close

తాజా వార్తలు

కర్నాటకీయంపై తీర్పు రిజర్వ్‌

దిల్లీ: కర్ణాటకలో అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై సందిగ్ధత ఇంకా వీడలేదు. రెబల్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, స్పీకర్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పు రేపటికి రిజర్వ్‌ చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.

రాజీనామాలను పెండింగ్‌లో పెట్టడం ఎందుకు..
అసంతృప్త ఎమ్మెల్యేలు, స్పీకర్‌ పిటిషన్లపై ఈ ఉదయం సుప్రీంకోర్టు వాదనలు ప్రారంభించింది. తొలుత ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘రెబల్స్‌పై అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతోనే స్పీకర్‌ రాజీనామాలను ఆమోదించడం లేదు. అనర్హత వేటు పిటిషన్‌ రాకముందే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు తమ ఇష్టంతోనే రాజీనామా చేశారా లేదా ఎవరైనా బలవంతం చేశారా అన్నది స్పీకర్‌ పరిశీలించాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు స్వయంగా తమ చేతిరాతతో రాజీనామా రాసి ఇచ్చారు. స్పీకర్‌ను కలిసి వివరించారు. అయినా ఆయనకు అభ్యంతరం ఏంటీ? ఎందుకు వాటిని పెండింగ్‌లో పెడుతున్నారు. గురువారం సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉంది. దీనికోసం అధికార పక్షం విప్‌ జారీ చేయాలని చూస్తోంది. రెబల్స్‌ రాజీనామా చేసినా కూడా వాటిని ఆమోదించకుండా వారు బలవంతంగా విప్‌ను అనుసరించేలా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తమ ఇష్టపూర్వకంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీకి రావాలంటూ వారి హక్కులకు భంగం కలిగించకూడదు’ అని రోహత్గి వివరించారు.

రేపటిలోగా నిర్ణయం తీసుకుంటాం..
ఆ తర్వాత అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘స్పీకర్‌ విచక్షణాధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు. రోహత్గి చెప్పిన విషయాలన్ని పూర్తిగా అవాస్తవం. కర్ణాటక అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా వచ్చి రాజీనామా ఇస్తేనే ఆమోదింపదగినదిగా పరిగణిస్తారు. కానీ రెబల్‌ ఎమ్మెల్యేలు అలా చేయలేదు. ఆ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవకుండానే ముంబయి వెళ్లారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశించిన తర్వాతే ఈ నెల 11న 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఇచ్చారు. రాజీనామాలతో పాటు అనర్హత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌ భావిస్తున్నారు. కోర్టు ఆదేశాలిస్తే రేపటిలోగా ఈ రెండింటిపై నిర్ణయం తీసుకుంటారు’ అని సింఘ్వీ తెలిపారు. 

సుప్రీం జోక్యం సరికాదు..
కర్ణాటక సీఎం కుమారస్వామి తరఫున మరో సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ కూడా వాదనలు వినిపించారు. ‘రాజీనామాల ప్రక్రియ సరిగా లేనప్పుడు 6 గంటల్లోగా నిర్ణయం తీసుకోండి అని స్పీకర్‌ను ఆదేశించడం సరికాదు. స్పీకర్‌ నిర్ణయం తీసుకునే విధానంలో సుప్రీం జోక్యం చేసుకోలేదు. ఇక్కడ రాజీనామాల వెనుక ముఖ్య ఉద్దేశం  ప్రభుత్వాన్ని గద్దె దింపడం. మంత్రులు కావాలనే ఆశతోనే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సీఎంను పదవి నుంచి తొలగించాలని అనుకుంటున్నవారి చర్యలు ఇలా బహిర్గతం అవుతున్నాయి’ అని అన్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.