close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. తిరుమల తరహాలో అయోధ్య

రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన నేపథ్యంలో అయోధ్య అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించారు. అయోధ్యకు ఓ రూపు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. తిరుమల తరహాలో తీర్చిదిద్దేందుకు సమాయత్తమయ్యారు. రిసార్టులు, ఫైవ్‌ సార్ట్‌హోటల్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, బస్‌ టెర్మినల్‌ సహా సరయూ నదిలో జల విహారం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. అందుకే సింగపూర్‌ ఒప్పందం రద్దు: బొత్స

పరస్పర అంగీకారంతోనే అమరావతి స్టార్టప్‌ ప్రాజెక్టు నుంచి సింగపూర్‌ కన్సార్షియం తప్పుకుందని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించమని కోరితే కన్సార్షియం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. అందుకే ప్రభుత్వంతో వారికున్న పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఇకపై రెవెన్యూకార్యాలయాల వద్ద పోలీసు భద్రత

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య నేపథ్యంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసుల సహకారంతో భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉన్న నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘ఆత్మహత్యలు వద్దు..అంతిమ విజయం మనదే’

ఆర్టీసీ కార్మికుడు నరేశ్‌ ఆత్మహత్య దురదృష్టకరమని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ నరేశ్‌ మృతదేహానికి అశ్వత్థామరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు నైతిక స్థైర్యం కోల్పోవద్దన్నారు. ఆత్మహత్యలు వద్దు.. అంతిమ విజయం మనదేనని అశ్వత్థామ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘భారత్‌, చైనా వేసే చెత్తంతా మాకొస్తుంది’

భారత్‌, చైనా, రష్యా లాంటి దేశాలు సముద్రంలో పడేస్తున్న చెత్తంతా లాస్‌ఏంజెల్స్‌కు వస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా దేశాలు తమ పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలను, పొగ గొట్టాలను శుభ్రపర్చుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని ఆరోపించారు. న్యూయార్క్‌ ఎకనమిక్‌ క్లబ్‌ సదస్సులో పాల్గొన్న ట్రంప్‌.. పర్యావరణ మార్పులు, భూతాపం వంటి అంశాలను ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. జే ట్యాక్స్‌ కోసమే ఇసుక తరలిస్తున్నారు: లోకేశ్‌

సిమెంట్‌ కంపెనీల నుంచి ‘జే’ ట్యాక్స్‌ వసూలయ్యే వరకు వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. వైకాపా ఇసుక మాఫియా లిస్ట్‌.. ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉందని దుయ్యబట్టారు. జగన్‌ ఇసుకాసుర లీలలు బయటపడ్డాయన్న లోకేశ్‌ .. వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. విద్యార్థుల ఆగ్రహజ్వాల: వెనక్కితగ్గిన జేఎన్‌యూ

దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం  (జేఎన్‌యూ) హాస్టల్‌ ఫీజుల పెంపు నిర్ణయంపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు రావడంతో వెనక్కి తగ్గింది. ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి ఎస్‌. సుబ్రహ్మణ్యం ట్విటర్‌లో ఈ విషయంపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘మహా’ రాజకీయాలపై తొలిసారి స్పందించిన షా

మహారాష్ట్ర రాజకీయాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారి పెదవి విప్పారు. ఎన్నికలకు ముందు సీఎం పీఠంపై శివసేనతో ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాతే శివసేన ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చిందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోయేది లేదని అమిత్‌ షా తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో బుధవారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భాజపాలోకి వచ్చేస్తారు: సోము వీర్రాజు

ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు సహా, పలువురు నేతలు భాజపాలో చేరే అవకాశముందని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో ఇవాళ విశాఖలో సమావేశమైనట్లు చెప్పిన ఆయన.. త్వరలోనే తమ బలం మరింత పెరగబోతోందన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వివిధ పార్టీల నేతలతో చర్చల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. భాజపా ఎదుగుదలలో ఇదొక అంకం మాత్రమే’’ అని సోము వీర్రాజు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ముగ్గురు తెదేపా నేతలకు నోటీసులు: శ్రీకాంత్‌రెడ్డి

శాసనసభ సభాపతి స్థానాన్ని కించపరిచేలా విమర్శలు చేసిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌, మాజీ విప్‌ కూన రవికుమార్‌కు నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో సభాపతి తమ్మినేని సీతారామ్‌ను ప్రతిపక్ష నాయకులు దూషించారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.