close

తాజా వార్తలు

నమో.. నమో.. సమ్మోహనం

ప్రతి మాటా సూటిగా ప్రజల మనసుల్లోకి!

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: అది..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. ఓ విశాలమైన మైదానం. వేల మంది ఒక వ్యక్తి  ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఉత్కంఠకు తెరవేస్తూ భాజపా ప్రచార సారథి.. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడున్న వేదికపైకి ఎక్కారు. నలుదిక్కులా కలియతిరుగుతూ ప్రజలకు నమస్కరించారు. సభికుల్లో కేరింతలు. మోదీ ప్రసంగించనున్నారని మైక్‌లో ప్రకటన. సభలో నిశ్శబ్దం. ‘భారత్‌మాతాకీ జై’ అని నినదించారు ప్రధాని. మరు నిమిషంలోనే సభికులూ ఆయనతో కోరస్‌ పలికారు. ‘‘మీరందరూ ఈ చౌకీదార్‌ సేవలతో సంతృప్తిగా ఉన్నారా’’ మోదీ ప్రశ్న. 
‘‘ఉన్నాం ’’ అని సభికుల సమాధానం

‘‘ మీ చౌకీదార్‌పై విశ్వాసం ఉందా?’’
‘‘ఉంది’’
ప్రధాని స్వరం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ‘‘ఏసీ గదుల్లో కూర్చున్న కొందరు నాయకులు బాలాకోట్‌ను మర్చిపోయారు. మరి మీరు మర్చిపోయారా?’’
‘‘ లేదు.. లేదు..’’ అంటూ వేల మంది ప్రజలు చెయ్యెత్తారు..! 
ఇలా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభల్లో ప్రజలను సమ్మోహితుల్ని చేసేలా ప్రసంగిస్తారు. చిన్న చిన్న పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మాట్లాడతారు. ఎప్పటికప్పుడూ తన ప్రసంగాలను మెరుగుపెట్టుకుంటారు. స్థానిక అంశాలను, భావోద్వేగంతో ముడిపడిన విషయాలను సందర్భోచితంగా ప్రస్తావిస్తారు. ముఖ్యంగా దేశభక్తినీ, ఎన్డీయే హయాంలో జరిగిన అభివృద్ధినీ ప్రస్తావించారు. ప్రతిపక్షాలపై వ్యంగాస్ర్తాలను విసరుతూ చిత్తు చేస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కొత్త పదాన్ని ‘షరాబ్‌’ అని వాడారు. దీని అర్థం సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్ర్రీయ జనతాదళ్‌, బహుజన్‌ సమాజ్‌పార్టీ కూటమి. ‘షరాబ్‌’ అన్న పదానికి అర్థం మద్యం. షరాబ్‌ అనేది ఓ అవకాశవాద కూటమి అనీ.. కేవలం అధికారం కోసమే వారి తాపత్రయమే తప్ప, అభివృద్ధి కోసం కాదనీ ప్రజలనకు తన సందేశాన్ని తెలియజేశారు.

మహాకూటమిపై..
భాజపాను గద్దె దింపాలన్న లక్ష్యంతో ఏర్పడిందే మహాకూటమి అనీ... వారికి ఎలాంటి అభివృద్ధి చేయాలన్న ఆశయం లేదని తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. ‘కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ఆ ప్రభుత్వాన్ని రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించాలన్నదే వారి దురాలోచన’ తన ప్రసంగాల్లో ఆరోపించారు. మహాకూటమి అనేది మహామిలావత్‌ (అంటే భారీ కల్తీకూటమి) అని విమర్శించారు. ఇలాంటి కల్తీకూటమితో దేశానికి ఎలాంటి లాభం లేదన్న సందేశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్లారు.

కాంగ్రెస్‌పై..
కాంగ్రెస్‌ దేశాన్ని 55 ఏళ్లు పాలించినా పేదరికం, ఆకలి.. తదితర సమస్యలు దేశంలో అలాగే ఉన్నాయని... అదే ఎన్డీయే 55 నెలల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఓటర్లకు వివరించేవారు. దేశం ఇన్నేళ్లయినా వెనకబడి ఉందంటే దానికి కాంగ్రెస్‌ పాలనే కారణమని సూటిగా విమర్శించే వారు. మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీ పేరు బోఫోర్స్‌ కుంభకోణంలో ఉందన్న అంశాన్ని ఓటర్లకు గుర్తు చేసేవారు. యూపీఏ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలను ప్రస్తావించేవారు. ఓటమి ఖాయమని కాంగ్రెస్‌కి తెలియడంతో దానికి బాధ్యత వహించి, కుటుంబాన్ని రక్షించడానికి ఇద్దరు నేతల్ని (కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మణిశంకర్‌ అయ్యర్‌, శాంపిట్రోడాలను) ఆ పార్టీ సిద్ధం చేసిందని మోదీ పేర్కొన్నారు.‘గుప్పెడు తల వెంట్రుకలతో భూతప్రేతాలను బంధించినట్లు ఉగ్రవాదుల్ని ఎదుర్కోవాలే గానీ అగర్‌బత్తీలు వెలిగించి కాదు’ అంటూ తీవ్రవాదుల పట్ల కాంగ్రెస్‌ మెతక వైఖరిని దుయ్యబట్టే వారు.

