close

తాజా వార్తలు

చెట్టును కాను.. మీ జట్టును!

హలో ఫ్రెండ్స్‌.. బాగున్నారా..? నేనండీ అరటిచెట్టును.. మిమ్మల్ని పలకరిద్దామని...
ఇంకా నా విశేషాలు కొన్ని చెప్పిపోదామని ఇలా వచ్చా!

న్ను మీరు అరటిచెట్టు అనేస్తుంటారు కానీ.. నిజానికి నేను చెట్టును కాదు.. ఓ రకంగా మొక్కనే. ఎందుకంటే నాలో అసలు కలప అనేదే ఉండదు.
* మరో విచిత్రం ఏంటో చెప్పనా? నాకు ప్రత్యేకంగా కాండం అంటూ ఉండదు! నా ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి.

* నా శాస్త్రీయ నామం... మూసా అక్యునిమిటా(అడవి అరటి). నా పండ్లను సంస్కృతంలో రంభాఫలం, కదలీఫలం అనీ హిందీలో ఖేలా, ఇంగ్లిష్‌లో బనానా అంటారు.
* ఇప్పుడంటే మీరు నన్ను గుటుక్కున మింగేస్తున్నారు. కానీ... అప్పట్లో మమ్మల్ని తినడం కష్టంగానే ఉండేది. ఎందుకంటారా? ఇప్పుడున్నన్ని రకాలు అప్పట్లో లేవు మరి. పండు నిండా విత్తనాలతో అడవి అరటి పండ్లు మాత్రమే ఉండేవి.
*మీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి నాలో బోలెడన్ని రకాలు సృష్టించేశారు. అంటే ఇవన్నీ నా హైబ్రిడ్‌ రూపాలన్నమాట.  
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాలో చాలా రకాలే ఉన్నాయి. ప్రధానంగా కూర అరటి, పండు అరటి రకాలు దొరుకుతాయి.

* మీకు పసుపు రంగు అరటిపండే బాగా తెలుసు కదా. కానీ మాలో ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులో ఉన్న అరటి పండ్లూ ఉన్నాయి.
* మేం ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లో పెరుగుతుంటాం.
* పక్వానికి రాగానే నా నుంచి కాయల్ని వేరుచేసి మాగబెడుతుంటారు.
* ఒకవేళ గెలలను కోయకుండా అలాగే ఉంచినా.. పండటానికి చాలా ఆలస్యమవు తుంది. తొక్క రంగూ అంతగా బాగోదు. పండు అంత రుచి ఉండదు.
* అడవి అరటిలోనే విత్తనాలుంటాయి. ప్రస్తుతం మీరు తింటున్న అరటిపండులో విత్తనాలుండవు. మరి మేం ఎలా మొలకెత్తుతాం అంటారా? పిలకల పద్ధతిలో కొత్త వాటికి రూపునిస్తాం. అంటే ఏం లేదు.. మా మొదళ్ల నుంచి కొత్త పిలకలు
వస్తాయన్న మాట.

* నా చెట్టుకున్న ఆకులు చాలా పెద్దగా ఉంటాయి.

* నా పండు తింటే వెంటనే శక్తి వస్తుంది. చాలామంది మా పండులో కెలోరీలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు. నిజానికి చాలా తక్కువే. సాధారణంగా ఓ పండులో దాదాపు 95 కెలోరీలు ఉంటాయి. ఇంకా మా పండ్లలో సోడియం, పొటాషియం, విటమిన్‌ సి, ఫైబర్‌, విటమిన్‌ బీ6 ఉంటాయి.75శాతం నీరు ఉంటుంది.
* మీతో నాకు అనుబంధం ఎక్కువ. పండ్లనివ్వడమే కాక.. పూజలు, పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇలా ఏ శుభకార్యమైనా... నేను ఉండాల్సిందే కదా.
* చూడటానికి నేను బలహీనంగా కనిపించినా.. చాలా బరువున్న అరటిగెలల్ని మోస్తుంటా. తుపానులు, బలమైన గాలులంటే నాకు చచ్చేంత భయం.
* మేం సాధారణంగా.. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంటాం.

* సీజన్‌ అంటూ లేకుండా.. సంవత్సరం పొడవునా దొరికే ఏకైక పండును నేనే అనుకుంటా! నా కాయలు, ఆకులు, పువ్వులు, మొవ్వ (లేతకాండం)ను సైతం మీరు కూరల్లో వాడతారు.
* నేను మీలా అన్నం తినను అని మారాం  చేయను. ఎందుకంటే నాకు ఆకలి చాలా ఎక్కువ. నేను పెరగాలంటే సారవంతమైన నేల కావాలి. నీరూ ఉండాలి.
* ఒకసారి గెలవేశాక... మేం చనిపోతాం. అప్పుడు మొదట్లో వచ్చిన పిలకలు పెరిగి పెద్దవవుతాయి.
* ఇప్పుడంటే ప్లాస్టిక్‌ విస్తరించి నా ఆకులు మీకు పెద్దగా ఉపయోగ పడటం లేదు. కానీ ఒకప్పుడు భోజనం చేయాలన్నా పార్సిల్‌ కట్టాలన్నా నన్నే వాడేవారు.
* ఈ మధ్యే మా కాండాన్ని ఉపయోగించి పర్యావరణానికి హాని చేయని ప్లేట్లు   తయారు చేస్తున్నారు.
* మీకు అసలు విషయం చెప్పడం మరిచిపోయా. ఓ సారి మీ అమ్మను అడగండి..  మీకు ఆమె మొట్టమొదట తినిపించిన పండు ఏంటని? తప్పక నా పేరే చెబుతారు చూడండి.

సరే ఫ్రెండ్స్‌... ఉంటాను మరి.. బైబై!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.