close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. విశాఖలో ప్రారంభమైన జనసేన లాంగ్‌మార్చ్‌

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేపట్టిన లాంగ్‌మార్చ్‌ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్‌ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్‌ రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం క్లిక్‌ చేయండి

2. ఆర్టీసీ విషయంలో సీఎం తొందరపడ్డారు

టీఎస్‌ ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొందరపాటు చర్యలు తీసుకొన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కార్మికులపై కక్షపూరిత వైఖరితో వ్యవహరించకూడదని.. సానుభూతితో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజలకు సేవచేసే ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. పేద డ్రైవర్లు, కండక్టర్ల జీవితాల గురించి ఆలోచించాలని ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పక్క రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఇక్కడేనా?:ఉమ

పక్క రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఇక్కడెందుకుందని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉప విమర్శించారు. ఇసుక సమస్య పరిష్కరించకుండా ఎన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, కానీ, ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విధుల్లో చేరేవారికి పూర్తి భద్రత

విధుల్లో చేరే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పోలీస్‌ కమిషనర్లు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని రాచకొండ సీపీ మహేశ్‌భవగవత్‌ అన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారికి పోలీసు భద్రత కల్పిస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మూతపడ్డ పాఠశాలలు

దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. నగరం మొత్తం దట్టంగా అలుముకున్న పొగమంచులో హానికర వాయువులు పెద్ద మొత్తంలో చేరినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. దీని దృష్ట్యా ఆదివారం దిల్లీకి రావాల్సిన దాదాపు 32 విమానాలను దారి మళ్లించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు ట్వీట్‌ చేశారు. దారి మళ్లించిన విమానాల వివరాలను సంబంధిత సంస్థను సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాక స్కూళ్లకు సెలవులను మంగళవారం వరకూ పొడిగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మాకు 170మంది మద్దతుంది:శివసేన

చెరిసగం కాలం పాలనపై పట్టువీడని శివసేన ఆదివారం తన స్వరాన్ని మరింత పెంచింది. ఆ పార్టీ ప్రముఖ నేత సంజయ్ రౌత్‌ మాట్లాడుతూ.. భాజపాతో చర్చలంటూ జరిపితే అది కేవలం ముఖ్యమంత్రి పదవిపైనేనని తేల్చి చెప్పారు. తమకు ఇప్పటికే 170మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. ఆ సంఖ్య 175కి కూడా చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. యడియూరప్ప తరహా రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎట్టిపరిస్థితుల్లో భాజపాకు శివసేన తలొగ్గదని.. కావాల్సింది సాధించుకొని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దూకుడు పెంచండి: BSNL,MTNLతో కేంద్రమంత్రి

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పలు సూచనలు చేశారు. టెలికాం మార్కెట్‌లో రెండు కంపెనీలూ దూకుడు పెంచాలని సూచించారు. వీఆర్‌ఎస్‌ మార్గదర్శకాల అమలుతో పాటు ఆస్తుల మానిటైజ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆయా టెలికాం కంపెనీ బోర్డులతో సమావేశమైన ఆయన.. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీని వినియోగించుకుని పోటీతత్వాన్ని మరింత పెంచుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఐపీవోకు వస్తున్నాం: ఆరామ్‌కో

సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థ ఆరామ్‌కో సంస్థ ఐపీవోకు వస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. కంపెనీలోని కొన్ని వాటాలను ఆరామ్‌కో ఐపీవోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించిందని ఆ దేశ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఐపీవోకు వెళ్లేందుకు శుక్రవారమే ఆ దేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఈరోజు దాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఐపీవో కావొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏడు లక్షల మందిని ఆదుకొన్న కంపెనీలు..

 

దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో  ఉద్యోగాలు కోల్పోయిన వారిలో దాదాపు 7 లక్షల మందిని కొత్తతరం పరిశ్రమలు ఆదుకొన్నాయి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, ఆహార సరఫరా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు తాత్కాలిక ఉపాధి కల్పించాయి. ఆరు నుంచి ఎనిమిది నెలలపాలు ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ మొత్తం ఉద్యోగాల్లో 1,40,000ల ఉద్యోగాలను ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సృష్టించాయి. ఈ సంస్థలు దేశంలోని చివరి ప్రదేశం వరకు డెలివరీ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్యోగుల అవసరం పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

కాలుపై కాలు వేసుకుని దర్జాగా ఇక్కడ కూర్చొన్న ఈ బాలికను చూశారా.. చిన్నతనంలోనే ఓ స్టార్‌లా ఫొటోకు ఎంత చక్కటి పోజు ఇచ్చిందో కదా. ఈ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా కోట్లాది హృదయాల్ని కొల్లగొట్టింది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?.. తను ఎవరో కాదండీ ‘ఛలో’ భామ రష్మిక. ఆమె శనివారం సాయంత్రం చిన్నప్పటి చిత్రాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. పాతఆల్బమ్‌లోని ఫొటో ఇది అని తెలిపారు. బాల్యంలో బాగా అల్లరి చేసేదాన్నని గుర్తు చేసుకుంటూ కోతి ఎమోజీని పోస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.