close

తాజా వార్తలు

భూమికి వందనం...

బన్నీ: మామయ్యా! ఇవాళ ఎర్త్‌డే అంటగా? తెలుసా నీకు?
మామయ్య: ఆ... తెలుసు. ఏటా ఏప్రిల్‌ 22న ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు.
బన్నీ: అసలు ఈ రోజును ఎందుకు చేస్తారు?
మామయ్య: అదా... భూమి బాగుంటేనే కదా! మనం బాగుండేది. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మొదలైందిది. ముఖ్యంగా మన భూమి గురించి తెలుసుకోవడానికే ఈ రోజన్నమాట.
బన్నీ: భలే భలే. అయితే ఈరోజే నాకు భూమి కబుర్లు చెప్పవూ?
మామయ్య: ముందు నీకు భూమి గురించి ఏం తెల్సో చెప్పు?
బన్నీ: మరేమో... పర్వతాలు... నదులు... ఎడారులతో ఉంటుంది భూమి. ఏడు ఖండాలుంటాయి. అందులో బోలెడన్నీ దేశాలుంటాయి. ఇంకా సౌర కుటుంబంలో ఉంటుందిది. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలన్నింట్లో భూమి మూడో స్థానంలో ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఇంచుమించు 365 రోజులు పడితే తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అంతేగా?
మామయ్య: గుడ్‌ బన్నీ. బాగానే చెప్పావు. నీకు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. నువ్వన్నట్టు ఇది గ్రహాల్లో ఒకటే. కానీ ఇతర గ్రహాలకు లేని ప్రత్యేకతలు దీనికి బోలెడు. ఇక్కడ మాత్రమే నీళ్లుంటాయి. వాతావరణం కూడా. ఆక్సిజన్‌ కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ జీవులుంటాయి.
బన్నీ: భూమిపై మాత్రమే నీళ్లు ఎందుకున్నాయ్‌?
మామయ్య: ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా లేదా బాగా చల్లగా ఉంటాయి. కానీ భూమి మరీ వేడిగానూ చల్లగానూ ఉండదు. అందుకే ఇక్కడ నీళ్లు ఉంటాయన్నమాట. అయినా ఇతర గ్రహాలపై నీటి జాడల్ని తెలుసుకోవడానికి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.
బన్నీ: ఇంతకీ అసలు భూమి ఎప్పుడు పుట్టింది?
మామయ్య: సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందటే. మొదట్లో చాలా వేడిగా ఉండేది. క్రమంగా చల్లబడింది. ఆ సమయంలోనే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవరూపంలోకి మారడం, భారీ వర్షాలు కురవడంతో నదులు, సముద్రాలు, అడవులు ఏర్పడ్డాయి.
బన్నీ: అది సరే... మామయ్యా! భూమి ఏర్పడినప్పుడే ఇలా ఖండాలతో ఉందా?
మామయ్య: లేదు లేదు బన్నీ. భారత దేశం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా లాంటి ప్రాంతాలన్నీ ఒకప్పుడు ఒక్క ఖండంగానే ఉండేవి. క్రమేణా ఇవి విడిపోయి, వాటిలో కొన్ని మళ్లీ కలిశాయి. మన దేశం ఆసియాలో భాగమైంది కూడా ఇలానే.
బన్నీ: ఓహో! మరి పర్వతాలో?
మామయ్య: ఖండాలు, మైదానాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఎడారులు ఇలా రకరకాలుగా పైకి కనిపించేవన్నీ పెద్ద పెద్ద విడిభాగాలపై ఉన్నాయి. వీటిని టెక్టానిక్‌ ప్లేట్స్‌ అంటారు. భూ గర్భంలోని శిలాద్రవంపై ఇవన్నీ తెప్పల్లా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఇవి ఒకదాన్ని ఒకటి ఢీకొనడం వల్లనే పర్వతాలు ఏర్పడ్డాయి.
బన్నీ: చిత్రంగా ఉందే. అవును మామయ్యా! భూమిపై 30 శాతమే నేల, మిగిలిన భాగమంతా సముద్రమే ఉంటుందటగా.
మామయ్య: అవునవును. ఆ కొద్ది నేల మీదనే మనతో పాటు జంతువుల్లాంటి ఇతర జీవరాశులు, చెట్లు అన్నీ ఉంటాయ్‌.
బన్నీ: భూమికి ఒక్కటే చందమామ కదా!
మామయ్య: అవును. భూమికి ఉన్న సహజ ఉపగ్రహమిది.
బన్నీ: అది సరే. భూమిపైన ఉన్నవాటి గురించి తెలిసింది కానీ లోపల ఏముందో పెద్దగా తెలియట్లేదు. ఒక్కసారి భూమిలోకి నన్ను తీసుకెళ్లొచ్చు కదా..
మామయ్య: హ్హ... హ్హ.. హ్హ... లోపల చాలా వేడిగా ఉంటుంది. అసలు ఎవరూ వెళ్లలేరు. లోపలికి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. అలా కేంద్రంలోకి అదే మధ్యలోకి వచ్చేసరికి వేల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది.
బన్నీ: అవునా?
మామయ్య: హా. సర్లే ఇప్పటికే ఆలస్యమైంది. ఎక్కువగా ఆలోచించకుండా పడుకో.
బన్నీ: నాకైతే భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సంగతులన్నీ వింటుంటే. ఓసారి లోపలికి వెళ్లి చూడాలనుంది.
‘నేను చూపిస్తా వస్తావా?’
బన్నీ: అదేంటీ మామయ్యా... గొంతు మార్చి మాట్లాడుతున్నావు?
‘ఆయన ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు.
ఇది మీ మామయ్య గొంతు కాదు... నాదీ. చంద్రుడి పైకెళితే చంద్రయాన్‌. మరి మనం భూమిలోకి... అంటే భూయాన్‌కి వెళదాం వస్తావా?’


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.