close

తాజా వార్తలు

ముగిసిన నడిగర్‌ సంఘం ఎన్నికలు

ఓటు వేయలేకపోయిన సూపర్‌స్టార్‌ 
ఓటు హక్కు వినియోగించుకున్న కమల్‌, విజయ్‌, విక్రం 
కోర్టు ఆదేశాల అనంతరమే ఫలితాలు
న్యూస్‌టుడే, కోడంబాక్కం

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఎన్నికల రద్దు, మళ్లీ అనుమతి, కోర్టు ఆదేశాలు, వేదికల మార్పులు, చర్చలు, సమావేశాలు, పరస్పర దూషణలు, రాజకీయ నేతలతో భేటి.. వంటి పలు   ఘటనల తర్వాత పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈ ఎన్నికలు సజావుగా సాగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రెండు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకోవడంతోపాటు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి.
ఉదయం 7.10 గంటలకు..
నడిగర్‌ సంఘంలో 2019- 22 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికలివి. విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్‌ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. సంఘంలో మొత్తం 3,644 మంది సభ్యులు ఉండగా వారిలో 3,171 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. ఇటీవల 61 మంది ఓటు హక్కు తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్‌ నేతృత్వంలోని ‘పాండవర్‌ అని’, ఐసరి గణేశ్‌ నేతృత్వంలోని ‘స్వామి శంకరదాస్‌’ జట్లు పోటీ పడ్డాయి. ప్రారంభంలో అడయార్‌లోని ఎంజీఆర్‌ జానకి కళాశాలలో ఓటింగ్‌ జరుగుతుందని ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలను ఆపాలని ఓటు హక్కు కోల్పోయిన 61 మంది ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. దీంతో ఎన్నికలు కూడా రద్దయ్యాయి. చివరకు న్యాయస్థానం తీర్పుతో ముందు అనుకున్నట్లుగానే ఆదివారం పోలింగ్‌ జరిగింది. వేదికను మైలాపూర్‌లోని ఎబ్బాస్‌ పాఠశాలకు మార్చారు. 500 మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7.10 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. అప్పటికే 50 మందికిపైగా కళాకారులు ఓటు వేయడానికి వరుసలో వేచి ఉన్నారు. ఇరు ప్యానల్‌ల ప్రతినిధులు ముందుగానే అక్కడికి చేరుకుని ఏర్పాట్లను, ఎన్నికల తీరును పరిశీలించారు.

కమల్‌, విక్రం, విజయ్‌లు..
విశ్వనటుడు కమల్‌హాసన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆయన ఈసారి ఏ ప్యానల్‌కు మద్దతుగా నిలిచారనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సంఘం ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. మేమంతా ఓ కుటుంబం. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉంది. పోస్టల్‌ ఓట్లు సరైన విధంగా రాకపోవడం బాధగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇలా జరగకుండా చూసుకోవాలి. రజనీకాంత్‌ ఓటు చాలా కీలకమైంది. ఆయన ఓటు లేకపోవడం బాధాకరం’.. అని పేర్కొన్నారు. అదేవిధంగా విజయ్‌, విక్రం, విశాల్‌, నాజర్‌, కార్తిక్‌, మన్సూర్‌ అలీఖాన్‌, పొన్‌వన్నన్‌, భాగ్యరాజ్‌, చార్లి, ప్రశాంత్‌, పాండియరాజన్‌, శ్రీకాంత్‌, కేఎజ్‌ రవికుమార్‌, పార్తిబన్‌, ప్రకాశ్‌రాజ్‌, వివేక్‌, ఉదయనిధి, విజయ్‌ ఆంటోని, తంబిరామయ్య, ప్రసన్న, ఆర్‌జే బాలాజీ, ప్రభు, విక్రంప్రభు, విక్రాంత్‌, శ్యామ్‌, పసుపతి, ఉదయ, రమణలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖుష్బూ, కేఆర్‌ విజయ, రోహిణి, అంబిక, రాధ, శరణ్య, పూర్ణిమ, సంగీత, కోవై సరళ, కుట్టి పద్మిని, నిత్య, నిక్కి గల్రాణి, స్నేహలు ఓటు వేశారు. సాయంత్రం 4 గంటలకు 1535 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు ముగిశాయి. చివరకు తపాలా ఓట్లు కాకుండా మొత్తం 1604 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఓటేయలేకపోయా: రజనీకాంత్‌
ఈ సారి ఎన్నికల్లో పోస్టల్‌ ఓట్లు సమస్యాత్మకంగా మారాయి. బ్యాలెట్‌ పత్రాలు సంబంధిత వ్యక్తులకు చేరడమే క్లిష్లంగా మారింది. పొరుగు ప్రాంతాల్లో ఉన్న చాలా మందికి ఈ పత్రాలు అందడం ఆలస్యమైంది. అంతేకాకుండా శనివారం సాయంత్రం 5 గంటలకే పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సును మూసివేసి అధికారులు సీల్‌ వేశారు. దీంతో రజనీకాంత్‌ వంటి పలువురు నటీనటులు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనిపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘ముంబయిలో సినిమా చిత్రీకరణలో ఉన్నా. నడిగర్‌ సంఘం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ 6.45 గంటలకు అందింది. అందువల్ల ఓటు వేయలేకపోతున్నా’నని పేర్కొన్నారు.
మీడియాకు హితవు
నడిగర్‌ సంఘం ఎన్నికలపై మీడియా చూపుతున్న ఆసక్తిని హాస్య నటుడు వివేక్‌ పరోక్షంగా తప్పుబట్టారు. ఈ ఎన్నికల సరళిపై ఇంత దృష్టి పెట్టడం కన్నా.. నీటి సేకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన మీడియాను కోరారు. మరోవైపు విజయావకాశాలు ఎక్కువగా తమకే ఉన్నాయని నటుడు ప్రశాంత్‌ (శంకరదాస్‌ ప్యానల్‌) పేర్కొంది. అలాగే గెలుపుపై ధీమాతో ఉన్నారు విశాల్‌. ఏదేమైనప్పటికీ న్యాయస్థానం చెప్పిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నారు. అందువల్ల పోస్టల్‌ ఓట్లకు మరింత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని పలువురు తారలు అభిప్రాయపడ్డారు. కేరళతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సంఘం సభ్యులు ఉన్నారని, వారంతా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోటీ చేస్తున్న ప్రముఖులు
పాండవర్‌ అని - నాజర్‌ (అధ్యక్షుడు), విశాల్‌ (ప్రధాన కార్యదర్శి), కార్తిక్‌ (కోశాధికారి), కరుణాస్‌, పూచ్చి మురుగన్‌ (ఉపాధ్యక్షులు)
స్వామి శంకరదాస్‌ అని - భాగ్యరాజ్‌ (అధ్యక్షుడు), ఐసరి గణేశ్‌ (ప్రధాన కార్యదర్శి), ప్రశాంత్‌ (కోశాధికారి), కుట్టిపద్మిని, ఉదయ (ఉపాధ్యక్షులు)
మొత్తం సభ్యులు: 3,644 ఓటు హక్కు కలిగినవారు: 3,171  పోలైన ఓట్లు: 1604

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.