close

తాజా వార్తలు

ఇందుకే మళ్లీ ఆమోదీంచారు!

మోదీని గెలిపించిన 10 ముఖ్యాంశాలివే!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సమకాలీన నేతల్లో మోదీ అంతటి రాజకీయ దురంధరుడు లేరు!  వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకోవడం. వాటికి తగినట్లు వ్యూహాలను మార్చుకోవడం.. ఆయన శైలి. ఎప్పుడు మాట్లాడినా రాజకీయ స్పృహతోనే మాట్లాడతారు. అలానే వ్యవహరిస్తారు కూడా!  ప్రత్యర్థులు కాస్త నోరు జారారా.. ఇక అంతే! వాటినే బ్రహ్మాస్త్రాలుగా మలిచి వారిపైకే ప్రయోగిస్తారు.

ఈ విషయం తెలియక మోదీపై నోరుజారి పదవులు పోగొట్టుకొన్న నేతలు కూడా ఉన్నారు. 2019 ఎన్నికలు మోదీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. ఆయన చరిష్మానే నమ్ముకొని భాజపా ఈ ఎన్నికల బరిలోకి దిగింది. 2014లో మోదీ పరిస్థితి వేరు.. అప్పట్లో ఆడ్వాణీ వంటి కురువృద్ధులు కూడా మోదీ వెంట ఉండి పార్టీని నడిపించారు. కానీ, 2019 వచ్చే సరికి అడ్వాణీ తెరమరుగైపోయారు. భాజపాలో మోదీ, అమిత్‌ షా మాత్రమే ప్రధాన ప్రచారకర్తలుగా మారిపోయారు. మోదీ గీసిన గీతను అమిత్‌షా దాటరన్నది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో పార్టీ భారం మొత్తం నరేంద్ర మోదీపైనే పడింది.

అలలొచ్చినా తలొంచని నైజం..
2014 తర్వాత జరిగిన పార్లమెంట్‌ స్థానాల ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లను భాజపా కోల్పోయింది. ఎన్నికలకు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫూల్‌పూర్‌, కైరానా, గోరఖ్‌పూర్‌ ఎన్నికల్లో ఓటమి భాజపాలో ప్రమాద ఘంటికలు మోగించాయి. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు భంగపాటు ఎదురైంది. ఆర్‌ఎల్‌డీ వంటి మిత్రపక్షాలు దూరమయ్యాయి. కిందటి ఎన్నికల్లో భాజపాకు అత్యధిక స్థానాలిచ్చిన రాష్ట్రాల్లో ఒక్క గుజరాత్‌ మినహా మిగిలిన చోట్ల ఆ పార్టీకి ప్రతికూల పవనాలు వీచాయి. కానీ, పార్టీ నేతలు ఆందోళనగా ఉన్నా, మోదీలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించలేదు. మెల్లగా పార్టీ ఇమేజిని పేదలకూ, సామాన్యులకూ దగ్గర చేసే పనిలో పడ్డారు. ప్రతిపక్షాల బలాలు, బలహీనతలపై మోదీకి కచ్చితమైన అంచనా ఉంది. అందుకే ఎక్కడా నల్లధనం, డీమానిటైజేషన్‌ అంశాలను ప్రతిపక్షాలు బలంగా వాడుకోకుండా వ్యూహరచన చేశారు. ఇవి నేరుగా ప్రజలపై ప్రభావం చూపినవి. వాటి చురుకుదనం జనాలకు తెలుసు. కానీ, రఫేల్‌ ప్రభావం సామాన్యుడికి ఎలా తెలుస్తుంది!! అందుకే, ప్రతిపక్షాలను వ్యూహాత్మకంగా ఉచ్చులోకి లాగినట్లు రఫేల్‌ చుట్టూ తిప్పారు. ఎన్నికల సమయంలో రఫేల్‌ వివాదం ప్రచారాస్త్రంగా మారింది. కానీ, ఈ విషయం సుప్రీంకు చేరడంతో ప్రతిపక్షాలు అనుకున్న స్థాయిలో దీనిపై ప్రచారం చేయలేకపోయాయి.

