close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆర్‌సెప్‌ ఒప్పందానికి భారత్‌ దూరం

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) ఒప్పందంలో భారత్‌ చేరడం లేదు. తాము లేవనెత్తిన ఆందోళనలపై ఈ ఒప్పందంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశీయంగా వ్యక్తమవుతున్న ఆందోళనలు, దేశంలోకి వెల్లువెత్తుతున్న చైనా దిగుమతుల దృష్ట్యా  ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచే ఈ ఒప్పందానికి భారత్‌ దూరంగా నిలిచిందని సమాచారం. ఈ ఒప్పందంలో అసలు ఉద్దేశం కొరవడిందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి. 

2. గడువులోగా చేరకుంటే విధుల్లోకి తీసుకోం: కేసీఆర్‌

నవంబరు 5 అర్ధరాత్రి గడువులోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి తీసుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మరో ఐదు వేల ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తే రాష్ట్రంలో ఇక ఆర్టీసీ ఉండదని చెప్పారు.

3. ఎవ్వరూ విధుల్లో చేరలేదు.. వాళ్లూ వచ్చేశారు!

నవంబరు 5వ తేదీలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా డెడ్‌లైన్‌ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నిన్న 11 మంది విధుల్లో చేరితే.. ఐదుగురు ఈరోజు మళ్ళీ వచ్చేశారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించండి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. చర్చిస్తే మేం సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం‘‘ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

4. ఎక్కడా లేని కొరత ఇక్కడే ఎందుకు?: పవన్‌

వైకాపా నేతలపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయాలని సూచించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారన్నారు. ఇసుకపై ఇతర రాష్ట్రాల్లో లేని ఇబ్బంది ఇక్కడే ఎందుకని ఇసుక కొరతపై నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

5. నిందితుడు మా అదుపులోనే ఉన్నాడు: సీపీ

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిని గౌరెల్లికి చెందిన సురేశ్‌గా గుర్తించామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. బాచారంలోని సర్వే నంబర్‌ 92, 93లో 7 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకాల వ్యవహారంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. నిందితుడు సురేశ్‌ తమ అదుపులోనే ఉన్నాడని.. కాలిన గాయాలతో ఉన్న అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సీపీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

6. భారత × బంగ్లా రెండో టీ20కి తుపాను ముప్పు!

భారత్‌, బంగ్లా రెండో టీ20కి తుపాను ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 7న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇప్పటికే తొలి పోరులో ఓటమి పాలైన టీమిండియా రెండోదైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఒమన్‌ వైపు పయనిస్తోంది. ఏ క్షణంలోనైనా అది దిశను మార్చుకొనే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

7. ‘సరి-బేసి’తో ఏం సాధిద్దామని?: సుప్రీం

దిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యానికి కారణాలు, నివారణ చర్యలపై సోమవారం సుదీర్ఘంగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. దిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణమైనప్పుడు.. ఏటా ఇది ఎందుకు కొనసాగుతూ వస్తోంది? నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పంజాబ్‌, హరియాణాలతో పాటు దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘సరి-బేసి’ విధానంతో దిల్లీ ప్రభుత్వం ఏం సాధిద్ధామనుకుంటోందని ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

8. కేసీఆర్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలి: వీహెచ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగంపై అవగాహనలేని సీఎం.. ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్‌ సమ్మెలు చేశారని నిలదీశారు. కార్మికులు 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని హుకుం జారీచేయడం అప్రజాస్వామికమన్నారు. పలు కేసులున్న కేసీఆర్‌పై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

9. ఐపీఎల్‌: జట్టులో 11 కాదు 15 మంది క్రికెటర్లు

అన్నీ కుదిరితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020లో ఓ అనూహ్య మార్పును చూస్తాం. పొట్టి క్రికెట్‌ లీగ్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ ఓ వినూత్న ఆలోచన చేస్తోందని సమాచారం. వచ్చే సీజన్‌లో ‘పవర్‌ ప్లేయర్’ విధానాన్ని తీసుకురానుందని తెలుస్తోంది.‘ఇకపై ప్రతి జట్టు 11 మంది కాకుండా 15 మందిని ప్రకటిస్తుంది. ఇన్నింగ్స్‌లో వికెట్‌ పడగానే లేదంటే ఓవర్‌ ముగియగానే ఒకరిని సబ్‌స్టిట్యూట్‌ తీసుకోవచ్చు. దీనిని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ప్రవేశపెట్టే ముందు ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నాం’ అని ఓ అధికారి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

10. సీఎస్‌ బదిలీపై స్పందించిన కన్నా

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నియంతృత్వ ధోరణికి ఇదో నిదర్శనమన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తిని బదిలీ చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.