close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ప్రైవేటు రూటు పర్మిట్లపై రేపు ప్రకటన!

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఇచ్చిన గడువు ముగియడం, సమ్మెపై హైకోర్టులో గురువారం విచారణ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. కోర్టులో వినిపించాల్సిన వాదనలతో పాటు, ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్ల విధివిధానాలపై చర్చించినట్లు సమాచారం. గురువారం హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. అదనపు పర్మిట్లపై నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీడియాపై అసహనం మంచిదికాదు

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలతో సంబంధం ఉన్న ముఖ్యమంత్రే మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేయడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, సీనియర్‌ పాత్రికేయులు అనంత్‌ బగేత్కర్‌ పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మీడియా చేసే విమర్శలను సానుకూలంగా తీసుకోవాల్సిందిపోయి అసహనం ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని.. ఏపీ ప్రభుత్వం మీడియాకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పుర పోరు తర్వాతే కొత్త సారథి!

పురపాలక ఎన్నికల తర్వాతే రాష్ట్ర కాంగ్రెస్‌కు నూతన సారథి నియామకంపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టిసారించనుందని తెలిసింది. పుర ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. మరోవైపు పుర ఎన్నికలకు రాష్ట్రం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై చర్చ పార్టీలో గందరగోళానికి దారి తీస్తుందని, ఎన్నికల తర్వాతే దృష్టిసారించాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియాకు కొందరు నేతలు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ధరాభారం

రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానం మారిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ నిర్మాణాలపై భారీగా భారం పడబోతోంది. దాదాపు జలవనరులశాఖ కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు, ఇతరశాఖల ప్రాజెక్టుల అంచనా విలువలు రూ.వందల కోట్లల్లోనే ఉంటాయి. దీంతో ఇసుక ధరల భారమూ భారీగానే ఉండబోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం క్యూబిక్‌ మీటరుకు రూ.100గా ఉన్న ధర ఇకపై నిర్మాణాల్లో రూ.375 నుంచి రూ.590 వరకు రకాన్ని బట్టి ధర చెల్లించనున్నారు. ఇందులో కొన్నింటిలో స్క్రీనింగు ఛార్జీలు కూడా కలిపి ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కానిస్టేబుళ్లను కాపలా పెట్టండి

తహసీల్దారు విజయారెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాలకు ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున నియమించాలంటూ రెవెన్యూ సంఘాలు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు బుధవారం విజ్ఞప్తి చేశాయి. రెవెన్యూశాఖపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరాయి. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లోనూ సంతాప దినాలు, కార్యాలయాల విధుల బహిష్కరణ చేపట్టాలని ‘ట్రెసా’ ఉద్యోగులను కోరింది. తహసీల్దారు విజయారెడ్డి హత్యపై సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ నిర్వహించి నిందితులను శిక్షించాలని సమావేశంలో కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాట్సప్‌ ‘గ్రూపు’ ప్రవేశం ఇక మీ ఇష్టమే!

ఎవరెవరు మిమ్మల్ని వాట్సప్‌ గ్రూపుల్లోకి చేర్చవచ్చన్నది నిర్ణయించే అధికారాన్ని ఆ యాప్‌ ఇక మీకే ఇచ్చింది. వినియోగదారుల భద్రత నిమిత్తం బుధవారం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూపుల్లో చేరే విషయంలో ఇప్పటివరకూ ఉన్న ‘నోబడీ’ ఆప్షన్‌ స్థానంలో ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ అనే అంశాన్ని చేర్చింది. దీనిలోకి వెళ్తే అన్ని కాంటాక్టులను లేదా ప్రత్యేకంగా కొన్ని కాంటాక్టులను మినహాయించుకునే సౌలభ్యం ఉంటుంది. మీరు ఇలా ఎవరి కాంటాక్టునైనా గుర్తిస్తే... ఇక వారు ఏ గ్రూపులోనూ మిమ్మల్ని చేర్చలేరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొత్తగా 18 బీసీ కులాలు!

రాష్ట్రంలో బీసీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చేందుకు కసరత్తు పూర్తయింది. సంచార జాతులపై క్షేత్ర స్థాయిలో విద్య, సామాజిక, ఆర్థిక అంశాలపై అధ్యయనం చేసిన తెలంగాణ బీసీ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జాబితాలో చేర్చేందుకు అర్హమైన 18 కులాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత బీసీ కమిషన్‌ కాలపరిమితి అక్టోబరు 28న ముగిసింది. అదేరోజు కమిషన్‌ రహస్య నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన తరువాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు ఆయా జాతులకు రిజర్వేషన్‌ ఫలాలు అందనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వీఆర్‌ఎస్‌ బాటలో 80000 మంది!

తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించింది. 70,000-80,000 మంది ఈ పథకాన్ని వినియోగించుకునే వీలుందని, ఇందువల్ల నెలవారీ వేతన బిల్లులో రూ.7,000 కోట్ల భారం తగ్గొచ్చని సంస్థ అంచనా వేస్తోంది. నవంబరు 4న ప్రారంభమైన ‘బీఎస్‌ఎన్‌ఎల్‌ వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ -2019’ డిసెంబరు 3 వరకు అమల్లో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.కె.పూర్వార్‌ తెలిపారు.  సంస్థలోని 1.50 లక్షల మందిలో వీఆర్‌ఎస్‌కు లక్ష మంది అర్హులైనా, 80,000 మంది వరకు దరఖాస్తు చేసుకుంటారనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ × బంగ్లా మధ్యలో మహా!

సిరీస్‌ ఆశలు నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన రెండో టీ20లో భారత్‌ గురువారం బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. షకిబ్‌, తమీమ్‌ లాంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా తొలి టీ20లో బంగ్లా జట్టు భారత్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. మిగతా రెండు ఫార్మాట్లలో లాగా టీ20 క్రికెట్లో భారత్‌ ఇటీవల కాలంలో అంతగా రాణించలేకపోతోంది. ఈ ఏడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు సిరీస్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఈ నేపథ్యంలో బంగ్లాను ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టికరిపించాలనే పట్టుదలతో భారత్‌ సిద్ధమవుతోంది. కానీ వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హంతకుడు ఎవరు?

అనుష్క ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘నిశ్శబ్దం’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రధారులు. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ నిర్మాతలు. బుధవారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.