close

తాజా వార్తలు

భవనం కూలిన ఘటనలో 14కి చేరిన మృతులు

ముంబయి: దక్షిణ ముంబయిలోని డోంగ్రీ ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 11 మందిని సురక్షితంగా కాపాడారు. ఇంకా కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో భాగంగా జాగిలాలను సైతం రంగంలోకి దింపారు. విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో పాటు ఇతర యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు రాత్రంతా శ్రమించారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

తండెల్‌ వీధిలో నిత్యం రద్దీగా ఉండే ఇరుకైన ప్రాంతంలో ఉన్న కేసర్‌బాయ్‌ భవనంలో 10-15 వరకు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మంగళవారం ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూలడంతో పోలీసులు, అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరుగ్గా ఉండడంతో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలకు తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో స్థానికులు మానవహారంలా ఏర్పడి ఇటుకలను, శిథిలాలను తొలగించేందుకు సహకరించారు. భవనం శిథిలావస్థలో ఉన్నందున అవసరమైన చర్యలు చేపట్టాలంటూ అందులో నివసిస్తున్నవారు చాలాకాలంగా గృహనిర్మాణ అధికారులకు కోరినప్పటికీ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుప్పకూలిన భవనం దాదాపు వందేళ్ల నాటిదని, అయితే అది శిథిలావస్థ భవనాల జాబితాలో లేదని.. దాని పునర్నిర్మాణం కోసం ఓ డెవలపర్‌కు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ తెలిపారు. మరోవైపు మహారాస్ట్ర హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ మాట్లాడుతూ.. భవనం ఎప్పుడో కూల్చివేయాల్సిందని, కానీ బిల్డర్‌ నిర్లక్ష్యం వహించారని తెలిపారు. వెంటనే విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.