close

తాజా వార్తలు

గెలుపు గుర్రాలేనా?

వన్డే ప్రపంచకప్‌.. ఏ క్రికెటర్‌కైనా, ఏ క్రికెట్‌ జట్టుకైనా దీని కంటే పెద్ద కల, ఇంతకుమించిన పెద్ద లక్ష్యం మరొకటిఉండదు. ఆ కల నెరవేర్చుకోవడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి జట్టూ ఎంతగానో తపిస్తుంది. ఏళ్ల తరబడి శ్రమిస్తుంది. ఎన్నో ప్రణాళికలతో, మరెన్నో ఆశలతో ప్రపంచకప్‌లో అడుగుపెడుతుంది. కోహ్లీసేన కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రపంచకప్‌ కోసం గట్టిగానే సన్నద్ధమైంది. చాలా ముందు నుంచే శ్రమించింది. కోటి ఆశలతో ఇంగ్లాండ్‌ గడ్డపై అడుగు పెట్టింది. మరి ఈ జట్టు కప్పు అందుకోగలదా? అసలు ప్రపంచకప్‌ గెలవాలంటే ఏ లక్షణాలు ఉండాలి? కోహ్లీసేనలో ఆ లక్షణాలు ఏమేరకు ఉన్నాయి? ఏ అంశంలో జట్టుకు ఎన్ని మార్కులు పడతాయి?

నాయకత్వం 
6/10 

సరైన కెప్టెన్‌ ఉంటే జట్టు ఎలా సత్తా చాటుతుందో ఐపీఎల్‌లో ధోని జట్టు చెన్నై ఉదాహరణ. 2011 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కూడా ధోని నాయకత్వం బలంగా నిలిచింది. 1983లో అంచనాల్లేని భారత జట్టును స్ఫూర్తిమంతమైన నాయకత్వంతో విజేతగా నిలిపాడు కపిల్‌. ఐతే కపిల్‌, ధోనిలతో పోలిస్తే కెప్టెన్‌గా కోహ్లి దిగువనే ఉంటాడు. బ్యాటింగ్‌తో విరాట్‌ జట్టును ముందుండి నడిపిస్తాడు. వ్యూహకర్తగా అతడికంత పేరు లేదు. మ్యాచ్‌లో కీలక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతాడు. ఐపీఎల్‌లో వైఫల్యం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగైన జట్టుంది కాబట్టి కోహ్లి మెరుగ్గానే కనిపిస్తాడు. ధోని అండ విరాట్‌కు బలం. కెప్టెన్సీలో కోహ్లికి ఓ మోస్తరు మార్కులే పడతాయి.


అన్వయ సామర్థ్యం 
6/10 

ఎంత బలమైన జట్టున్నా.. పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకోకుంటే కప్పు సాధించడం కష్టం. పేసర్లకు కలిసొచ్చే దేశాల్లో మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా.. 2011లో ఉపఖండ టోర్నీలో చతికిలపడింది. 1983లో ఇంగ్లాండే ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో కపిల్‌ డెవిల్స్‌ పరిస్థితులకు తగ్గట్లు ఆడి విజేత అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ పరిస్థితులు భిన్నం. పిచ్‌లు బ్యాటింగ్‌ స్వర్గధామాలయ్యాయి. వాతావరణం మారితే పిచ్‌లూ మారతాయి. అందుకు తగ్గట్లు సర్దుకోవాలి. నిరుడు ఇక్కడ భారత్‌.. టెస్టు, వన్డే సిరీస్‌లు ఓడింది. కానీ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది ఇక్కడే. అప్పటి కీలక ఆటగాళ్లు ఇప్పుడూ ఉన్నారు. ఎక్కడైనా అద్భుతాలు చేయగల బుమ్రా ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకోగల సామర్థ్యం ఓ మోస్తరుగా ఉన్నట్లే.


ఆల్‌రౌండ్‌ బలం 
7/10 

ఇది ఆల్‌రౌండర్ల ప్రపంచకప్‌.. మాజీలు, విశ్లేషకులు ముక్తకంఠంతో చెబుతున్న మాటిది. ప్రతి జట్టూ ఇద్దరు ముగ్గురు బలమైన ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతోంది. ఈ బలం భారత్‌కు బాగానే ఉంది. హార్దిక్‌ పాండ్య జట్టుకు ఆభరణం లాంటివాడే. ప్రస్తుత ఫామ్‌లో అతను జట్టుకు ఎంతో విలువ చేకూరుస్తున్నాడు. పాండ్య కాకుండా విజయ్‌ శంకర్‌ రూపంలో మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉన్నాడు. అతడిపై పెద్దగా అంచనాలు లేవు. కేదార్‌ జాదవ్‌ రూపంలో ఉపయుక్తమైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఉండటం కలిసొచ్చే అంశం. తుది జట్టులో ఉంటాడో లేదో కానీ.. రవీంద్ర జడేజా సైతం ఆల్‌రౌండ్‌ అస్త్రాల్లో ఒకడే. మొత్తంగా భారత్‌కు ఆల్‌రౌండ్‌ బలం అవసరమైన స్థాయిలోన ఉంది.


