close

తాజా వార్తలు

గట్టి ప్రతిపక్షమేదీ?

‘శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయ నగా...’ భాజపా సారథ్యంలోని ఎన్‌డీఏ 43.8 శాతం ఓట్లతో 350కి పైగా లోక్‌సభా స్థానాలు సాధించి చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. అంతకు 18శాతం తక్కువ ఓట్లు పోలైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ దాదాపు 90 సీట్ల దగ్గరే తారట్లాడింది. ఏ కూటమిలోనూ భాగస్వాములు కాని రాజకీయపక్షాలు 30.3 శాతం ఓట్లతో వందకు పైగా స్థానాల్ని ఒడిసిపట్టాయి. 2014తో పోలిస్తే ఓటింగ్‌ శాతంలో మెరుగుదల ఏ మాత్రం లేని కాంగ్రెస్‌ సొంతంగా గెలుచుకోగలిగింది కేవలం 52 సీట్లు! మొత్తం మీద 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీ అసలు ఖాతాయే తెరవలేదు. మరోవంక 17 రాష్ట్రాల్లో 50 శాతం దాకా ఓట్లు గెలుచుకున్న భాజపా మొత్తం మీద 37.5 శాతం ఓట్లతో సొంతంగానే 303 స్థానాలు గెలుచుకొని అక్షరాలా త్రివిక్రమావతారం దాల్చింది.

2014లో మోదీ హవాలో కొత్తగా చేజిక్కించుకొన్న 104 సీట్లలో ఈసారి ఎనిమిది తప్ప అన్నింటినీ నిలబెట్టుకోవడంలోనూ; తమిళనాడు, కేరళ, ఏపీ, పుదుచ్చేరి మినహాయించి దేశవ్యాప్తంగా తన ప్రాతినిధ్య పాదముద్రను బలంగా వెయ్యడంలోనూ భాజపా అనితర సాధ్యమనదగ్గ రీతిలో పురోగమించింది. కొత్త శతాబ్ది అవసరాలకు, యువభారత్‌ ఆకాంక్షలకు దీటుగా నయా ఇండియా నిర్మాణానికి అనువుగా కేంద్రంలో సుస్థిర, సుదృఢ సర్కారు నెలకొనేలా యావద్దేశం వెలువరించిన విశిష్ట తీర్పు ఇది. కానీ, 2014లో మాదిరిగానే గట్టి ప్రతిపక్షం లేనిలోటు ఈసారీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చేటుగా మారే ప్రమాదంపై ఆలోచనాపరుల ఆందోళన సహేతుకమైనది. క్రితంసారి ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం లభించక మొహం వేలాడేసిన హస్తం పార్టీకి ఈసారీ అదే చేదు అనుభవం పునరావృతమైంది. కేవలం అయిదు, ఆలోపు సీట్లు సాధించిన 22 పార్టీలు కొలువుతీరనున్న పదిహేడో లోక్‌సభలో- రెండంకెల స్థానాలుగల పార్టీలు కేవలం ఎనిమిది కాగా వాటిలో రెండు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే. ప్రతిపక్ష గళం ఇలా కుంచించుకుపోవడం దేశ విశాల హితానికి చెరుపు చేసేదే!


ప్రజల చేత నేరుగా ఎన్నికైన ప్రతినిధుల సభ (లోక్‌సభ)కు కేంద్ర మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించాలని భారత రాజ్యాంగంలోని 75వ అధికరణ నిర్దేశిస్తోంది. 135 కోట్ల జనావళి ఆకాంక్షలకు గొడుగుపట్టే పార్లమెంటు గరిష్ఠ ప్రయోజనదాయకంగా రాణించాలంటే- స్వీయకర్తవ్యాల నిర్వహణ పట్ల అంకితభావం, అభినివేశం గల పాలక ప్రతిపక్షాలు సమ ఉజ్జీలుగా ఉండితీరాలి. ‘ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తూ చర్చించడమే చట్టసభలు చేయాల్సిన పని... ఆ క్రమంలో ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యే అవకాశం ఉన్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అది తప్పనిసరి’ అన్న బ్రిటిష్‌ రాజ్యాంగకోవిదుడు సర్‌ ఐవర్‌ జెన్నింగ్స్‌ అభిప్రాయంలో గట్టి విపక్షం పాత్ర ఎంత కీలకమో ద్యోతకమవుతుంది.

