close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ప్రభుత్వం చర్యలతో శ్రమంతా వృథా:చంద్రబాబు

ఎన్నో సంప్రదింపులు జరిపి.. నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని తెదేపా అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు రావడంతో పాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధి జరిగేదని చెప్పారు. సీఎం జగన్‌ తెలివితక్కువ నిర్ణయాలతో తమ శ్రమంతా వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు లూలూ గ్రూప్‌ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ట్విటర్‌లో స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికుల యత్నాలు

ఎలాంటి షరతులు లేకుంటే విధుల్లో చేరేందుకు సిద్ధమని పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల డిపోమేనేజర్‌ శ్రీనివాసరావును 280 మందికార్మికులు కలిసి వెంటనే విధుల్లో చేర్చుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని,  ఆదేశాలు వచ్చినవెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుంటామని డీఎం చెప్పడంతో కార్మికులు వెనుదిరిగారు. విధుల్లో చేరేందుకు సిద్ధమని హన్మకొండ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ కాలయాపన చేసింది: అమిత్‌ షా

అయోధ్య కేసు, కశ్మీర్‌ సమస్య పరిష్కారం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భాజపా జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా లతేహార్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కశ్మీర్‌ సమస్యను పరిష్కరించకుండా 70ఏళ్లు తాత్సారం చేసిందని దుయ్యబట్టారు. రాజ్యాంగ చట్రానికి లోబడి అయోధ్య వివాదాన్ని పరిష్కరించాలని చూస్తున్న సమయంలోనే ఆ శ్రీ రాముడి ఆశీస్సులతో మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంలో తీర్పు వచ్చిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆంగ్ల బోధనకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు

తెలుగు మాధ్యమం కొనసాగిస్తూనే ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేసిందని గుర్తు  చేశారు. మాతృ భాష తెలుగును కాపాడాలన్నదే తెదేపా విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు కావాలి. వృత్తిలో రాణించేందుకు ఆంగ్లం అవసరం. ఆంగ్ల మాధ్యమ బోధనకు తెదేపా వ్యతిరేకమనే దుష్ర్పచారం తగదు. అబ్దుల్‌ కలాం ప్రతిభా అవార్డులను వైఎస్‌ఆర్‌ పేరుగా మార్చాలని చూశారు’’ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నూతన చట్టంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం!

నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాల్లో 9శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 మధ్య 3,375 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. గతేడాది ఇదే సమయంలో 3,729 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. నూతన మోటారు వాహనచట్టానికి సంబంధించి పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు గడ్కరీ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎంగా ఉద్ధవ్‌.. మంత్రి పదవులు సమానంగా?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తుది అంకానికి చేరింది. మరాఠా పీఠంపై శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్‌ నేతృత్వంలో సరికొత్త కూటమి కొలువుదీరేందుకు దాదాపు కసరత్తు పూర్తయింది. అయితే, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎన్సీపీ, కాంగ్రెస్‌ కోరుతున్నట్టు సమాచారం. మంత్రి పదవుల పంపకంపై మూడు పార్టీల్లోనూ ఇంకా ఎలాంటి స్పష్టతా రానట్టు సమాచారం. అయితే, మూడు పార్టీలకూ సరి సమానంగా మంత్రి పదవులు పంచాలని కాంగ్రెస్‌ కోరుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 2021లో తమిళనాట అద్భుతం జరగనుంది..

రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతం చేయబోతున్నారని చెప్పారు. కమల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2021లో తమిళనాడు ప్రజలు రాజకీయంగా నూరు శాతం అతిపెద్ద అద్భుతం చేయబోతున్నారు’’ అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కీలక పాత్ర పోషించబోతున్నట్లు తన వైఖరిని తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కోతులు సమోసాలకు అలవాటు పడ్డాయి

కోతులు ఫ్రూటీ, సమోసా, కచోరీలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భాజపా ఎంపీ, సినీనటి హేమమాలిని అన్నారు. పార్లమెంటులో గురువారం హేమమాలిని మాట్లాడుతూ.. తన నియోజకవర్గం మథురలో పర్యటించే పర్యాటకులు కోతులకు ఫ్రూటీ, సమోసా, కచోరీలు అలవాటు చేశారని చెప్పారు. ఫలితంగా వాటి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే కోతులకు ప్రత్యేకంగా సఫారీ ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాకినాడ తీరంలో ముగిసిన ‘టైగర్‌ ట్రయంప్‌’ విన్యాసాలు

10. అమ్మాయి కోసం.. అమ్మనగలు చోరీ

అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ చేసిన తనయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం కాలనీలో నివసించే అరుణ్‌ గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, రూ.50వేల నగదు చోరీ చేశాడు. ఇంట్లోని నగదు, బంగారం తన కుమారుడే అపహరించాడని గుర్తించిన తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.