close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. 3 రోజుల్లో ముగింపు: బంగ్లాపై భారత్‌ విజయం

అనుకున్నదే జరిగింది. కోహ్లీసేన కేవలం మూడు రోజుల్లోనే జయభేరీ మోగించింది. తొలిటెస్టులో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు, శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. భారీ లోటుతో బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లకు 213 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో 60 పాయింట్లు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమే: ఆర్టీసీ

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. ప్రజా సర్వీసుల్లోని వారు సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో హైకోర్టులో ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని, చట్టం ప్రకారం సమ్మె ప్రారంభించడమే చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరుగుతుందని ఆయన చెప్పారు. జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తామని సీఎం అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘మంచి’ అని ముంచుతున్నారు: చంద్రబాబు

ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వారు, ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారనడానికి పత్రికా కథనాలే నిదర్శనమంటూ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను చంద్రబాబు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 30న దిల్లీలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. నవంబర్‌ 30న ‘భారత్‌ బచావో’ పేరిట దిల్లీలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చర్చలకు పిలవాల్సింది పోయి.. రెచ్చగొడతారా?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై దమనకాండను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా నిరవధిక దీక్ష చేస్తామని ప్రకటిస్తే ఆర్టీసీ జేఏసీ నాయకులను గృహ నిర్బంధం చేసి.. వారి ఇళ్లపై పోలీసులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా చర్చించి విలీన డిమాండ్‌ను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించినప్పటికీ..ప్రభుత్వం చర్చలకు పిలవాల్సిందిపోయి రెచ్చగొట్టే పద్ధతిని అవలంబిస్తోందని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వర్షిత హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

ఏపీలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత (6) హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు అంగళ్లు మొలకవారిపల్లెకు చెందిన లారీ క్లీనర్‌ రఫీ (25)గా గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల 7న కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌లోని కల్యాణ మండపం వద్ద వర్షిత హత్యకు గురైన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇసుక దీక్షకు ప్రభుత్వం భయపడింది: తెదేపా

తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ‘ఇసుక దీక్ష’కు ప్రభుత్వం భయపడిపోయిందని ఆ పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమమహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు గెలిచినా ఏపీ సీఎం జగన్‌ అభద్రతా భావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేయడానికి 151 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. తెదేపాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని వైకాపా నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహారాష్ట్రలో భాజపా భయపడుతోంది:ఎన్‌సీపీ

ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన వారు ఎక్కడ తిరిగి సొంతగూటికి చేరతారోనని భాజపా భయపడుతోందని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాజ్‌ మాలిక్‌ అన్నారు. అందుకే ‘భాజపాయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద’న్న ప్రకటనలు చేస్తూ వారినిపట్టి ఉంచే ప్రయత్నం చేస్తోందన్నారు. 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆర్‌కామ్‌కు అనిల్‌ అంబానీ రాజీనామా

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ శనివారం రాజీనామా చేశారు. ఆర్‌కాం భారీ నష్టాలతో ఉన్న విషయం తెలిసిందే.  బకాయిలు చెల్లించలేకే ఆర్‌కాం తన మొబైల్‌ కార్యకలాపాలను మూసివేసింది. ఐబీసీ నేతృత్వంలోని దివాలా ప్రక్రియ ద్వారా ఆర్‌కాం ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నవారిలో రిలయన్స్‌ జియో కూడా ఒకటిగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.