క్రమశిక్షణ, సంస్థాగతంగా మేలిమి నిర్వహణగల పార్టీలున్న ప్రజాస్వామ్యంలో- ప్రభుత్వ పాలనలో లొసుగులు లోపాలు ఏమిటో ప్రతిపక్షాల ద్వారానే ప్రజలు తెలుసుకోగలుగుతారు. విమర్శలూ చర్చలతో సాగే ప్రజాప్రభుత్వమే ప్రజాస్వామ్యం అయినప్పుడు- విపక్ష గళం బలహీనపడటం అటు ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వానికీ చెరుపు చేస్తుంది. సమర్థ ప్రతిపక్షం తప్పొప్పులను ఎత్తిచూపితేనే కదా, విధాన నిర్ణయాల్లో లోటుపాట్లను సరిదిద్దుకొని ప్రభుత్వాలు సుపరిపాలన అందించగలిగేది? పటిష్ఠ సైద్ధాంతిక పునాది లేకుండా, గాలివాలుకు తెరచాపలెత్తే దివాలాకోరు ధోరణులతో పలు పార్టీలు పరువుమాసి ప్రజాదరణ కోల్పోతున్న దురవస్థ దేశవ్యాప్తంగా కళ్లకు కడుతోంది. వారసత్వమో, జనాకర్షణగల ఏకవ్యక్తి కేంద్రంగానో మనుగడ సాగిస్తున్న మెజారిటీ పార్టీలన్నీ సరైన సంస్థాగత నిర్మాణాన్ని, అంతర్గత ప్రజాస్వామ్య వేదికల ద్వారా ప్రజలతో మమేకం కావాల్సిన మౌలిక అవసరాన్ని విస్మరించి జనం దృష్టిలో పలుచనవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి!

‘ఏక వ్యక్తి పెత్తనానికి కోట్లాది జనం తలలూపే దేశంగా ఇండియా ఉండకూడదు. గట్టి ప్రతిపక్షం ఉండి తీరాలి’ అని ప్రగాఢంగా అభిలషించారు తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ. తన వంశాంకురాల సారథ్యంలోనే కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు సైతం సాధించలేనంతగా జనాదరణకు దూరమవుతుందని, దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా పలు రాజకీయ పక్షాల అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసేలా ‘కాంగ్రెస్‌ సంస్కృతి’ జడలు విరబోసుకొంటుందనీ ఆనాడు ఆయన ఊహించి ఉండరు! ఇండియాలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉండగా, భాజపా మినహా తక్కిన ఆరింటికీ కలిపి దక్కిన సీట్లు తొంభై నాలుగు!

కాలానుగుణంగా మారలేక కుదేలవుతున్న వామపక్షాలు కేవలం అయిదు సీట్లతో సరిపుచ్చుకోగా, కాంగ్రెస్‌ సహా తక్కినవన్నీ ప్రజాతంత్ర మౌలిక లక్షణాలకు దూరం జరిగి, ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిల్లాడుతున్నాయిప్పుడు! దశాబ్దాల తరబడి ఫ్రాన్స్‌లో పోటాపోటీగా ఉంటూవచ్చిన కన్సర్వేటివ్‌, సోషలిస్టు పార్టీలు రెండూ దివాలాకోరు రాజకీయాలతో జనాదరణ కోల్పోగా, మార్పు తెస్తానంటూ అధికారానికి ఎదిగొచ్చిన మాక్రాన్‌ చేపట్టిన అపసవ్య సంస్కరణలతో యావద్దేశం సంక్షోభంలో కూరుకుపోతోంది. పార్టీ వ్యవస్థలు పెళుసుబారడం దేశానికే ప్రమాదకరమనడానికి రుజువు అది! మోదీ కరిష్మాయే తమ కొంప ముంచిందని సంకుచితార్థంలో విశ్లేషిస్తున్న పార్టీలన్నీ- విస్పష్ట సైద్ధాంతిక పునాదిని సమర్థ కార్యవర్గ శ్రేణుల సాయంతో భాజపా యుద్ధప్రాతిపదికన విస్తరించుకొంటూపోతున్న వైనాన్ని గుర్తించడం లేదు. నిర్ణయాల్లో దూకుడును నిలువరించి దిద్దుబాట్లకు ఆస్కారమిచ్చే పటిష్ఠ ప్రతిపక్షం లేకపోవడం మోదీ ప్రభుత్వానికీ తీరనిలోటు!
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.