క్లీన్‌ ఇమేజ్‌..
మోదీపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోవడం భాజపాకు కలిసొచ్చే అంశంగా మారింది. ఆయన హయాంలో రఫేల్‌ కొనుగోళ్ల విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నా.. అవి కోర్టు పరిధిలోకి వెళ్లడంతో వాటిపై ప్రతిపక్షాలు దూకుడుగా వెళ్లలేకపోయాయి. ఒక దశలో ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ నోరుజారిన రాహుల్‌గాంధీ కోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీనిని కూడా భాజపా ప్రచారాయుధంగా మలచుకొంది. దీనికి తోడు తన కుటుంబ సభ్యులపై కూడా ఎటువంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఇవ్వకుండా మోదీ వారిని రాజకీయాలకు దూరంగా ఉంచారు.

జనవరి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు..
ప్రధాని నరేంద్ర మోదీ జనవరి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ కలుస్తాయనే అంచనాలు అప్పట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ ఓటర్లను సంతృప్తి పర్చేందుకు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నతవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. సాధారణంగా రిజర్వేషన్ల అంశం అంటే తేనెతుట్టెను కదిలించడమే. మోదీ అంచనా ప్రకారం యూపీలో అగ్రవర్ణ ఓటర్లు భాజపాకు దగ్గరైతే.. ఎస్పీ, బీఎస్పీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం. ఈ ఒక్క అంశం కాంగ్రెస్‌ను ఆ కూటమి నుంచి బయట ఉంచడానికి ఎస్పీ, బీఎస్పీలకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందనేది ఆయన అంచనా. అదే జరిగితే కైరానా, పూల్‌పూర్‌వంటి చోట్ల ఫలితాలొచ్చే అవకాశాలు తగ్గుతాయి. మోదీ అంచనా నిజమైంది. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌ను దూరం పెట్టాయి. ఫలితంగా అత్యంత బలమైన కూటమి ఏర్పడే ప్రమాదం కనుమరుగైంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలికొచ్చింది. మరోపక్క ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా తాము ఏ పార్టీకి అవసరం లేదనే భావనలో ఉన్న కొన్ని అగ్రవర్ణాలు పక్కాగా భాజపా వైపు మొగ్గాయి. అదే సమయంలో మిగిలిన రిజర్వేషన్‌ వర్గాల నుంచీ ఎటువంటి వ్యతిరేకత రాకుండా మోదీ జాగ్రత్త వహించారు. 

బడ్జెట్‌లో బాటలు..
భాజపా ఆర్థిక విధానాలు కార్పొరేట్లకు మడుగులొత్తేవిగా ఉన్నాయన్న విమర్శలు బడ్జెట్‌ ముందు వరకు విపరీతంగా ఉన్నాయి. మరోపక్క అప్పటి వరకు పెట్రోల్‌ భారం మోసిన సామాన్యుడు కసిమీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో రైతులు, కార్మికులు, ఉద్యోగ వర్గాలను సంతృప్తి పర్చేలా జనాకర్షక పథకాలను చేర్చారు. తెలంగాణ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసిన రైతు బంధు పథకాన్ని పోలిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న 120 మిలియన్ల మంది చిన్న, మధ్య తరగతి రైతులు లబ్ధి పొందారు. ఎన్నికలకు ముందు ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.2,000 జమకావడం భాజపాకు కలిసి వచ్చింది. దీనికి తోడు ఆదాయపన్ను రాయితీని ఇవ్వడం, అసంఘటిత కార్మికులకు బీమా వంటి ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుట్టారు. 

