close

తాజా వార్తలు

ఈ భవనాలు.. ప్రజల పాలిట సమాధులు

ముంబయిలో భయంగొల్పుతున్న పురాతన బంగ్లాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: శతాబ్దం నాటి నాలుగంతస్తుల భవనం.. భారీ వర్షాలకు తడిసి ముద్దయి నేడు పేకమేడలా కూలిపోయింది. 12 మందిని బలితీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో జరిగిన ఘోర ప్రమాదం ఇది. డోంగ్రీ ప్రాంతంలో 100ఏళ్ల నాటి ఈ భవనం కూలడంతో 15 కుటుంబాలకు చెందిన 40-50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొందరు భయంతో.. మరికొందరు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. నిజానికి ఈ భవనాన్ని 2017లోనే కూల్చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ అలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. అయితే ముంబయిలో ఇలాంటి ఘోరాలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఏళ్ల నాటి భవనాలు కూలి గతంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 

34మంది ప్రాణం తీసిన 117ఏళ్ల నాటి భవనం

దక్షిణ ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే బేండి బజార్‌ ప్రాంతంలో 2017 ఆగస్టులో ఓ భవనం కుప్పకూలింది. హుసేనీ భవనంగా పిలిచే ఆ అయిదు అంతస్తుల భవనం 117 ఏళ్ల నాటిది. ఈ ప్రమాదంలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 రోజుల చిన్నారి కూడా ఉండటం విషాదకరం. ఈ భవనంలో పలు కుటుంబాల నివాసముండటంతో పాటు ఓ ప్లే స్కూల్‌ కూడా ఉంది. అయితే ప్రమాదం జరిగిన సమయానికి స్కూల్‌ పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెద్ద ఘోరం తప్పింది. 

ఈ భవనం నివాసయోగ్యం కాదని మహారాష్ట్ర హౌసింగ్‌ అథారిటీ ఎప్పుడో నిర్ణయించింది. 2011లోనే అందుకు సంబంధించిన నోటీసులు జారీ చేసింది. ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బక్రీద్‌ నాడే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరగడానికి నెలరోజుల ముందు జులై 25న ఘట్కోపర్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 

నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది..

మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో 2013 సెప్టెంబరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఠానే శివారులోని ముంబ్రా ప్రాంతంలో ఏప్రిల్‌ 4న ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనల్లో అత్యంత విషాదకర ప్రమాదం ఇదే. నిజానికి ఆ భవనానికి నివాసయోగ్య ధ్రువీకరణ పత్రం రాకముందే బిల్డర్లు అద్దెకిచ్చేశారు. ఆరు వారాల్లోనే భవనంలోని కొన్ని అంతస్తులను పూర్తిచేశారు. మరికొన్ని అంతస్తుల్లో నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ స్థానిక అధికారులకు తెలిసినప్పటికీ బిల్డర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం 74 మందిని బలితీసుకుంది. 

మరో ప్రమాదంలో 61 మంది..

2013 సెప్టెంబరు 27న ముంబయిలోని మాజాగావ్‌ ప్రాంతంలో మరో ఘోరం జరిగింది. 32ఏళ్ల నాటి ఓ అయిదు అంతస్తుల భవనం కూలి 61 మంది మృత్యువాత పడ్డారు. ఈ భవనం బృహన్ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందినది. అయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అనుమతి లేకుండా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. దీంతో ఆ భవనం సురక్షితంగా లేదంటూ  స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటన అనంతరం ముగ్గురు బీఎంసీ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇవే కాదు.. ఇటీవల భారీ కురిసిన భారీ వర్షాల సమయంలోనూ పుణె, ఠానే, ముంబయి ప్రాంతాల్లో పలు చోట్ల గోడలు, భవనాలు కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.