close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్‌

అయోధ్యలోని భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది తమ హక్కు అని ఇస్లామిక్‌ సంస్థ జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఎవరి ప్రోద్భలంతో అఫిడవిట్‌ వేశారు?:ఉత్తమ్‌

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ఆలోచనా చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సునీల్‌శర్మ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎవరి ప్రోద్భలంతో నిరాధార అంశంపై హైకోర్టులో అఫిడవిట్‌ వేశారని సునీల్‌శర్మను ఉత్తమ్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. హైదరాబాద్‌పై ఆ ప్రతిపాదన లేదు: కిషన్‌రెడ్డి

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గత సమావేశాల్లో 370 ఆర్టికల్‌ రద్దు, తలాక్‌ రద్దు బిల్లులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. దీక్ష విరమించేది లేదు: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి ఆయన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు అశ్వత్థామ రెడ్డి ఇంటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. దీక్షను కొససాగిస్తే అశ్వత్థామ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు మీడియాతో చెప్పారు. భుత్వం చర్చలు జరిపేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను విరమించనని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. 

5. త్వరలోనే ఆ మాట నిలబెట్టుకుంటాం :శివసేన

పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ సాహెబ్‌ ఠాక్రే ఆశయం మేరకు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ పునరుద్ఘాటించారు. బాల్‌ ఠాక్రే ఏడో వర్థంతి సందర్భంగా ఆయనకు సంజయ్‌ రౌత్‌ ఆదివారం నివాళులర్పించారు. ‘‘బాల్‌ ఠాక్రే కోసం మేం ఏమైనా చేస్తాం. త్వరలోనే ఆయన కోరిక మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. బాల్‌ ఠాక్రేకు ఉద్ధవ్‌ ఇచ్చిన మాట త్వరలోనే నెరవేరనుంది.’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఏపీలో పరిస్థితులపై చర్చ లేవనెత్తుతాం:గల్లా

పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనా చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చెందిన చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆ హామీ నిలుపుకోవాలని కోరాం:విజయసాయి

పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో విపక్షాల వైఖరిని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.  అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. శివసేన ఎంపీలు ఇక ప్రతిపక్షం వైపు

పార్లమెంట్‌ ఉభయ సభల్లో శివసేన ఎంపీల సీట్లను ప్రతిపక్షం వైపు మారుస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడంతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వాతావరణ మార్పును పాఠ్యాంశాల్లో చేర్చండి

వాతావరణ మార్పు పరిణామాల గురించి పాఠ్యాంశాల్లో బోధించాలని కోరుతూ హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా కేంద్రానికి లేఖ రాశారు.  కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు రాసిలో లేఖలో వాతావరణ మార్పు, స్థిరత్వంల గురించి తెలిసేలా పాఠ్యాంశం రూపొందించాలని చౌతాలా కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పు తీవ్ర సమస్యగా మారుతోందని, ఆ ముప్పు భారత్‌కు కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కియా మోటార్స్‌ నెట్‌వర్క్‌ విస్తరణ..!

దక్షిణకొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారత్‌లో తన మార్కెటింగ్‌, సర్వీసింగ్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న 260 టచ్‌పాయింట్ల సంఖ్యను పెంచి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరికి 300కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విక్రయాల పరంగా కియా  దేశంలో 5వ అతిపెద్ద విక్రేతగా నిలిచింది. కేవలం ఒక్కమోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి కియా ఈ స్థానానికి చేరడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.