ఆ కళ.. 
9/10 

ఇంగ్లాండ్‌ పిచ్‌లు బ్యాటింగ్‌ నిలయాలు. ఆ పిచ్‌లపై బ్యాట్‌్్సమెన్‌ చెలరేగిపోతున్నారు. టోర్నీ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ బలం గురించి చెప్పాల్సిన పని లేదు. కప్పుపై కన్నేసిన జట్లన్నీ ప్రధానంగా బ్యాటింగ్‌ బలంతోనే బరిలోకి దిగుతున్నాయి. ప్రత్యర్థులకు బౌలింగ్‌తో కళ్లెం వేయడమే భారత్‌కు అతి పెద్ద సవాల్‌. బౌలర్లు రాణించకుంటే కప్పుపై ఆశలు పెట్టుకోలేం. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసే, వికెట్లు తీసే బౌలర్‌ ఉండటం ఎంతో కీలకం. బుమ్రా రూపంలో అలాంటి బౌలర్‌ భారత్‌కు ఉండటం అతి పెద్ద బలం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌ అతనే అని చెప్పొచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ గొప్పగా రాణించి ప్రపంచకప్‌లో అడుగు పెడుతున్నాడతను. అవసరమైతే బుమ్రా లాగే రక్షక పాత్ర పోషించగల షమి ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమే.


అనుభవం.. అవగాహన 
8/10 

అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం, ఇంగ్లాండ్‌ పరిస్థితులపై అవగాహన ప్రపంచకప్‌లో కీలకంగా మారే అంశాలు. ఈ రెండింట్లోనూ భారత్‌ అన్ని జట్లకూ దీటుగా నిలవగలదు. జట్టులో మెజారిటీ ఆటగాళ్లు చాలా ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నారు. ప్రపంచకప్‌లో ఆడుతున్న జట్లలో అత్యంత అనుభవం ఉన్న జట్లలో భారత్‌ ఒకటి. ధోని, కోహ్లి, రోహిత్‌, ధావన్‌, షమి, కార్తీక్‌, జడేజా.. ఇలా చాలామందికి సుదీర్ఘ అనుభవం ఉంది. జట్టులో దాదాపుగా అందరూ ఇంగ్లాండ్‌లో ఆడిన వాళ్లే. ఇటీవలే జట్టులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌కు సైతం భారత్‌-ఎ తరఫున ఇంగ్లాండ్‌లో పర్యటించిన అనుభవముంది. కాబట్టి అనుభవం, పరిస్థితులపై అవగాహన విషయంలో భారత్‌కు ఏ ఇబ్బందీ లేదు.

మానసిక దృఢత్వం 
7/10 

ఇంగ్లాండ్‌ పరిస్థితులు సవాలు విసురుతాయా అని ప్రపంచకప్‌ కోసం బయల్దేరే ముందు కోహ్లీని అడిగితే.. పరిస్థితుల కంటే ఒత్తిడిని జయించడమే పెద్ద సవాలన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఎంత భారీ స్కోర్లు నమోదవుతున్నా.. ప్రపంచకప్‌లో ఒత్తిడి వల్ల 260-270 స్కోర్లను కూడా కాపాడుకోవచ్చన్నాడు. ఈ మెగా టోర్నీలో ఉండే ఒత్తిడి మామూలుది కాదు. అంచనాల ఒత్తిడిని తట్టుకోవడం సులువు కాదు. అంత పెద్ద టోర్నీలో, ఇన్ని అంచనాల మధ్య ఆడుతుంటే ఆటగాడు స్థిమితంగా ఉండలేడు. మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంటే ఇంకా కష్టం. ఐతే ఒత్తిడికి చిత్తయ్యే సంప్రదాయ బలహీనతను భారత్‌ ఎప్పుడో విడిచిపెట్టింది. ఇందులో ఐపీఎల్‌ పాత్రా కీలకం. ప్రపంచకప్‌ ఒత్తిడి ఇంకా ఎక్కువే అయినా.. ప్రస్తుత ఆటగాళ్లకు తట్టుకోగల మానసిక దృఢత్వముంది.


ఫీల్డింగ్‌ 
6/10 

క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. ఓడగొడతాయి. పది పరుగులు కాపాడితే.. పది పరుగులు స్కోరులో కలిసినట్లే. ప్రపంచకప్‌ లాంటి టోర్నీలో ఫీల్డింగ్‌ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1983లో కపిల్‌ క్యాచే ఫైనల్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 1999లో గిబ్స్‌ చేజార్చిన క్యాచ్‌తో దక్షిణాఫ్రికాకు కప్పే పోయిందంటారు. ఇలాంటి ఉదాహరణలు మరెన్నో కనిపిస్తాయి. ఫీల్డింగ్‌ బలంగా ఉంటే ప్రత్యర్థిని సులువుగా ఒత్తిడిలో నెట్టొచ్చు. భారత్‌కు ఈ బలం ఓ మోస్తరుగా ఉంది. కెప్టెన్‌ కోహ్లితో పాటు పాండ్య, జడేజా, రాహుల్‌ లాంటి చురుకైన ఫీల్డర్లున్నారు భారత్‌కు. రోహిత్‌, ధావన్‌ కూడా పర్వాలేదు. కేదార్‌, షమి, చాహల్‌ లాంటి వాళ్లు ఫీల్డింగ్‌లో కొంత బలహీనమే. ఫీల్డింగ్‌ భారత్‌కు బలహీనత అయితే కాదు.