మీ గుండెలు గర్వంతో ఉప్పొంగాయా? లేదా?
అనేక సభల్లో ప్రధాని మోదీ జాతీయవాదం, సర్జికల్‌స్ట్రైక్స్‌, సాయుధ దళాలపై ప్రసంగించేవారు. ‘‘ఈ కాపలాదారు ప్రభుత్వం నేలపైనా, ఆకాశంలోనూ, అంతరిక్షంలోనూ మెరుపుదాడులు నిర్వహించింది’’ అని చెప్పే వారు. నేలపైన అంటే పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌దాడులు... ఆకాశంలో అంటే పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయసేన దాడులు... అంతరిక్షంలో అంటే ఉపగ్రహాలను కూల్చివేసే పరిజ్ఞానాన్ని భారత్‌ పరీక్షించడం. ఇలా జాతీయ వాదాన్ని ప్రజల హృదయాల్లో నాటుకునేట్లు చూశారు. బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ‘‘ఉగ్రవాదులను వారి సొంత ప్రాంతాల్లోనే మోదీ అంతం చేసినప్పుడు మీకు సంతోషం కలిగిందా? లేదా? మీ గుండెలు గర్వంతో ఉప్పొంగాయా? లేదా?’’ అని ప్రశ్నించేవారు. మరో వైపు సాయుధ దళాలకున్న ప్రత్యేక అధికారాలను తొలగిస్తానంటూ కాంగ్రెస్‌ హామీలు ఇస్తోంది. ఇది దేశ ప్రజల అభీష్టానికి వ్యతిరేకమని ఆయన విమర్శించేవారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలన్న డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నవారిని శిక్షించాలని ప్రజలకు పిలుపు ఇచ్చేవారు. 

మమతాబెనర్జీ విమర్శలను తిప్పికొట్టిన వైనం..
ఈ ఎన్నికల్లో పశ్చిమబంగాల్‌ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో డెమోక్రసీని ఆ రాష్ట్ర సీఎం గుండాక్రసీగా మార్చివేసిందని నరేంద్రమోదీ తన ప్రచారంలో ధ్వజమెత్తేవారు. రాష్ట్రంలో రాజకీయహింసపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా ఉనికిని చూసి తృణమూల్‌ శ్రేణులు వణికిపోతున్నాయి అని దుయ్యబట్టారు. ‘‘దీదీ! మీరు చిత్రకారిణి అని, మీ కళాఖండాలు రూ.కోట్లు రాబట్టాయని విన్నాను. అసహ్యకరమైన రీతిలో నా చిత్రాన్నీ గీసి బహుమతిగా మా ఇంటికి తీసుకు రండి. జీవితాంతం దాచుకుంటాను. మీపై కేసు పెట్టను లెండి’ అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. మమత చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణపై భాజపా మహిళా కార్యకర్త ఒకరిని అరెస్టు చేశారు. ఆ వైనం గురించి ఆయన పరోక్షంగా ఇలా ప్రస్తావించారు. బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలనూ భాజపా గెలుచుకుంటుందని, వీటితో కలిపి తమ స్థానాలు 300 దాటిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇది పార్టీ శ్రేణులకు నైతిక బలాన్నిచ్చింది. దీంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ వారు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇవే కాకుండా కాంగ్రెస్‌ వారసత్వ పాలనను ఆయన ప్రజల ముందు ఉంచారు. అసలు ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థి లేకపోవడాన్ని ప్రశ్నించారు. వారు గెలిస్తే ఒక్కోరోజు ఒక్కొక్కరు చొప్పున ప్రధానిగా ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని అభ్యర్థి లేకపోవడం ఓటర్లను ఆలోచింపచేసింది.

అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు..
నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన పలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఇందులో ప్రధానమైనది ఆయుష్మాన్‌ భారత్‌. ఈ పథకం గురించి ప్రధాని వివరించే వారు. అనారోగ్యం బారిన పడిన పేదలకు ఈ పథకం ఎలా సాయపడిందో ఆయన చెప్పేవారు. దీనితో పాటు పలు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటుచేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల్లో పేద రోగులకు అందుతున్న వైద్య సాయాన్ని తెలిపే వారు. పేద మహిళల కోసం ప్రవేశబెట్టిన ఉచిత్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ‘ఉజ్వల్‌’ పథకంతో మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులను ఆయన వెల్లడించేవారు. లబ్దిదారులైన కోట్లాది మహిళలు కమలానికి మద్దతు ఇచ్చారు. ముస్లిం మహిళలకు సంబంధించి ముమ్మారు తలాఖ్‌ను రద్దుచేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణను ఆయన సభలో చెప్పేవారు.  ఇలా ప్రధాని నరేంద్రమోదీ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచారాస్త్రాలు సంధించారు. ప్రత్యర్థుల విమర్శలను అవలీలగా తిప్పికొట్టారు. మోదీ తనను తాను సామాన్యుడిగా పోల్చుకునే వారు. ఒక చాయ్‌వాలా కుటుంబం నుంచి వచ్చిన తాను రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబాన్ని ( రాహుల్‌గాంధీ) ఎలా ఎదుర్కొంటున్నానో చెప్పేవారు. తనకు కుటుంబమే లేదని ఇక అవినీతికి తావెక్కడిదని ప్రశ్నించేవారు. ఈ ఐదేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. కేంద్రీయ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఈసీఐ, ఆర్‌బీఐ..తదితర వ్యవస్థలపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించేవారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్ర అధికారంతో పనిచేస్తాయని తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేసేవారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.