close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సాగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 11కి వాయిదా వేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సీఎం గారూ.. చర్చలకు పిలవండి: అశ్వత్థామ

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో జరిగిన విచారణపై కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పందించారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆర్టీసీ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయనీ.. ఐదుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించిన లెక్కలపై సమర్పించిన నివేదికలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిందన్నారు. దయచేసి తమను ఈ నెల 11 లోపు సీఎం చర్చలకు పిలవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. తహసీల్దార్‌ హత్యకేసు నిందితుడు సురేశ్‌ మృతి

అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌ మృతిచెందాడు. తహసీల్దార్‌కు నిప్పంటించే క్రమంలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను తొలుత అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్‌ మృతిచెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. తీరు మార్చుకోకపోతే మూల్యం తప్పదు: బాబు

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే  తమ అక్రమాలకు అడ్డు ఉండదనే భావనలో వైకాపా సర్కారు ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వైకాపా బాధితుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సర్కారు తీరుపై మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడుతూ ప్రజల్ని పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కొత్తపథకం

గిరిజన ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రారంభించింది. సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పథకానికి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో శ్రీకారం చుట్టారు. వందమంది గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ పథకం తీసుకొచ్చారు. ఈ మేరకు గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవి చిన్న, మధ్య తరహా సంస్థలే అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నేను కాదు.. ఫడణవీస్‌ నాయకత్వంలోనే!

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వీటిని కొట్టిపారేసిన గడ్కరీ.. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నాయకత్వంలోనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. శివసేన మద్దతుతో త్వరలోనే ఆయన సీఎంగా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు శివసేన ఎమ్మెల్యేలు?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. అసెంబ్లీ గడువు 9వ తేదీతో ముగియనుండటంతో పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు గవర్నర్‌ను కలిసేందుకు భాజపా సిద్ధమవుతున్న వేళ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. వారిని ముంబయిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు తరలించేందుకు గదులు సిద్ధం చేసినట్లు సమాచారం. అలాంటిదేమీ లేదని శివసేన తోసిపుచ్చుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఆర్టీసీ విభజనకు అనుమతి కోరలేదు: కేంద్రం

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై హై కోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, అలాంటప్పుడు టీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా ప్రశ్నే తలెత్తదని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీ పునర్‌వ్యవస్థీకరణకు తమ అనుమతి కోరలేదని కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెర!

చైనా- అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నెలలుగా ఇరు దేశాలూ ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధిస్తూ వచ్చిన సుంకాలను రద్దు చేసేందుకు అంగీకరించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 12వేలకు పైనే ముగిసిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 184 పాయింట్ల లాభంతో 40,654 వద్ద ముగిసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. లోహ, ఇంధన, బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా చేతులు మారాయి. ఇంట్రాడేలో ఒకనాకొ దశలో 40,688.27 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టించిన సెన్సెక్స్‌ చివరికి 40,653.74 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగింది. 0.38 శాతం లాభంతో 12,012 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.