్రపంచ నేతల్ని ఐరాస వేదికగా కడిగిపారేసిన 16ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌.. నాయకుల తీరుపై తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేసింది. 84దేశాలు సభ్యులుగా ఉన్న ‘నోర్డియాక్‌ కౌన్సిల్‌’ ప్రకటించిన ‘ఎన్విరాన్‌మెంటల్‌ అవార్డు’ని నిరాకరించింది. నాయకులు దృష్టి సారించాల్సింది అవార్డుపై కాదంటూ మరోసారి చురకలంటించే ప్రయత్నం చేసింది. ఈ అవార్డు కింద దాదాపు రూ.36లక్షల నగదు బహుమతి అందజేస్తుండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ముంబయి మునిగిపోనుందా..?

భారత ఆర్థిక రాజధాని ముంబయి మహానగరానికి పెను ముప్పు వాటిల్లనుందట. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో 2050 నాటికి ముంబయిలో చాలా భాగం ‘తుడిచిపెట్టుకుపోయే’ ప్రమాదం ఉందని తాజాగా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. న్యూజెర్సీకి చెందిన క్లైమేట్‌ సెంట్రల్‌ అనే సైన్స్‌ ఆర్గనైజేషన్‌ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ పేరుతో కథనం ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టాలు నానాటికీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్‌ లైన్‌ కిందకు కుంగే ప్రమాదముందట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.