ఫినిషింగ్‌ 
7/10 

ప్రతి జట్టూ బ్యాటింగ్‌లో ప్రధానంగా దృష్టిపెట్టేది టాప్‌ఆర్డర్‌ మీదే. ఈ విషయంలో ప్రపంచకప్‌ ఫేవరెట్లన్నింటికీ తిరుగులేదు. కానీ మిడిల్‌, లోయర్‌ మిడిలార్డర్‌ విషయంలోనే తేడా కనిపిస్తుంది. ఉత్కంఠభరిత ముగింపు ముంగిట ఉన్నపుడు ఒత్తిడిని తట్టుకుని నిలబడి మ్యాచ్‌లను ముగించే ఆటగాళ్లుండటం చాలా అవసరం. ఇలాంటి ఆటగాళ్లున్న జట్లే ప్రపంచకప్‌లు గెలుస్తుంటాయి. వన్డే చరిత్రలోనే అతను మ్యాచ్‌ను ముగించాడో తెలిసిందే. గత కొన్నేళ్లలో అతడి ఫినిషింగ్‌ సామర్థ్యం తగ్గింది. ఐతే ఐపీఎల్‌లో సత్తా చాటి ఆశలు రేపాడు మహి. ధోనీకి తోడు కేదార్‌, పాండ్య లాంటి ఫినిషర్లు ఉన్నారు. ఈ విషయంలో భారత్‌ బలం పర్వాలేదు.


ఫిట్‌నెస్‌ 
7/10 

ప్రపంచకప్‌ నెలన్నరపాటు సాగే టోర్నీ. ప్రతి జట్టూ మిగతా 9 జట్లతో మ్యాచ్‌లు ఆడాలి. టీ20లు సులువుగానే లాగించేయొచ్చు కానీ.. వన్డేలంటే మామూలు ఫిట్‌నెస్‌ సరిపోదు. మూణ్నాలుగు రోజుల విరామంతో తొమ్మిది లీగ్‌ మ్యాచ్‌లు.. ఆపై ఇంకో రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడి ప్రపంచకప్‌ గెలవాలంటే గొప్ప ఫిట్‌నెస్‌ ఉండాలి. భారత జట్టులో కెప్టెన్‌ కోహ్లి ఈ విషయంలో అందరికీ ఆదర్శం. ఫిట్‌నెస్‌లో తిరుగులేని స్థాయిని అందుకున్న అతను.. మిగతావాళ్లూ తనను అనుసరించేలా చేశాడు. ధోని, హార్దిక్‌ పాండ్య, ధావన్‌, బుమ్రా, రాహుల్‌, రోహిత్‌ ఫిట్‌గా కనిపిస్తారు. జాదవ్‌ లాంటి ఒకరిద్దరు బలహీనంగా కనిపిస్తారు. ఐపీఎల్‌ తాలూకు అలసట ప్రపంచకప్‌లో మనవాళ్లపై ప్రభావం చూపిస్తుందేమో అన్న ఆందోళన ఉంది.


కూర్పు 
6/10 

ఈసారి ప్రపంచకప్‌పై కన్నేసిన నాలుగైదు జట్లలో బలాబలాలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. ఐతే మ్యాచ్‌ రోజు సరైన, సమతూకం ఉన్న జట్టుతో బరిలోకి దిగడం కీలకం. ప్రపంచకప్‌కు భారత్‌ సరైన జట్టునే ఎంచుకుందా అంటే మాత్రం ధీమాగా ఔనని చెప్పలేని పరిస్థితి ఉంది. పంత్‌ను కాదని కార్తీక్‌ను ఎంచుకోవడం, పెద్దగా సత్తా చాటుకోని విజయ్‌ శంకర్‌కు అవకాశం ఇవ్వడంపై విమర్శలున్నాయి. చాలా కాలం నుంచి కసరత్తు చేసినా నాలుగో స్థానానికి ఓ ఆటగాడు ఖరారు కాకపోవడం ప్రతికూలత. స్వతహాగా ఓపెనరైన రాహుల్‌ను ఈ స్థానంలో ఆడించాలనుకుంటున్నారు. పరిస్థితుల్ని బట్టి శంకర్‌కూ అవకాశమిస్తారేమో. భువనేశ్వర్‌ ఫామ్‌లో లేకపోవడం కూడా కూర్పు పరంగా తలనొప్పిని తెచ్చేదే.Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.