జాతీయ భద్రతను ప్రధానాస్త్రంగా మలిచి..
మొదటి నుంచి జాతీయవాదంలో భాజపాది దూకుడు వైఖరే. కశ్మీర్‌లో ఉగ్రవాదుల అణిచివేతలో చాలా కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఆపరేషన్‌ ఆలౌట్‌ దెబ్బకు ప్రధాన ఉగ్రసంస్థల కేడర్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మరోపక్క కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35ఏల రద్దుపై చర్చ జరుగుతున్న సమయంలో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిపై దేశం మొత్తం భావోద్వేగాలతో స్పందించింది. భావోద్వేగాలను ఓట్లుగా మలచడంలో మోదీకి మించిన నేత లేరనే చెప్పాలి. ఇక్కడి నుంచి భాజపా జోరు పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మోదీ పాక్‌ విషయంలో కఠిన వైఖరిని తీసుకొన్నారు. దాడి జరిగిన తర్వాత రోజుల వ్యవధిలోనే సూత్రధారులను సైన్యం మట్టుబెట్టింది. దీంతో కశ్మీర్‌ విషయంలో మోదీ వైఖరి సరైనదేననే అభిప్రాయం సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది. మరోపక్క పాక్‌ ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచేశారు. ఫలితంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరైంది. మరోపక్క దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతూనే భారత్‌.. ఒక్కసారిగా గేరు మార్చి పాక్‌ని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసింది. 

బాలాకోట్‌పై దాడులు..
ఫిబ్రవరి 26న పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లోని జైష్‌ క్యాంప్‌పై  వైమానిక దాడిని నిర్వహించింది. ఈ చర్యకు దేశం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అనంతరం పాక్‌ భారత్‌పై దాడికి యత్నించి విఫలమైంది. ఈ క్రమంలో పాక్‌కు చిక్కిన భారత పైలట్‌ అభినందన్‌ను తిరిగి భారత్‌ రప్పించడం వంటివి మోదీ ఖాతాలో విజయాలుగా నమోదయ్యాయి. దీనిపై మీడియాలో భారీగా కవరేజీ వస్తుండగానే సార్వత్రిక ఎన్నికల ఢంకా మోగింది. పుల్వామా ఘటన తర్వాత జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా ఐరాసలో భారత్‌ చేసిన యత్నాలు ఫలించడం అధికార ఎన్‌డీఏకు కలిసొచ్చింది. భారత ప్రజల భావోద్వేగానికి సంబంధించిన ఈ పరిణామంతో ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ స్థాయి బాగా పెరిగిపోయింది. ఈసారి ఎన్నికల్లో దాదాపు 30శాతం యువ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. భావోద్వేగాలకు లోనుకాకుండా యువత ఓటేయరు. జాతీయ భద్రత విషయంలో మోదీ వైఖరిని చూసిన యువత ఆయనకు దగ్గరైంది. 

నేరగాళ్ల రప్పింత..
మోదీ విదేశాంగ విధానం సమర్థంగా ఉందనే చెప్పాలి. 2002 నుంచి ఇప్పటి వరకు భారత్‌ 72 మంది నేరగాళ్లను స్వదేశానికి రప్పించింది. వీరిలో ఒక్క మోదీ ప్రభుత్వ హయాంలో 22 మంది భారత్‌కు వచ్చారు. దీంతోపాటు విజయ్‌ మాల్యాపై కేసు నెగ్గడం, ఎన్నికలు దగ్గరపడ్డాక నీరవ్‌ మోదీ ఆచూకీ బయటపడటం వంటివి మోదీ సర్కారుకు ఉపశమనమిచ్చాయి. కీలకమైన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితుడు క్రిస్టియన్‌ మిషెల్‌ను కూడా ఎన్నికలకు ముందే భారత్‌కు రప్పించారు. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టడానికి ఇదొక ఆయుధంగా ఉపయోగపడింది.  మరోపక్క విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌లో సామాన్యులకు అందుబాటులో ఉంటారనే ఇమేజి మోదీ సర్కార్‌కు బాగా ఉపయోగపడింది. విదేశాల్లో ఇబ్బంది పడుతున్న భారతీయులను ఆమె రప్పించిన తీరు సామాన్యుల మన్ననలను అందుకొంది. 

