close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1.  సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి:చాడ

సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘సకల జనభేరి’ సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. నిజాం హయాంలో ప్రభుత్వం పరిధిలోనే ఆర్టీసీ సంస్థ నడిచిందని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ సమీక్ష

ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదిక తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘కశ్మీర్‌లో విదేశీ ప్రతినిధులకు ఏం పని?’

 మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భాజపా-శివసేన మధ్య వివాదం మరింత ముదురుతోంది. భాజపాపై శివసేన తాజాగా విమర్శల వర్షం కురిపించింది. 28 మంది ఐరోపా ప్రతినిధుల బృందం కశ్మీర్‌లో పర్యటిస్తున్న విషయమై ప్రశ్నించింది. సేన పత్రిక ‘సామ్నా’లో ఈ మేరకు కథనం రాసింది.‘కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి 28 మందితో కూడిన ఐరోపా ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. కశ్మీర్‌ అంశం మన దేశ అంతర్గత వ్యవహారమైనప్పుడు ఇక్కడ వారికేం పని?’ అని ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం? 

ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఈఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణం

రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్‌, సీఎం జస్టిస్‌ నాగార్జునరెడ్డిని శాలువాతో సత్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పాక్‌లో గురునానక్‌ స్మారక నాణేల విడుదల

గురునానక్‌దేవ్‌ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌ నానక్‌ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘గురునానక్‌ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్‌ విడుదల చేసింది’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. చినజీయర్‌ స్వామిని కలిసిన ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా పలు డిమాండ్లపై గత 26 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బుధవారం చినజీయర్‌ స్వామిని కలిశారు.  రాజేంద్రనగర్‌, మహేశ్వరం ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు బుధవారం ముచ్చింతల్‌లోని ఆయన ఆశ్రమానికి వెళ్లి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ  డిమాండ్లు న్యాయమైనవైనప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. శివసేనతో విభేదాలు తొలగిపోతాయి

మహారాష్ట్రలో భాజపా శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మరోసారి ఎన్నికయ్యారు. విధాన్‌ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 105 మంది భాజపా ఎమ్మెల్యేలు ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఫడణవీస్‌ మాట్లాడుతూ..  మిత్రపక్షంతో ఏర్పడిన భేదాభిప్రాయాలు త్వరలోనే తొలగిపోతాయని, మరోసారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘షకిబ్‌ కెప్టెన్సీలో 2023 ప్రపంచకప్‌ ఆడతాం’

షకిబ్‌ అల్‌ హసన్‌ సారథ్యంలోనే 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడతామని బంగ్లాదేశ్‌ పేసర్‌ మష్రఫె మోర్తాజా పేర్కొన్నాడు. ఓ బుకీ తనని సంప్రదించిన విషయాన్ని షకిబ్‌ అల్‌ హసన్‌ ఐసీసీ అవినీతి నిరోధక శాఖ దృష్టికి తీసుకురానందున మంగళవారం అతడిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ అధికారులు ఇటీవల జరిపిన విచారణలో షకిబ్‌ తన నేరాన్ని అంగీకరించడంతో ఏడాది పాటు సస్పెన్షన్‌ మినహాయింపు ఇచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రెండో రోజూ.. మార్కెట్‌ పరుగులు

పన్ను సంస్కరణల అంచనాలు, కొనుగోళ్ల అండతో దేశీయ మార్కెట్లలో బుధవారం కూడా లాభాల జోరు కొనసాగింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 220 పాయింట్లు ఎగబాకి 40,052 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,844 వద్ద స్థిరపడ్డాయి.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.