close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. అమ్మభాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం

మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి అసాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎంతగా అభివృద్ధి చెందామని అనుకుంటున్నా, అమ్మభాషను విస్మరిస్తే ఆ సాధించినదానికి అర్థం ఉండదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రసంగించారు. మాతృ భాషల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. అంతరించే దశలో ఉన్న సొంత భాషల అభివృద్ధికి వివిధ వర్గాల ప్రజలు సాగిస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందని, అందుకే 2019ని ‘అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం’గా ప్రకటించిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  శ్రీహరివాసం..ప్లాస్టిక్‌ రహితం

ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కలియుగ వైకుంఠధామం తిరుమల సంపూర్ణ స్వచ్ఛతను క్రమేణా సాధిస్తోంది. స్వామివారు కొలువైన తిరుమల వ్యాప్తంగా కాలుష్య కారకాలను నిషేధించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. వచ్చే సంక్రాంతి నుంచి మంచినీటి ప్లాస్టిక్‌ సీసాలనూ నిషేధించనుంది. నిత్యం తిరుమలకు వచ్చే లక్ష మంది భక్తులతో పాటు స్థానికులు, వ్యాపారుల దైనందిన కార్యకలాపాల వల్ల పెద్దఎత్తున తడి, పొడి చెత్త పోగవుతోంది. రోజుకు సగటున 5.40 టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. అంటే నెలకు 162 టన్నుల వ్యర్థాలుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేంద్రం ఉత్త చేతులు.. రాష్ట్రం ఎదురుచూపులు!

తెలంగాణ ప్రతిష్ఠాత్మక నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌ ఔషధనగరి, జహీరాబాద్‌ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌), కాకతీయ మెగా జౌళిపార్కు, వరంగల్‌- హైదరాబాద్‌ పారిశ్రామిక నడవా ప్రాజెక్టుల ప్రగతికి కేంద్ర సాయం విధిగా అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆశించిన స్పందన లేదు. పారిశ్రామిక, జౌళి రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులను చేపట్టింది. వీటి ద్వారా భారీ పెట్టుబడులను అంచనా వేసింది. భూసేకరణ ఇతర పనులు దాదాపుగా పూర్తయినా... నిధుల కొరత వల్ల ప్రాజెక్టుల ప్రారంభానికి జాప్యం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో ఆపరేషన్‌ ఆకర్ష!

‘రాష్ట్రంలో ఆపరేషన్‌ ఆకర్షకు భాజపా నేతలు తెరతీశారు. దుబాయ్‌లో ఎంపీ సీఎం రమేష్‌ కుమారుడు నిశ్చితార్థం వేదికగా పావులు కదుపుతున్నారు. ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి భాజపా, వైకాపా, తెదేపా నాయకులను తీసుకెళ్తున్నారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికారం కోసం భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్రలో అజిత్‌పవార్‌పై భాజపా ప్రభుత్వం అనేక ఆర్థిక నేరాలు మోపిందని... అదే ప్రభుత్వం ఆయన మద్దతు తీసుకుని అధికారంలోకి రావడం దురదృష్టకరమని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నెలకు రూ.800 కోట్లు అవసరం

 విద్యుత్‌ కొనుగోళ్లకు భారీగా నిధులు అవసరమని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తాజాగా అంచనా వేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈనెల నుంచి వచ్చే మార్చి వరకూ నెలకు రూ.800 కోట్ల చొప్పున మొత్తం రూ.4 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదించాయి. కరెంటు కొనుగోలు, సరఫరాకు నిధులు తప్పక అవసరమని పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిస్కంలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గత మార్చి నుంచి అక్టోబరు వరకూ నిధులు విడుదల సరిగ్గా లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తమిళుల్లా పోరాడాల్సిన సమయమిది

తమిళ భాష, సంప్రదాయాల కోసం తమిళులు పోరాడినట్లే మనమూ మన భాష కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగును కనుమరుగు చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు చేస్తున్న ప్రచారాన్నే ప్రభుత్వమూ చేస్తూ తెలుగును మరణశయ్యపైకి తీసుకెళుతోందని వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కుప్పలు కుప్పలుగా తాబేళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట-పొగళ్లపల్లి మధ్య ఖాళీ ప్రదేశంలో వేలాది తాబేళ్లు ప్రత్యక్షమయ్యాయి. స్థానికులు వాటిని సొంతం చేసుకోవటానికి ఎగబడ్డారు. తిమ్మంపేట సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో ముళ్లపొదల మాటున నలుపు, తెలుపు రంగుల్లో మెరిసిపోతున్న వేలాది తాబేళ్లు కుప్పలుగా ఉన్న విషయం పరిసర గ్రామస్థులకు తెలిసింది. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, కూలి పనులకు వెళ్తున్న వారు ఆటోల్లో తాబేళ్లను నింపుకున్నారు. ములకలపల్లి ఎస్సై సురేష్‌, రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని మిగిలిన 40 తాబేళ్లను రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మూడేళ్లలో రుణ రహితం!

వచ్చే మూడేళ్లలో రుణ రహిత సంస్థగా మారడమే తమ ముందున్న లక్ష్యమని అరబిందో ఫార్మా వెల్లడించింది. అమెరికాకు చెందిన నొవార్టిస్‌ అనుబంధ సంస్థ శాండోజ్‌ ప్లాంట్లతో పాటు కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు పెట్టిన పెట్టుబడుల వల్ల రుణం పెరిగిందని, దీన్ని వచ్చే మూడేళ్లలో చెల్లించేయడమే లక్ష్యమని అరబిందో ఫార్మా సీఎఫ్‌ఓ ఎస్‌.సుబ్రమణియన్‌ వెల్లడించారు. అరబిందో ఫార్మాకు చెందిన అమెరికా విభాగం గత ఏడాది సెప్టెంబరులో శాండోజ్‌ వాణిజ్య కార్యకలాపాలు, 3 తయారీ యూనిట్లను కొనుగోలు చేసేందుకు 900 మిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.6,500 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గుబాళించె గులాబి

బంతి మారినా.. ఆట వేళలు మారినా.. టీమ్‌ఇండియా  ఆధిపత్యంలో మార్పేమీ లేదు. తొలిసారిగా డేనైట్‌లో, గులాబి బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడిన కోహ్లీసేన.. భారీ విజయంతో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మూడో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 241 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆడిన బంగ్లా.. 195 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 152/6తో ఆదివారం బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లా.. గంటైనా నిలవలేదు. ఇంకో 43 పరుగులే చేసి ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మరో కథ నచ్చింది

తన అనుభవానికీ... స్థాయికీ తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తోంది అనుష్క. ఆమె పేరు చెప్పగానే కథా నాయిక ప్రాధాన్యమున్న చిత్రాలే గుర్తుకొస్తాయి. పలు భాషల్లో మార్కెట్‌ని సంపాదించుకొన్న అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’లో నటిస్తోంది. తదుపరి చిత్రానికీ ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో అనుష్క కొత్త చిత్రం చేయనున్నట్టు తెలిసింది. అనుష్క శైలి కథానాయిక ప్రాధాన్య కథతోనే, ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.