close

తాజా వార్తలు

సుష్మా అడుగుజాడల్లో జయశంకర్‌..

న్యూదిల్లీ: ప్రధాని మోదీ మంత్రివర్గంలో విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్‌కు విదేశాంగ మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆయన విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడుస్తూ తన పదవిని కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్నామంటూ ట్విటర్‌లో భారతీయులు చేసిన విజ్ఞప్తులకు‌‌ సుష్మా వెంటనే స్పందించి, వారి కష్టాలను తీర్చిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు జయశంకర్‌ కూడా ట్విటర్‌లో ఇదే విధంగా స్పందిస్తున్నారు.

తాజాగా, అఫిమ్‌ అనే ఓ మహిళ.. జయశంకర్‌కు ఓ ట్వీట్ చేశారు. ‘‘హలో సర్‌.. దయచేసి నాకు సాయం చేయండి. నా భర్త నన్ను వదిలి హాయిగా కువైట్‌లో ఉంటున్నాడు. ఆయన తిరిగి భారత్‌కు రావాలని నేను కోరుకుంటున్నాను. న్యాయస్థానం జారీ చేస్తున్న సమన్లకు ఆయన స్పందించట్లేదు. ఆయన తల్లిదండ్రులు నన్ను వారి ఇంట్లో ఉండనివ్వట్లేదు’’ అని తెలిపారు. ఆదివారం దీనిపై స్పందించిన జయశంకర్‌... ‘‘కువైట్‌లోని భారత దౌత్యాధికారులు ఈ విషయంపై పనిచేస్తున్నారు. వారితో సంప్రదింపులు జరపండి’’ అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు, ఆయనకు మహాలక్ష్మీ అనే మరో మహిళ ట్వీట్ చేస్తూ... ‘‘మేము జర్మనీ, ఇటలీ ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్నాము. ప్రస్తుతం నేను ఇటలీలోని టోర్బోల్‌లో ఉన్నాను. నాతో పాటు నా భర్త, కుమారుడి పాస్ట్‌పోర్టులను, నా బ్యాగును ఎవరో చోరీ చేశారు. మేము ఈ నెల 3న మ్యూనిచ్‌ వెళ్లి 6వ తేదీలోపు‌ భారత్‌కు ప్రయాణించాల్సి ఉంది. దయచేసి సాయం చేయండి’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జయశంకర్‌.. ‘‘అక్కడి మన దౌత్యాధికారులు మీకు అన్ని విధాలుగా సాయం చేస్తారు. వారితో టచ్‌లో ఉండండి’’ అని తెలిపారు. వినీత్‌ అనే ఓ వ్యక్తి ఆదివారం జయశంకర్‌కు ఓ ట్వీట్ చేసి సాయం కోరారు. ‘‘మేము ముగ్గురం ఒమన్‌లో చిక్కుకుపోయాం. దయచేసి మాకు సాయం చేయండి సర్‌’’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. ‘‘ఒమన్‌లోని మన దౌత్యవేత్తలు మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. వారితో టచ్‌లో ఉండండి’’ అని పేర్కొన్నారు.

కాగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ఇటీవల మొదటిసారి ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నా మంచిని కోరుకుంటున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ బాధ్యతను ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. సుష్మా స్వరాజ్‌ అడుగుజాడల్లో నడవనున్నందుకు గర్వపడుతున్నాను’’ అని ట్వీట్ చేశారు.

 

  
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.