close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. ‘రూలర్‌’ టీజర్‌ వచ్చేసింది!

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్‌’. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో టీజర్‌ విడుదల కాస్త ఆలస్యమైంది. ఇప్పటివరకూ ‘రూలర్‌’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్‌, మాస్‌లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

2. గంగపుత్రుల గతి మారుస్తా: సీఎం జగన్‌

గంగపుత్రుల జీవితాలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని తెలిపారు. మత్స్యకారులంతా సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో ఆదాయాన్ని కోల్పోతున్నారని, అందువల్ల వేట నిషేధ కాలంలో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ:కిషన్‌రెడ్డి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ చూపుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై కేసీఆర్‌తో మాట్లాడతానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, అధికారులను దిల్లీ పిలుస్తామని చెప్పారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లూలూతో ఒప్పందం రద్దు అందుకే: మేకపాటి

విశాఖలోని లూలూ గ్రూపునకు కేటాయించిన భూమిపై న్యాయ వివాదం ఉందని,  అందుకే ఆ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేశామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు కారణాలతో లూలూ గ్రూపుతో ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. లూలూ గ్రూపుతో ప్రభుత్వానికి ఏటా రూ. 500 కోట్ల నష్టం వాటిల్లుతుందని, స్థలం విషయంలోనూ వివాదాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాంటి భూములను గత ప్రభుత్వం లూలూ సంస్థకు కేటాయించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 20 ప్లాస్టిక్‌ బాటిళ్లు తెస్తే..రోటీ, సలాడ్‌!

దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై పోరాటం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పెద్ద పోరాటమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణ రాష్ట్రంలోని హిసార్‌ జిల్లా కూడా ప్లాస్టిక్‌ మహమ్మారిని నియంత్రించేందుకు వినూత్నమైన కార్యక్రమాన్ని తలపెట్టింది. 20 ప్లాస్టిక్‌ బాటిళ్లు తీసుకొస్తే తినుబండారాలను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హిసార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ స్థానికంగా ఉన్న రెండు దాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై కాంగ్రెస్‌ వాకౌట్‌

ఎలక్టోరల్‌ బాండ్లు‌, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నిరసన వ్యక్తంచేసింది. శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ అంశాలను కాంగ్రెస్‌ సభ్యులు ఉభయ సభల్లో లేవనెత్తారు. ఎలక్టోరల్‌ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం వ్యవహారాలు ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. నినాదాలు చేసుకుంటూ పొడియంలోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు నిరసన వ్యక్తంచేశారు. సభా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని సభాపతి ఓం బిర్లా ఎంత చెప్పినా వెనక్కి తగ్గలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 21 ఏళ్లకే న్యాయమూర్తి!

దేశంలోనే అత్యంత చిన్న వయసులో న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా రాజస్థాన్‌ యువకుడు రికార్డు సృష్టించాడు. మయాంక్‌ ప్రతాప్‌ అనే 21ఏళ్ల యువకుడు 2019 రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌(ఆర్‌జేఎస్‌) పరీక్షలో టాపర్‌గా నిలిచి సాధించి న్యాయమూర్తి పదవికి అర్హత సాధించాడు. జైపూర్‌లోని మాన్‌సరోవర్‌కు చెందిన మయాంక్‌ రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సును గత ఏప్రిల్‌లో పూర్తి చేసి పట్టా పొందాడు. అనంతరం నిర్వహించిన రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. న్యాయమూర్తి కాబోతున్న పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నెట్‌వర్క్‌18లో వాటాలపై సోనీ ఆసక్తి..?

రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్‌18లో వాటాలను కొనుగోలు చేసే అంశంపై సోనీ చర్చలు జరుపుతోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలు రకాల డీల్స్‌పై సోనీ పలురకాల డీల్స్‌ను దీనికోసం పరిశీలిస్తోంది. సోనీ తన భారతీయ విభాగం వ్యాపారాన్ని కూడా దీంతో కలిపే అవకాశం ఉంది. ఈ వార్తలు బయటకు రావడంతో గురువారం నెట్‌వర్క్‌18 షేర్లు దాదాపు 15శాతం ఎగశాయి. మరోపక్క టీవీ18 బ్రాడ్‌కాస్టింగ్‌ లిమిటెడ్‌ షేర్లు కూడా 9.7శాతం పెరిగాయి. ఈ డీల్‌ ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆసీస్‌తో గులాబి టెస్టుకు కోహ్లీ షరతులు

సన్నాహక మ్యాచ్‌ ఉంటేనే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో గులాబి టెస్టు ఆడతామని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు.  హఠాత్తుగా పింక్‌ టెస్ట్‌ ప్రతిపాదన తీసుకురావడంతోనే 2017-18 పర్యటనలో ఆడకపోవడానికి కారణమని వెల్లడించాడు. ఈడెన్‌ వేదికగా టీమిండియా తొలిసారి బంగ్లాదేశ్‌తో డే/నైట్‌ టెస్టు ఆడుతున్న సందర్భంగా విరాట్‌ మీడియాతో మాట్లాడాడు. ‘ఆస్ట్రేలియాతో గులాబి టెస్టు ఎప్పుడు పెట్టినా ముందు సన్నాహక మ్యాచ్‌ కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే గులాబి బంతి క్రికెట్‌కు మేం ముందుగానే అలవాటు పడాలి’ అని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 76 పాయింట్లు నష్టపోవడంతో 40,575 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 30 పాయింట్లు క్షీణించి 11,968 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.74గా ఉంది. నిఫ్టీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.