close

తాజా వార్తలు

వేడెక్కిన దిల్లీ రాజకీయం.. నేతలు బిజీబిజీ

దిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ అనంతరం దిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. దిల్లీ పీఠంపై అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత నుంచి అన్ని పార్టీలూ తమతమ అంచనాలను విశ్లేషించుకుంటున్నాయి. దీంతో కీలక నేతలంతా భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ కాగా.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతతో భేటీకి కోల్‌కతాకు వెళ్లారు. ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీతో నితిన్‌ గడ్కరీ సమావేశమయ్యారు. అలాగే, నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎవరి విశ్లేషణలు వారివి..
నిన్న ఎగ్జిట్‌ పోల్స్‌లో 95శాతం వరకు భాజపా తిరిగి 300కు పైగా స్థానాలతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాలు బయటపెట్టడంతో భాజపా శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమకు 300కు పైగా స్థానాలు వస్తాయని, మరోసారి మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేతలు చెబుతూ వస్తున్నారు. మరోవైపు,  కాంగ్రెస్‌ నేతలు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు ఇచ్చిన అంచనాలను కొట్టిపారేస్తున్నారు. 1999 తర్వాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఏ ఒక్కటీ ఇప్పటివరకు సరిగ్గా అంచనాలు ఇచ్చిన దాఖలాల్లేవని, 2014 ఎన్నికల్లో కూడా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఒక్క విషయం తప్ప భాజపాకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేకపోయాయని అంటున్నారు. 2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూసుకుంటే ఏ ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ సరైన నివేదికల్ని బయట పెట్టలేదని పేర్కొంటున్నారు. అందువల్ల ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారమైతే అధికారంలో ఉన్న భాజపాకు సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా వచ్చే ఆస్కారం ఉందేమోగానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఆ పార్టీకి వచ్చే అవకాశాలులేవని విశ్లేషిస్తున్నారు. ఈ వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మానిప్యులేటెడ్‌ అని విపక్షాలు భావిస్తున్నాయి.

కౌంటింగ్‌లో జాగ్రత్తలపై పార్టీల దృష్టి 
ప్రతి పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఏయే వర్గాల ప్రజలు తమ వైపు నిలిచారు? ఏ వర్గం వారు తమకు ఓటేశారు? ఏ విధంగా పోలింగ్‌ జరిగిందనే విశ్లేషణలతో పాటు కౌంటింగ్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి? కౌంటింగ్‌కు వెళ్లే ఏజెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈవీఎంల విషయంలో ఏవిధంగా వ్యవహరించాలి? కౌంటింగ్‌ సందర్భంలో తలెత్తే సందేహాలను ఏవిధంగా లేవనెత్తాలి? అలాగే, ఎన్నికల అధికారులతో ఎలా వ్యవహరించాలనే దానిపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నాయి. భాజపాకు చెందిన ముఖ్య నేతలు కీలక భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఆరెస్సెస్‌ పెద్దలతో గడ్కరీ భేటీ కాగా.. మోదీ కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత మోదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అందరు నేతలతో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తున్నట్టు సమాచారం. అలాగే, కాంగ్రెస్‌కు సంబంధించి ఇప్పటికే సమీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నేతలతో రాహుల్‌  గాంధీ సమీక్షించారు. మిగతా  రాష్ట్రాలకు చెందిన నేతలతోనూ వరుస భేటీలు నిర్వహిస్తూ ఫలితాల సరళి ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా పావులు?
ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్డీయే కూటమి 300 సీట్లకు పైబడి సీట్లు గెలుచుకుంటుందని వెల్లడికావడంతో భాజపా నేతలు ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ నెల 23 తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణపై కమలనాథులు సన్నద్ధమవుతుంటే.. మరోవైపు భాజపాయేతర పార్టీలన్నీ తమ వంతుగా ఏం చేయాలి? ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. దిల్లీ కేంద్రంగా చంద్రబాబు నిన్న పలువురు నేతలతో జరిపిన చర్చల సారాంశాన్ని అందరితో సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్డీయేతర పక్షాలను ఏకంచేసే పనిలో భాగంగా సోమవారం కోల్‌కతాకు వెళ్లారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారు. భాజపాయేతర కూటమిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేసిన మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌తో లఖ్‌నవూలో భేటీ అయ్యారు. పోలింగ్‌ తదనంతర పరిణామాలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు దిల్లీకి చేరుకుంటారు. మమత సైతం దిల్లీకి వచ్చే అవకాశం ఉంది.

నిర్వచన్‌ సదన్‌ వద్ద రేపు విపక్షాల నిరసన
23 పార్టీల నేతలను దిల్లీ రావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 21 విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఏ ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరించలేదని, ఈసారి ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా, అధికార పక్షానికి వంతపాడుతూ వచ్చిందని ఆరోపిస్తున్న నేతలు.. ఎన్నికల సంఘం అధికారుల వైఖరిని నిరసిస్తూ నిర్వచన్‌ సదన్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈసీ కార్యాలయం వద్ద ధర్నా చేపడతారు. అనంతరం వీరంతా ఒకేచోట భేటీ అయి తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఎన్డీయేతర కూటమిపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించనున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.