ఇక్కడ మోదీ.. అక్కడ ఎవరు..?
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వానికి మోదీతో పోటీపడే స్థాయి వ్యక్తిని ప్రతిపక్షాలు ముందుకు తీసుకురాలేకపోయాయి. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సమయంలో ప్రతిపక్షాలు ఏకమైనట్లు కనిపించినా అది తర్వాత కాలంలో ఎండమావిగానే మిగిలిపోయింది. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ వేరే కుంపటి పెట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ కూటమికి, కాంగ్రెస్‌కు చీలిపోయింది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని పదవిపై ఆసక్తిగా ఉండటంతో విపక్షాలు ఏకాభిప్రాయం సాధించడం దుర్లభమైపోయింది. దీంతో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే కూటముల కుమ్ములాటలు ఖాయమనే ప్రచారాన్ని భాజపా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ కొంత పోటీపడినా మోదీ స్థాయికి అది ఏమాత్రం సరిపోలేదు. మరోపక్క పొత్తుల విషయంలో భాజపా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీట్ల సర్దుబాటులో మిత్రపక్షానికి అవకాశం ఇచ్చినా అంతిమంగా ప్రధాని పదవి అనే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలని భావించింది. అదే విధంగా అహం పక్కనపెట్టి పొత్తులు కుదుర్చుకొంది. మహారాష్ట్రలో శివసేనతో, బిహార్‌లో జనతాదళ్‌ యునైటెడ్‌, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తులు ఆ పార్టీకి కలిసొచ్చాయి. ఇదే క్రమంలో పంజాబ్‌లో పాతమిత్రుడైన అకాలీదళ్‌ను వదిలిపెట్టలేదు. 

స్థానిక అంశాలను ప్రస్తావించడం..
మోదీ స్వయంగా ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా స్థానిక అంశాలు.. అక్కడి పరిస్థితులపై కనీస అవగాహనతో సిద్ధమవుతారు.  ప్రతి సభలో స్థానికులకు అర్థం కాని జాతీయ అంశాలను తక్కువగా ప్రస్తావిస్తారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన ఈ శైలిని పాటించారు. ఈ వ్యూహం మోదీని స్థానికులకు దగ్గర చేసింది. దీనికి మంచి ఉదాహరణ పశ్చిమ బెంగాలే.. ఆయన అక్కడి రోహింగ్యా వలసలను ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. ఒక దశలో అక్కడ భాజపా ప్రచారం సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైంది. బెంగాల్‌కు ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ అక్షరాలను అందించారు. ఈ అంశం బెంగాలీల భావోద్వేగాలకు సంబంధించినదని కావడంతో వెంటనే మోదీ స్పందించారు. అంతకంటే పెద్ద విగ్రహాన్ని తాము నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో భాజపాను బెంగాల్‌ బయటిపార్టీగా ప్రచారం చేయడానికి  టీఎంసీ చేతికి అందిన ఆయుధం కాస్తా చేజారిపోయింది. ఇలా ప్రతిపక్షాల ఆయుధాలను నిర్వీర్యం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. 

ప్రతిపక్షాల సెల్ఫ్‌గోల్స్‌..
మోదీతో పోటీపడి ప్రచారం అంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి.  ఏమాత్రం నోరుజారినా భాజపా వ్యూహకర్తలు దానిని ఆయుధంగా మలిచేస్తారు. ఒక్కోసారి మోదీనే నేరుగా రంగంలోకి దిగి ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తారు. సోనియా కుటుంబానికి సన్నిహితుడైన కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా బాలాకోట్‌ దాడులపై వ్యక్తం చేసిన సందేహాలు ఆ పార్టీకి నష్టం చేశాయి. ఒక దశలో కాంగ్రెస్‌ ఆ వ్యాఖ్యలను పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోపక్క తమ పార్టీ నేతలను పశ్చిమబెంగాల్లో ఇబ్బందులకు గురిచేసినట్లు భాజపా విజయవంతంగా చిత్రీకరించుకోగలిగింది. అమిత్‌ షా హెలికాప్టర్లకు అనుమతులు లభించకపోవడం వంటివి కమలం పార్టీకి లాభం చేకూర్చినవే. ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న మమత కొంత దూకుడు తగ్గించినట్లయితే పార్టీకి ప్రయోజనకరంగా ఉండేది. దీనికి తోడు ఎన్నికలకు ముందు శారదా స్కాంలో అనుమానితుడిగా ఉన్న కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఆమె అండగా ఉండటం ఇమేజిని దెబ్బతీసింది. శారదా స్కాం బాధితులు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న విషయాన్ని మమతా విస్మరించారనుకోలేము. కానీ, మోదీని వ్యతిరేకించే  క్రమంలో చేసుకొన్న సెల్ఫ్‌గోల్‌ అది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.