close

తాజా వార్తలు

గాంధీనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు: అడ్వాణీ సందేశం

న్యూదిల్లీ: భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ.. దేశ ప్రజలకు, తమ పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ పార్టీ గురించి తన బ్లాగ్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. భాజపా శ్రేణులకు ఇది చాలా ముఖ్యమైన రోజు.. ఆత్మపరిశీనతో పాటు గత జ్ఞాపకాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజు. భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరిగా నేను దేశ ప్రజలతో పాటు, కోట్లాది మంది భాజపా శ్రేణులతో నా అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నాను. వారు చూపించిన అభిమానం, గౌరవాల పట్ల నేను రుణపడి ఉన్నాను. ముందుగా నేను గాంధీనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. 1991 నుంచి వారు నన్ను ఆరుసార్లు ఎంపీగా గెలిపించారు. వారి ప్రేమ, మద్దతు నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిచ్చింది’ అని తెలిపారు.

‘14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరాను. అప్పటి నుంచి మాతృభూమికి సేవ చేయడం అలవాటుగా మారింది. నా రాజకీయ జీవితంలో జనసంఘ్‌, భాజపాలతో ఏడు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధంగా ఉంది. మొదట భారతీయ జనసంఘ్‌, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశాం. రెండింటిలో నేను వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాను. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజ్‌పేయీతో పాటు పలువురు స్ఫూర్తిదాయక, నిస్వార్థ నేతలతో పని చేసే గొప్ప అవకాశం నాకు దక్కింది. మొదట దేశం.. ఆ తర్వాత పార్టీ.. సొంత ప్రయోజనాలు చిట్టచివర.. అనే స్ఫూర్తిదాయక సూత్రాన్ని నేను నా జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ పాటించాను. వైవిధ్యాన్ని గౌరవించడం, భావ ప్రకటనా స్వేచ్ఛ.. భారతదేశ ప్రజాస్వామ్య సారాంశంగా ఉన్నాయి’ అని అడ్వాణీ పేర్కొన్నారు.

‘రాజకీయపరంగా మాతో విభేదించే వారిని మేము భాజపాను స్థాపించినప్పటి ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు. మా భావన భారత జాతీయవాదం మాత్రమే. అలాగే, మాతో రాజకీయంగా విభేదించే వారిని మేము ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదు. ప్రతి పౌరుడి స్వేచ్ఛకు మా పార్టీ నిబద్ధతతో కట్టుబడి ఉంటుంది. రాజకీయ పరంగా కూడా ఇదే తీరుతో ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని, దాని సంప్రదాయాలను కాపాడడం అనే విషయాలు భాజపాలో భాగస్వామ్యంగా ఉన్నాయి. అందుకే భాజపా స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలతో పాటు మీడియా స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, పారదర్శకతలను కాపాడడానికి భాజపా కట్టుబడి ఉంది.  మన భారత ప్రజాస్వామ్య విలువలను బలపర్చడానికి మనమంతా ఐక్యంగా పోరాడాలన్నదే నా కోరిక’ అని అడ్వాణీ తెలిపారు. మీడియా సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.