close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం

సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టంచేసింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది. పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగకరం కాదని ప్రకటించింది. గోప్యత హక్కు, సమాచార హక్కు అనేవి కలిసిమెలిసి ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కేంద్రం అనుమతి అవసరమే: హైకోర్టు

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. హైకోర్టు నిన్న సూచించిన.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రోడ్డు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఏజీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి చర్యలు

ఏపీ మంత్రి వర్గం నేడు అమరావతిలోని సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా కూడా కొనుగోళ్లు జరపాలని ఆయన సూచించారు. సీఎం జగన్‌ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పవన్‌ మద్దతిస్తామన్నారు.. థ్యాంక్స్‌: తెదేపా

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెదేపా నేతలు కలిశారు. ఈ ఉదయం జనసేనాని నివాసానికి వెళ్లిన అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై చర్చించారు. తెదేపా అధినేత  చంద్రబాబు నాయుడు రేపు విజయవాడలో చేపట్టనున్న ఇసుక దీక్షకు మద్దతు కోరారు. దీంతో జనసేన సంఘీభావం తెలుపుతుందని పవన్‌ చెప్పారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెదేపా నేతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీలో ఇసుక అక్రమంగాతరలిస్తే రెండేళ్ల జైలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడతామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష విధించాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. రాష్ట్రంలో పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మాతృభాషను విస్మరిస్తే మట్టిలోకే..:పవన్‌

తెలుగు భాషను విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోక తప్పదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. మాతృభాష పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు బయటకు రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. తమిళ భాషపై చిన్న మాట అంటే ఆ రాష్ట్రం మొత్తం ఒక్కటైందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణ: జగ్గారెడ్డి

ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రం ‘ఆత్మహత్యల తెలంగాణ’గా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. స్వరాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఉండవని సీఎం కేసీఆర్‌ చెప్పారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. 39 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగడం ఇదే తొలిసారని.. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నీతా అంబానీకి అరుదైన గౌరవం

ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, దాత, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్‌లోని అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భాజపాలోకి అనర్హత ఎమ్మెల్యేలు

కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయ్యొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కాసేపటికే ఆ ఎమ్మెల్యేలంతా కాషాయ కండువా కప్పుకునేందుకు  సిద్ధమయ్యారు. గురువారం పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో వారంతా భాజపాలో చేరనున్నట్లు ఉపముఖ్యమంత్రి సీఎన్‌ అశ్వత్‌నారాయణ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 

10. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

​​​​​​​కొనుగోళ్ల కళతో ఇటీవలి కాలంలో కొత్త రికార్డుల్లోకి దూసుకెళ్లిన దలాల్‌స్ట్రీట్‌.. బుధవారం బేర్‌మంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలపై నెలకొన్న అనిశ్చితితో అంతర్జాతీయ మార్కెట్లు డీలా పడ్డాయి. lనేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 229 పాయింట్లు దిగజారి 40,116 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 11,840 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 56 పైసలు కోల్పోయి 72.02గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.