close

తాజా వార్తలు

నవభారతానికి నిబద్ధతతో కృషి: కోవింద్‌

దిల్లీ: ‘అందరితో కలిసి.. అందరికీ వికాసం.. అందరి విశ్వాసం (సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌)’ అనే నినాదం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ఆయన నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. 

ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. ‘ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయం. ఈ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంది. భారత్‌ను అభివృద్ధి పథాన కొనసాగించేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశమిచ్చారు. 17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారే. అంతేగాక, మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. నవ భారత నిర్మాణానికి ఇదే నిదర్శనం’ అని కోవింద్‌ అన్నారు. ప్రభుత్వ అజెండాలోని కీలక అంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..

* ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. ‘‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’’ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. 

* బహిరంగ, అంతర్గత ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 

* 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది.

* రైతుల, జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తాము.

* నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. జల్‌ శక్తి మంత్రిత్వ శాఖే ఇందుకు నిదర్శనం

* ప్రజలందరి జీవన స్థితిగతులు మారుస్తాం. గ్రామీణ ప్రాంతాలకు పూర్థిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. యువతకు మంచి విద్యావకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకొస్తాం. యువ భారత్‌ స్వప్నాలు సాకారం చేస్తాం. 

* నివాస, వైద్య సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సాధికారతతోనే పేదరికాన్ని నిర్మూలించగలం.

* రైతులు, చిన్న వ్యాపారుల భద్రత కోసం ప్రభుత్వం పింఛను పథకం తీసుకొచ్చింది. 

* గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం. క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తాం. క్రీడాకారులకు ఆధునిక శిక్షణ అందిస్తాం. 
*2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ నిధి కింద మూడు నెలల్లో రూ. 12వేల కోట్లు ఇచ్చాం. 40ఏళ్లు దాటిన రైతులకు పింఛను ఇస్తాం. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. 

* మహిళలకు సమానహక్కులు కల్పించాలంటే ముమ్మారు తలాక్‌, నిఖా హలాలా వంటి పద్ధతులను తొలగించాల్సిన అవసరం ఉంది. 

* త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం. జీఎస్‌టీని మరింత సరళీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజారవాణాను మెరుగు పరచడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ‘ఒకే దేశం ఒకే రవాణా కార్డు’ సదుపాయం ఏర్పాటుపై పరిశీలనలు చేస్తున్నాం.

* నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అక్రమ వలసదారులు దేశ భద్రతకు ముప్పు. అందుకే సరిహద్దుల్లో భధ్రతను పెంచుతాం. జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ ప్రక్రియను కూడా కొనసాగిస్తాం. 

* 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం.

 * భారత అంతరిక్ష సామర్థ్యం, దేశ భద్రతా సన్నద్ధతలో ‘మిషన్‌ శక్తి’ సరికొత్త అధ్యాయం. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా ఉన్నాయి. మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడమే దీనికి రుజువు. దేశ భద్రతే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. ఉగ్ర శిబిరాలపై సర్జికల్‌ దాడులు, వైమానిక దాడులు ఉగ్రవాదం పట్ల భారత్‌ తీరును స్పష్టం చేస్తున్నాయి. 

* తరచూ ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరగడం దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. దేశం వేగంగా అభివృద్ది చెందేందుకు ’ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పద్ధతిని అమలు చేయాల్సిన సమయం వచ్చింది అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.