close

తాజా వార్తలు

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.  పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు దర్శనానికి బయల్దేరారు. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. నేటి నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అచంచలమైన భక్తి ప్రపత్తుల మధ్య నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ ప్రారంభ దర్శనానికి పోటెత్తారు.  అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా దాదాపు 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 

10 మంది తెలుగు మహిళల్ని వెనక్కి పంపిన పోలీసులు 

స్వామి దర్శనార్థం శబరిమలకు వెళ్లిన నిషేధిత వయసున్న విజయవాడ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన  10 మంది తెలుగు మహిళల వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వారిని వెనక్కి పంపారు.  దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలను ముందుకు పంపడం కుదరడంలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఇక చేసేదేమీ లేక వారంతా తిరుగుముఖం పట్టారు. 

ప్రచారం కోసం శబరిమలకు రావొద్దు: కేరళ మంత్రి

గతేడాది జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కేరళ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేవలం ప్రచారం కోసం శబరిమలకు రావాలనుకునే మహిళలకు రక్షణ కల్పించబోమని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్‌ ప్రకటించారు. మీడియా ప్రచారం కోసం ఎవరూ శబరిమలకు రావొద్దన్నారు. ఆందోళనలు నిర్వహించడానికి శబరిమల వేదిక కాదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం ప్రచారం కోసం ఆలయ ప్రవేశం చేస్తామని చెప్పేవారికి ప్రభుత్వ ఎలాంటి మద్దతూ ఇవ్వబోదన్నారు. ఒకవేళ 10-50ఏళ్ల లోపు మహిళలు వెళ్లాలనుకుంటే అందుకనుగుణంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అలాగే, మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబర్‌ 28న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు కూడా నిరాకరించిన విషయం తెలిసిందే.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.