close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఈడెన్‌ తోట.. గులాబి ఆట

భారత్‌లో చరిత్రాత్మక డేనైట్‌ టెస్టుకు వేళైంది. శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆరంభమయ్యే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత జట్టు ఢీకొంటుంది. బంగ్లాకు కూడా గులాబి బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడడం ఇదే తొలిసారి. నైట్‌ టెస్టు మధ్యాహ్నం 1కి ఆరంభమవుతుంది. 3 నుంచి 3.40 వరకు లంచ్‌ విరామం. సాయంత్రం 5.40 నుంచి 6 వరకు టీ బ్రేక్‌ ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆర్టీసీని మోయలేం

ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. సంస్థ ఆర్థిక పరిస్థితి, న్యాయస్థానంలో నిర్ణయాలు, నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ప్రమాదాలకు చుక్క.

ఏపీలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసుశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రతి ప్రాంతం (బ్లాక్‌స్పాట్‌) వద్ద ఒక్కో రోడ్డు భద్రత వాహనాన్ని 24 గంటలూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఆ వాహనంలోని సిబ్బంది అక్కడి నుంచే  కార్యకలాపాలు కొనసాగించేలా ఆదేశాలివ్వనుంది. బ్లాక్‌స్పాట్స్‌ వద్ద నిఘా కెమెరాలనూ ఏర్పాటు చేయబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆంధ్రం, ఆంగ్లం రెండూ అవసరమే

భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు..వృత్తిలో రాణించడానికి ఆంగ్లం అవసరం అనేదే తమ పార్టీ విధానమని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంగ్లం వద్దనిగానీ..ఆంగ్లానికి వ్యతిరేకమనిగానీ తామెక్కడా పేర్కొనలేదన్నారు. మాతృభాష తెలుగును కాపాడాలని మాత్రమే చెప్పామన్నారు. పేద విద్యార్థులకు ఆంగ్లమాధ్యమ బోధనకు తెదేపా వ్యతిరేకమని వైకాపా దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తేలిగ్గా తెలిసేలా ఔషధాలపై తెలుగు

సాధారణంగా మందుల పేర్లన్నీ ఆంగ్లంలోనే ఉంటాయి! సర్కారు దవాఖానాలకు వచ్చే రోగులు మందులను గుర్తించడంలో ఇబ్బంది పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం..ఈ దుస్థితిని రూపుమాపడంపై దృష్టిపెట్టింది. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందజేసే ప్రతి ఔషధంపైనా తెలుగులోనే పేరుండేలా తాజాగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న అన్ని రకాల ఔషధాలపై ఆంగ్లంతో పాటు తెలుగులోనూ మందుల ‘జనరిక్‌’ పేర్లను ముద్రించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఇక పంచాయతీల్లోనూ స్పందన

ఇక నుంచి ప్రతి పంచాయతీ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆ గ్రామంలోని ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకొని సమస్య అక్కడే పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకు జిల్లాలోని అన్ని పంచాయతీలు, గ్రామ సచివాలయాల్లో స్పందన కౌంటర్లు రాబోతున్నాయి. డిజిటల్‌ అసిస్టెంట్‌గా నియమితులైన ఉద్యోగి ఈ కౌంటర్‌లో ఉండి ప్రజల నుంచి అర్జీలు తీసుకొని కంప్యూటరీకరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. రెండు రోజుల్లో మహారాష్ట్రలో సర్కార్‌

అన్నీ అనుకూలిస్తే శనిలేదా ఆదివారంలోగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ముంబయిలో శుక్రవారం శివసేన నేత ఉద్దవ్‌ఠాక్రేతో కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై మరింత స్పష్టత వస్తుందని నాయకులు చెపుతున్నారు. గత రెండురోజులుగా దిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు, శుక్రవారం తిరిగి ముంబయిలో కేంద్రీకృతం కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలి

370 అధికరణం రద్దు తరువాత జమ్మూ-కశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై వచ్చిన ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 370 అధికరణం రద్దు, అనంతర పరిస్థితులపై కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ సహా పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారతీయులపై పాక్‌ ఉగ్ర చర్యలు

జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద ముఠా నాయకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస భద్రతా మండలి తీర్మానించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతోంది. ఉగ్రవాద కేసుల్లో భారతీయులను ఇరికించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు చైనా సహకరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి సహా ఇద్దరు వ్యక్తులను ఇలాగే ఉగ్ర ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలను, వాటిని భారత్‌ అడ్డుకున్న తీరును ఓ ఆంగ్ల పత్రిక ప్రస్తావించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. ‘జలియన్‌వాలా బాగ్‌’పై క్షమాపణలకు హామీ

మానవాళి చరిత్రలో అత్యంత క్రూరమైన ఉదంతాల్లో ఒకటిగా నిలిచిపోయిన ‘జలియన్‌వాలా బాగ్‌ నరమేధం’పై భారత్‌కు క్షమాపణలు చెప్తామంటూ బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో బ్రిటన్‌ గతంలో చేపట్టిన వలస పాలనపై ఆడిట్‌ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అమృత్‌సర్‌లో జరిగిన ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ వెనక బ్రిటన్‌ పాత్రపై బహిరంగ సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.