close

తాజా వార్తలు

పీఠం ఎక్కించినా.. మళ్లీ తొలగిస్తారని..

కాంగ్రెస్‌ పగ్గాలు అందుకోవడానికి ముందుకు రాని నేతలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి కాంగ్రెస్‌ ఇంకా బయటపడలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ తన పట్టు విడవకపోవడంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్న అంశంపై ఉత్కంఠ వీడటం లేదు. అప్పడప్పుడూ కొన్ని పేర్లు తెరపైకి వచ్చి మాయమవుతున్నాయి. దీంతో కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

తరాల అంతరం:  కాంగ్రెస్‌లో వృద్ధతరం, యువతరం మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌గాంధీ రాజీనామా చేసినా సీనియర్‌ నాయకులు మిన్నకుండటంపై యువనేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్లు తమ సంతానానికి టికెట్లు కేటాయించాలని పట్టుబట్టడాన్ని సమీక్షా సమావేశంలో రాహుల్‌గాంధీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబానికి చెందిన వారే పగ్గాలు అందుకోవాలని సీనియర్లు కోరుతున్నారు. కానీ రాహుల్‌గాంధీ అందుకు ససేమిరా అంటుండటంతో సమస్య జటిలమైంది.

అది ముళ్ల కిరీటమే.. రాజీవ్‌గాంధీ 1991లో కన్నుమూసిన తరువాత పీవీ నరసింహారావు పార్టీని నడిపించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొంతకాలానికి సోనియాగాంధీతో విభేదాలు ఏర్పడ్డాయి. 1998లో సారథ్య బాధ్యతలు సోనియాగాంధీ చేతికి వచ్చాయి. అప్పటి నుంచి పీవీకి కాంగ్రెస్‌ అత్యున్నత విధాయక మండలి కాంగ్రెస్‌వర్కింగ్‌ కమిటీలో కనీసం చోటు లభించలేదు. 1996-98ల మధ్య కాలంలో పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన సీతారాం కేసరికి పార్టీకి వీర విధేయుడిగా పేరుంది. అయితే ఆయనను కూడా అవమానకరరీతిలో అధ్యక్ష  బాధ్యతల నుంచి తప్పించారు. ఇవన్నీ గుర్తుకు వస్తుండటంతో తాజాగా పార్టీ అధ్యక్షుడిగా సారథ్యం వహించేందుకు ఇష్టపడటంలేదని కాంగ్రెస్‌వర్గాలు పేర్కొంటున్నాయి.  

యువతరానికి లభించని ప్రతిఫలం: కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో యువనేతలు జ్యోతిరాదిత్య సింథియా, సచిన్‌ పైలట్‌లు పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తీరా గెలుపు అనంతరం రాజస్థాన్‌లో అశోక్‌గహ్లోత్‌ను సీఎం పదవి ఇచ్చారు. సచిన్‌ పైలట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టారు. అదే మధ్యప్రదేశ్‌లో వృద్ధ నేత కమల్‌నాథ్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టారు. సింథియాకు ఎలాంటి పదవీ ఇవ్వకపోవడం పార్టీ వర్గాల్లో పలు చర్చలకు దారి తీసింది. 

అన్నింటిలో పెద్దలదే పెత్తనం:  పార్టీలోని అన్ని విభాగాల్లో వృద్ధ నేతలదే పెత్తనమన్న అంశం బహిరంగ రహస్యమే. మోతీలాల్‌ ఓరా, ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, ఊమెన్‌ చాందీ, కమల్‌నాథ్‌.. తదితర నేతల ప్రాబల్యం ఎక్కువ. గతంలో సీడబ్లూసీలో కొత్తవారిని తీసుకోవాలన్న రాహుల్‌ ప్రతిపాదనను వారు అడ్డుకున్నట్టు సమాచారం. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ వారికి చేరువ అయ్యేందుకు వీలుగా ప్రణాళికలు రచించడంతో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారు. యువతరానికి మార్గదర్శకత్వం వహించాలని కోరుతున్నా ముందుకు రావడం లేదు. 

గాంధీ కుటుంబానికే ఆ పదవి.. 1998 నుంచి  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబీకులే నిర్వహిస్తున్నారు. తాజాగా రాహుల్‌గాంధీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఇతరులను నియమించాలని ఆయన సూచించినట్టు సమాచారం. గహ్లోత్‌, చిదంబరం, ఏకే ఆంటోనీ.. తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇతరులు ఎవరైనా ఆ పదవిలో ఉన్నప్పటికీ పూర్తి సారథ్యం గాంధీ కుటుంబం చేతిలోనే ఉంటుందనేది లోక విదితమే. దీంతో పాటు పార్టీకి మంచి కాలం వచ్చినప్పుడు వారిని తొలగించి తిరిగి గాంధీ కుటుంబమే పార్టీ సారథ్యాన్ని తీసుకుంటుంది. దీంతో సీనియర్లు ఆ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.