close

తాజా వార్తలు

ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదు

5100 రూట్లలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు
నవంబర్‌ 5లోపు కార్మికులు విధుల్లో చేరాలి
లేకుంటే మిగిలిన రూట్లూ ప్రైవేటుకు
కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు సాగింది. సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. ‘‘49 అంశాలపై సమావేశంలో చర్చించాం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించాం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పటిష్ఠంగా ముందుకు పోవాల్సిన అవసరముంది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిచ్చాయి. గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక మాంద్యం ప్రభావం తగ్గింది. రవాణారంగంలోనే కాస్త ప్రతికూల వృద్ధిరేటు ఉంది’’ అని సీఎం వివరించారు.

ఆర్టీసీని విలీనం చేయం..
5100 బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అనాలోచితంగా, అర్ధరహితంగా సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్‌ తీర్మానించిందని వెల్లడించారు.

‘కార్మికుల ఉద్యమ కార్యాచరణ అర్ధరహితం. ఆర్టీసీలో కొత్త బస్సులను కొనే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో ఎవరూ ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి ఉండకూడదు. పనికిమాలిన డిమాండ్లు పెట్టుకుని సమ్మెకు వెళ్లారు. విద్యార్థుల పరీక్షల సమయంలో, పండుగల సమయంలో బ్లాక్‌ మెయిల్‌ చేసే విధంగా సమ్మె చేసే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ప్రైవేటు పరం చేయం. ఆర్టీసీ మనుగడలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్‌ వెహికల్‌ అమెండ్‌మెంట్‌ యాక్టు తెచ్చింది. దాని ప్రకారమే 5100 రూట్లలో  ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సెప్టెంబరు 1ను  కేంద్రం తెచ్చిన చట్టం అమల్లోకి వచ్చింది. కార్మికులకు  ఇప్పుడు ఆర్టీసీతో సంబంధం లేదు’.

నవంబరు 5లోపు విధుల్లో చేరండి...
‘కార్మికుల పట్ల ప్రభుత్వం కఠినంగా లేదు. నాలుగేళ్లలో 67 శాతం జీతాలు పెంచిన చరిత్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. కార్మికుల పొట్టకొట్టే ఉద్దేశం మాకులేదు. ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే. యూనియన్‌ నాయకుల మాయలో పడి మోసపోవద్దు. మిమ్మల్ని అణచివేసే దురుద్దేశం మాకు లేదు. వారికి ఒక అవకాశంఇస్తున్నాం. నవంబరు 5వ తేదీ అర్ధరాత్రి లోపు బేషరతుగా విధుల్లో చేరితే వారికి భవిష్యత్తు ఉంటుంది. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా. ప్రైవేటు బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు బస్సుల ఛార్జీలు పెంచితే  ఊరుకోం. దీనికి ఒక రెగ్యులేటరీ కమిషన్‌ ఉటుంది. ప్రస్తుతం పాస్‌ హోల్డర్లకు ఉన్న అన్ని పాస్‌లు అమల్లో ఉంటాయి. ఎవరికీ అనుమానం వద్దు.’

మెరుగైన రవాణా కోసమే ఈ నిర్ణయం...
 ‘కేవలం ఆరోగ్యకరమైన పోటీ, మెరుగైన  ప్రజా రవాణా కోసమే ప్రైవేటు బస్సుల నిర్ణయం తీసుకున్నాం. లాభాలు వచ్చే రూట్లు ప్రైవేటుకు ఇస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. లాభాలు వచ్చే రూట్లు ఆర్టీసీకే ఇస్తాం. నష్టాలు వస్తున్నాయని చెబుతున్న పల్లెవెలుగు రూట్లన్నీ ప్రైవేటు వారికే ఇస్తాం. ఆర్టీసీని నష్టపరిచే ఉద్దేశం మాకులేదు. కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. లోతుగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోకపోతే మిగతా  5వేల రూట్లను కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తాం. అందుకు ప్రైవేటు ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారు. రాజ్య నిర్వహణలో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం.’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

 కార్మికుల మరణాలకు విపక్షాలే కారణం..
‘భాజపా ఎంపీలు  ఆర్చే వాళ్లా.. తీర్చే వాళ్లా. మధ్యప్రదేశ్‌లో భాజపా హయాంలోనే ఆర్టీసీ మట్టికొట్టుకుపోయింది. ఆపార్టీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ విలీనం జరిగిందా?. భాజపా తెచ్చిన కొత్త చట్టం ప్రకారమే ముందుకెళ్తున్నాం. ఆపార్టీకి చెందిన నలుగురు తెలంగాణ ఎంపీలు కొత్త రవాణా చట్టానికి ఆమోదం తెలపలేదా? ఆర్టీసీ కార్మికుల మరణాలకు విపక్షాలే కారణం. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను విపక్షాలు ఆదుకుంటాయా? కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్టీసీకి రూ.712 కోట్లు ఇచ్చింది. మా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.900 కోట్లు ఇచ్చింది. ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చునూ కాగ్‌ ఆడిట్‌ చేస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముమ్మాటికీ చట్ట విరుద్ధమే. ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న 31 శాతం వాటా నామమాత్రంగా మారింది. ఐదేళ్లలో నష్టాలు కూడా పంచుకోవాలని కేంద్రాన్ని అడుగుతాం. నష్టాలు భరిస్తారో వాటా వదులుకుని వెళ్తారో చూస్తాం. భాజపా అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 7వేల బస్సులు ఆర్టీసీకి ఉంటే.. 25వేల ప్రైవేట్‌ బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో ఉన్న 5వేల బస్సులు ఆర్టీసీకి చెందుతాయి. ప్రైవేటు బస్సులు కూడా 5వేలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేస్తే మాకెందుకు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఏపీలో అమలు చేస్తున్నారా? అక్కడ ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి ఆమేరకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు’.

 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.